Adsense

Monday, November 29, 2021

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు.. మూడుమునకలేస్తే దీర్ఘాయుష్షు !



తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది.

 ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి.
 
శ్రీవారి పుష్కరిణిలో.

 కుబేర తీర్థం,
 గాలవతీర్థం,
 మార్కండేయ తీర్థం,
 అగ్నితీర్థం, 
యమతీర్థం, 
వశిష్ట తీర్థం,
 వరుణ తీర్థం, 
వాయు తీర్థం, 
సరస్వతి తీర్థం 
ఇలా మొత్తం తొమ్మిది తీర్థాలున్నాయి.

 అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం.
 
కుబేర తీర్థం.. 

శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి.
 
గాలవ తీర్థం.. 

స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
మార్కండేయ తీర్థం... 

శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది.
 
అగ్ని తీర్థం - యమతీర్థం...

 వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
 
అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది.

 ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది.
 
వసిష్ట తీర్థం... 

వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి.
 
వరుణతీర్థం - వాయుతీర్థం..

 స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి.
 
సరస్వతి తీర్థం... 

కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది. 
 
ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది. 
 
స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి.

 అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. 

అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. 

ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు. 
 
ప్రస్తుతం అయితే తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే... అయితే మీరు కూడా స్వామివారి పుష్కరిణిలో పుణ్య స్నానం చేస్తారా!

No comments: