Adsense

Sunday, February 6, 2022

సరస్వతిదేవిని ఉపాసించడానికి ఏమైనా మంత్రం ఉందా?



👉 సరస్వతీ ఉపాసనకి చాలా మంత్రాలున్నాయి. ఆగమాలు అని మంత్రశాస్త్రానికి మరొకపేరు. 

👉ఈ ఆగమాలలో రకరకాల సరస్వతీ రూపాలున్నాయి. సర్వశుక్లా సరస్వతి, నీలసరస్వతి, అరుణసరస్వతి - ఇలా వివిధములైన సరస్వతీ మంత్రాలు, సరస్వతీ రూపాలు ఉన్నాయి.

👉 వివిధ ప్రయోజనాల కోసం వివిధ మంత్రాలు చెప్పబడుతున్నాయి. 
జ్ఞానం కోసం చెప్పబడిన సరస్వతీ మంత్రములు కొన్ని అయితే, ఐశ్వర్యసిద్ధి కోసం చెప్పబడుతున్న సరస్వతీ మంత్రములు కొన్ని.

👉 బీజాక్షర మంత్రాలు మాత్రం సరియైన గురువు ద్వారా, సరియైన పద్ధతిలో ఉపదేశం పొంది చేయాలి తప్ప పుస్తకాలు చూసి, మాధ్యమాల ద్వారా విని మంత్రాలను చేయరాదు. 

👉ముఖ్యంగా సరస్వతి ప్రతినామమూ ఒక మంత్రం. 
ఆ లెక్కన 'శ్రీసరస్వత్యై నమః' - ఇది గొప్ప మంత్రం. 
మొట్టమొదట శ్రీకారం పెట్టుకుంటే చాలు. 
ఈ శ్రీకారంలోనే మహాచైతన్యం అంతా ఉన్నది. 

👉ఈ పంచమి పేరే 'శ్రీపంచమి'.
 'శ్రీ' అనే మాట సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి ముగ్గురికీ వర్తిస్తుంది.
 'శ్రీసరస్వత్యై నమః' అనే మంత్రం కొన్ని వేలు జపం చేసుకోవచ్చు. 
         
👉ఇది కాకుండా 'దేవీభాగవతంలో' ప్రారంభంలోనే 24 అక్షరాలు, మూడు పాదముల ఒక మహామంత్రం ఉన్నది. 
ఒకొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున ఉంటుంది. గాయత్రీమంత్రంతో సమానమైనది. అలాంటి సరస్వతీ మంత్రం ఉన్నది.
 ఇది మన బుద్ధి శక్తిని పెంచుతుంది. 

👉అంతేకాకుండా సరియైన నిర్ణయాన్ని, సరియైన ఆలోచనను ఇచ్చి ఆ నిర్ణయము, ఆలోచన సాఫల్యం అయ్యేటట్లు చేస్తుంది. అందునా దేవీభాగవతం ప్రారంభంలోనే ఈ మంత్రాన్ని వ్యాసదేవుడు ఇచ్చాడు. 
ఇది అందరూ పఠించవచ్చు. 

"సర్వచైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్"

👉దీని భావం.... సృష్టిలో ప్రతిదానికీ చైతన్యం ఉంటేనే కానీ, ఏదీ లేదు. ఆ చైతన్యమే సరస్వతి. విశ్వమంతా వ్యాపించిన చైతన్య స్వరూపిణి ఈ విశ్వానికి ముందే ఉన్నది గనుక 'ఆద్యా', 'జ్ఞానరూపిణి' గనుక 'విద్యా'. అలాంటి 'ఆద్యా, విద్యా' అయిన చైతన్య రూపిణి అయిన సరస్వతిని 'ధీమహి' - ధ్యానిస్తున్నాను/ఉపాసిస్తున్నాను. ఆ సరస్వతీదేవి మా బుద్ధులను ప్రేరేపించే తల్లి. 

👉బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కనుక భగవంతుని ముందు ప్రార్థించవలసింది ఒక్కటే - 'బుద్ధి బాగుండేటట్లు చెయ్యి' అని. బుద్ధిని ప్రసాదించే దేవి సరస్వతి.
 ఈ ఒక్కటి సంపూర్ణమైన మంత్రంగా భావించి అందరూ జపించవచ్చు. దీనికి ఎటువంటి గురూపదేశాలూ అవసరం లేదు.
 అమ్మవారే ఉపదేశించారు అనే భావంతో నిత్యం జపించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఈ మంత్రం ద్వారా పొందవచ్చు.


🔅  శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

No comments: