Adsense

Wednesday, November 17, 2021

సులభ మోక్ష మార్గం‘భక్తితోనే తెలుసుకోవాలి




అంతేతప్ప కంఠస్థం చెయ్యడం, అర్థతాత్పర్యాలు/ వ్యుత్పత్తులు విశదపరచుకోవడం ద్వారా కాదు’ అంటారు భాగవతులు.

పాండిత్యానికి, భాగవత జ్ఞానానికి సంబంధం లేదు. పాండిత్యం ఉన్నా లేకపోయినా భక్తి ఉంటే చాలు భాగవతం అర్థం కావడానికి. ఇతర గ్రంథాల్లా కాకుండా, కేవలం భక్తి ప్రాధాన్యంతో మాత్రమే చదవదగ్గ గ్రంథం భాగవతం ఒక్కటే. 

అందుకే వ్యాసుడు, పోతన ఇద్దరూ భాగవతంలో భక్తికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వీలు చిక్కినప్పుడల్లా తమ రచనల్లో భక్తి గురించి ప్రస్తావించారు. అవకాశం చూసుకుని బోధించారు. పౌరాణికులు, భాగవతులు సైతం ‘మోక్ష ప్రాప్తి కావాలనుకున్నవారు ఎన్నుకోవలసిన సులభమైన మార్గం భక్తిమార్గమే’నని చెప్పడం సైతం భక్తికి విశేష ప్రాధాన్యం ఏర్పడటానికి మరొక కారణం.

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాసత్వం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే తొమ్మిది రకాల భక్తిమార్గాలు చెప్పారు వేదాంతులు. వాటిని గురించిన వివరణను ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పినట్టుగా పాఠకులకు వివరించారు భాగవతకర్తలు. వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకున్నాక, భక్తిభావనలు తెరమీదకు వచ్చి ప్రాధాన్యం వహిస్తాయి. భక్తిమార్గం వేరు. 

ఆ మార్గాన్ని ఎన్నుకున్నాక భక్తి ప్రదర్శనకు దోహదం చేసే భక్తిభావనలు వేరు. అవి... శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావనలు. పైన పేర్కొన్న అన్ని రకాల భక్తిమార్గాలు, భావనలు భాగవతంలో అడుగడుగునా తారసపడతాయి.

నారదుడు, అంబరీషుడు తదితరులది శాంతభక్తి. కుబ్జది దాస్యభక్తి. కుచేలుడిది సఖ్యభక్తి. దేవకీ వసుదేవులు, యశోదా నందులది వాత్సల్య భక్తి. మధురభక్తికి ఉదాహరణలు- రాధ, గోపికలు మొదలైనవారు.

భాగవత ప్రారంభంలో శౌనకాది మునులు సూతుణ్ని ‘భక్తి అనే నావతో తప్ప, మరే ఇతర సాధనాలతో¨ సంసారం అనే సాగరాన్ని దాటలేం. కాబట్టి భక్తి భావాలను మాకు తెలపవయ్యా’ అని అడిగినట్లు పోతన రచించడం- భక్తిని ప్రబోధించడం కోసమే.

ద్వితీయ స్కంధంలో శుకుడు పరీక్షిత్తుకు ముక్తి మార్గం గురించి చెబుతూ ‘సంసార బంధనాల్లో చిక్కుకున్నవారికి వాటి నుంచి తప్పించుకోవడానికి తపోయోగాది అనేక మార్గాలున్నాయి. వాటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనదని చెప్పాడు.

తృతీయ స్కంధంలో కపిలుడు దేవహూతికి భక్తి గురించి వివరిస్తూ ‘మానవ హృదయాలకు ప్రేమించే శక్తి ఎక్కువ. ఆ ప్రేమను సాధారణంగా లౌకిక విషయాలు, పుత్ర మిత్ర కళత్రాదుల పట్ల ప్రదర్శిస్తారు. దానికి కారణం లౌకిక విషయాల పట్ల వారికి ఉన్న ఆకర్షణ, అవే సర్వస్వం అనే అమాయక భావన కలిగి ఉండటమే. కాని... ఆ ప్రేమనే భగవంతుడివైపు మరల్చగలిగితే భక్తిగా రూపాంతరం చెందుతుంది. 

అదే ముక్తి కారకమవుతుంది’ అని బోధించాడు.
సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడిచేత ‘భగవద్భక్తి లేనివాడు రెండు పాదాలున్న పశువుగాక మరేమీ కాదు’ అని కచ్చితంగా, సూటిగా చెప్పించడం- భక్తి ప్రాముఖ్యాన్ని వివరించడానికే.
తనదంటూ ఏదీ లేదని, ఇదంతా ఆ సర్వాంతర్యామి అనుగ్రహంతో లోకులందరికీ ఇచ్చినదేనని, తనకు కలిగినదీ అలా వచ్చినదేనని, సర్వం ఆ సర్వవ్యాపికి అర్పించి సంపూర్ణ విశ్వాసంతో ఆయనను శరణు జొచ్చడం ఆత్మ నివేదన అనిపించుకుంటుంది. ఇది భక్తికి పరాకాష్ఠ.

అక్రూరుడు, భీష్ముడు, ధ్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు వంటివారు ఈ విధంగా ఆత్మ నివేదన చేసి తమ భక్తిని చాటుకున్నారు!!

No comments: