*వినాయకుడు కుజునికి ఇచ్చిన వరం ఏమిటి?*
నవగ్రహాలలో ఒకటైన కుజ గ్రహాన్ని *అంగారకుడు , మంగళుడు* అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం కుజుడిని భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు.
ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని నర్మదా నది తీరంలో 1000 సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. ఆ విధంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయటంవల్ల కుజుడికి వినాయకుడు *మాఘ బహుళ చవితి* చంద్రోదయం నాడు వినాయకుడు పది భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు.
ఆ విధంగా కుజుని తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజుడితో నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగగా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుని పూజిస్తాడు. అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని , అంతేకాకుండా తను ఎప్పుడు వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలా వరం ఇవ్వవలసిందిగా కుజుడు వినాయకుని కోరుకుంటాడు. అందుకు వినాయకుడు తధాస్తు నీ కోరిక నెరవేరుగాక అని చెబుతాడు.
కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఉంటాడు. నీవు ఎరుపు రంగులో ఉన్నావు , ఎర్రని దుస్తులు ధరించావు , అంతే కాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటి నుంచి నీ పేరు మంగళుడు అనే నామకరణం చేసి వినాయకుడు మాయమవుతాడు.
ఆ తర్వాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు.
ఆలయంలో వినాయకుని ప్రతిష్టించి , ఆ వినాయకుడికి *శ్రీ మంగళ మూర్తి* అనే పేరు పెట్టాడు. ఇవే కాకుండా ఎవరైతే *అంగారక చతుర్థి రోజు కఠిన ఉపవాస దీక్షలతో వినాయకుని పూజిస్తారో అలాంటి వారికి కుజ గ్రహ దోషాలు ఉండవు అనే వరాన్ని వినాయకుడు కుజునికి ప్రసాదిస్తాడు.*
అందువల్ల కుజదోషం ఉన్నవారు చతుర్దశి రోజు వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
ఒకవేళ సంకష్ట హర చతుర్థి
*మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.
No comments:
Post a Comment