🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
నిత్యయుక్తా ...ఎప్పుడో రోజులో కొద్దిసేపో, వారానికి ఒకరోజో కాదు. నిత్యము, నిరంతరము భగవంతుని యందే ఉండాలి.
రోజూ ఒక గంటో - రెండు గంటలో డ్యూటీ లాగా భగవంతుని స్మరిస్తే అది నిజమైన భక్తికాదు. నిజమైన ఉపాసన కాదు.
పూజ చేసేటప్పుడో, భజన చేసేటప్పుడో, జపధ్యానాలు చేసేటప్పుడో, దేవాలయంలో కూర్చున్నప్పుడో, లేదా ఇలా సత్సంగాలలో పాల్గొన్నప్పుడో భగవంతుని యందు మనస్సు పెట్టి మిగిలిన సమయాలలో ఇక భగవంతుని స్మరణయే లేకుండా ఉంటే అది నిత్యభక్తి కాదు, అతడు నిత్యయుక్తుడు కాదు.
సర్వకాల సర్వావస్థలలోను భగవత్ స్మరణను విడిచిపెట్టరాదు. నిజంగా భగవంతుడెప్పుడూ మనను విడిచి ఉండటం లేదు. మనం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఏం చేస్తున్నా చివరకు చనిపోయినా సరే ఆయన మనలోనే స్థిరంగా ఉన్నాడు. కాని మనమే ఈ ప్రాపంచిక విషయాలకోసమో, భోగాల కోసమో ఆయనను విడిచిపెడుతున్నాం. అలా ఉండకూడదని భగవానుని ఉపదేశం.
పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్నన్, అశ్నన్, గచ్ఛన్, స్వపన్, శ్వసన్ - కంటూ, వింటూ, తింటూ, తిరుగుతూ, తెస్తూ, ఇస్తూ, లేస్తూ, కూర్చుంటూ సర్వకాల సర్వావస్థలలోను చిత్తం భగవదాయత్తమై ఉండాలి.
అంతటా ఆ భగవంతునే చూస్తూ, నిరంతరమూ ఆ భగవంతుని చింతించటమే నిత్యయుక్తః అంటే. అట్టి భక్తుడే శ్రేష్టతముడు అని భగవానుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు.
తేనెటీగ పుష్పాలలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ఈగ కొద్దిసేపు బెల్లం మీద వాలుతుంది. కొద్దిసేపు పెంటకుప్పల మీద వాలుతుంది. పేడపురుగు ఎప్పుడూ పెంటకుప్పలలోనే ఉంటుంది. ఒకవేళ దానిని తెచ్చి పుష్పాలలో వేస్తే చచ్చి ఊరుకుంటుంది. మనం తేనెటీగలాగా ఎల్లప్పుడూ భగవంతునిలోనే చరించాలి. ఈగలాగా కొద్దిసేపు భగవంతునిపైన, కొద్దిసేపు ప్రపంచవిషయాల మీద వ్రాలకూడదు.
నిరంతరము శ్రీకృష్ణుని యందే మనస్సు నిల్పిన గోపికలు నిత్యయుక్తులు. శ్రేష్టభక్తులు. ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని స్మరించకుండా ఉండలేరు. తమ తిండితిప్పలు మరచిపోతారే గాని శ్రీకృష్ణుని మాత్రం మరచిపోరు. రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా నిత్యము, నిరంతరము శ్రీకృష్ణ సందర్శనాభిలాషులై తపించిపోతూ ఉంటారు. ఆయన కనిపించకపోతే వారికి నిముషమొక యుగంలా ఉంటుంది.
ఒక గోపికకు కృష్ణుని చూడాలనే తపన అధికమైంది. పెద్దల చాటున ఉండవలసిన ఆ గోపిక, స్వతంత్రించి కృష్ణ దర్శనానికి పోయే అవకాశం లేక తపనపడి పోతున్నది. ఎలాగో మనసు బిగబట్టుకొని సాయంకాలం వరకు వేచి ఉన్నది. సాయంత్రం గోధూళి వేళ అయింది. గోవులను తోలుకుంటూ కన్నయ్య వస్తున్నాడు.
ఆ గోధూళిలో మసకమసకగా అప్పుడప్పుడు కనిపించి కనుమరుగై పోతున్నాడు కన్నయ్య. అతడిని దర్శించాలంటే నందుని ఇంటికి పోవాలి. ఇదే సరైన సమయం. ప్రమిద - వత్తి తీసుకొని ముట్టించుకొని వచ్చేందుకని నందుని ఇంటికి బయలుదేరింది. నందుని ఇంట ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ఊరి వారంతా సంధ్యవేళ అక్కడికి వెళ్ళి దీపం ముట్టించుకొని వస్తుంటారు. ఆ గోపిక అలాగే నందుని ఇంట ప్రవేశించి దీపం గూటి వద్దకు వెళ్ళింది. దీప దర్శనంతో పాటు దివ్యమంగళ విగ్రహం ఆ శ్రీకృష్ణుని కన్నులారా దర్శించింది. నందుని ఇంటిలో ఆ సజీవ దీపాన్ని చూస్తూ ఈ నిర్జీవ దీపాన్ని మరచింది. దీపం వద్ద వత్తిని పెట్టి వెలిగించాలనుకున్నది. కాని ఆమె పరధ్యానంతో - శ్రీకృష్ణ ధ్యానంతో తనవ్రేలును పెట్టింది. అగ్నికి దయ ఎక్కడుంటుంది? వ్రేలు కాలిపోతున్నది.
ఆ సమయంలో ఆమె దేహాన్నే కాదు, ప్రపంచాన్నే మరచింది. ఆమె మనస్సు మనస్సులో లేదు, ఆమెలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. భక్తితో కరిగిపోయిన ఆమె మనస్సు భగవంతునిలో లీనమై పోయింది.
ఇది చూస్తున్న యశోద ఒక్క పరుగున వచ్చి ఏమిటమ్మా! ఇది? నిద్రపోతున్నావా? రాత్రి నిద్రపోకుండా మేలుకొని ఉన్నావా? అని ఆమెను కదిపి మందలించింది.
అప్పుడు కదిలింది ఆమె మనస్సు. ఆమెకు కాలం తెలియలేదు. వ్రేలు కాలటం తెలియలేదు. బాధ తెలియటం లేదు. తన కృష్ణ సందర్శన కుతూహలం నెరవేరింది.
ఇలా గోపికలు నిరంతరం కృష్ణస్మరణలో తరించారు.🙏
సేకరణ🙏
No comments:
Post a Comment