Adsense

Wednesday, October 26, 2022

15వ మహర్షి .. ఋష్యశృంగ మహర్షి

మన మహర్షుల చరిత్ర..
15వ మహర్షి ఋష్యశృంగ మహర్షి గురించి తెలుసుకుందాంము


🌿 పూర్వం కశ్యపుడు అనే పేరుగల గొప్ప మహర్షి ఉండేవాడు . ఆయన కొడుకు వింభాడకుడు , బ్రహ్మచారి .

🌸ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ వుండేవాడు . ఒకనాడు ఆయన నదిలో స్నానం చేసి వచ్చాక ఆ నది నీళ్ళ  తాగిన ఒక మృగానికి అంటే జంతువుకి ఒక అబ్బాయి పుట్టాడు .

🌿పుట్టింది జంతువుకే అయినా అతని రూపం మాత్రం మనిషి రూపంలోనే ఉన్నాడు . ఆ జంతువు ఎవరో తెలుసుకందాం .

🌸ఒకసారి చిత్రరేఖ అనే అప్సరస ఇంద్రుడి సభలో నాట్యం చేస్తోంది . ఆవిడ నాట్యానికి చాలా లేళ్ళు వచ్చేశాయి . అంత చక్కటి నాట్యంట ఆవిడది .

🌿పాపం అన్ని లేళ్ళు ఒకేసారి వచ్చేసరికి చిత్రరేఖ నాట్యం చేస్తూ ఆ లేళ్ళవైపు చూసింది . ఇంద్రుడికి కోపం వచ్చి చిత్రరేఖని మృగం అయిపొమ్మని శపించాడు .

🌸పాపం చిత్రరేఖ బాధపడింది . ఎలాగూ శపించేశాను , అది తిరిగి తీసుకోవడానికి కుదరదు . నీకు మనిషి రూపంలో ఒక అబ్బాయి పుడతాడు . అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది అన్నాడు ఇంద్రుడు .

🌿 ఆ చిత్రరేఖే ఈ మృగం అన్నమాట . మృగానికి పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయికి ఒక చిన్న కొమ్ము కూడ వుంది . ఆ అబ్బాయి ఎవరోకాదు ఇప్పటి మన ఋష్యశృంగ మహర్షి .

🌸 ఋష్యశృంగుడు పుట్టాక చిత్రరేఖకి శాపవిమోచనం కలిగి మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది .

🌿ఒకసారి విభాండకుడు ఆ అడవిలోకి వచ్చి ఋష్యశృంగుణ్ణి చూసి దివ్యదృష్టితో పిల్లవాడు తనవల్ల పుట్టినవాడేనని తెలుసుకుని

🌸తనతో తీసుకువెళ్ళి అన్ని విద్యలూ నేర్పించాడు . ఆకాలంలో రోమపాదుడు అనే పేరుగల రాజు వంగదేశాన్ని పాలించేవాడు . అతనికి పిల్లలు లేరు .

🌿ఒకసారి తన స్నేహితుడైన దశరథమహారాజు ఇంటికి వెళ్ళాడు . దశరథుడికి శాంత అనే ఒక కూతురుంది . ఆ పిల్లని చూసి రోమపాదుడు తాను పెంచుకుంటాను ఇవ్వమని అడిగాడు .

🌸దశరథుడికి ఇంక పిల్లలు లేరు కదా ! అందుకని పెంచుకుందుకు ఇవ్వనన్నాడు . కాని వసిష్ఠ మహర్షి త్రికాలాలు తెలిసినవాడు కావడం వల్ల దశరథుడికి నచ్చచెప్పాడు .

🌿 శాంతని రోమపాదుడుకి పెంపకం ఇవ్వడం వల్ల మంచే జరుగుతుందనీ దాని వల్ల వాళ్ళిద్దరికి మగపిల్లలు పుట్టే అవకాశం ఉందనీ చెప్పాడు .

🌸చివరకి ఆరునెలలు దశరథమహారాజు ఇంట్లోనూ , ఆరునెలలు రోమపాదుని ఇంట్లోనూ శాంత పెరిగేటట్లుగా వసిష్ఠ మహర్షి ఒప్పందం కుదిర్చాడు .

🌿 శాంతను తీసుకుని రోమపాదుడు వంగదేశానికి వెళ్ళిపోయాడు . కొంతకాలం తర్వాత రోమపాదుడు పిల్లల కోసం బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టాడు . 

🌸ఒక బ్రాహ్మణుడు తాను దానం తీసుకుని మళ్ళీ తన కొడుకుని తీసుకువచ్చి అతనికి ఒక గోవునిమ్మన్నాడు .

🌿దానికి రోమపాదుడు ఈ బ్రాహ్మణులకి ఆశ ఎక్కువ ఎంత ఇచ్చినా చాలదు అని నిందించాడు . దానికి ఆ బ్రాహ్మణుడు తన కొడుక్కి ఒక్క గోవు ఇమ్మని అడిగితే

🌸మొత్తం బ్రాహ్మణజాతినే అవమానించావు కాబట్టి నీ రాజ్యంలో వర్షాలే లేకుండాపోతాయి అని శపించి తండ్రి కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు .

🌿 రోమపాదుడు పశ్చాత్తాపంతో మిగిలిన బ్రహ్మణులని సంప్రదించాడు . వాళ్ళు రోమపాదుడికి ఋష్యశృంగ మహర్షి గురించి వివరించి ఆయన్ని రాజ్యంలోకి రప్పిస్తే మంచి వర్షాలు పడతాయని చెప్పారు .

🌸రోమపాదుడు కొంతమంది వేశ్యల్ని పంపి ఋష్యశృంగ మహర్షిని ఎలాగయినా రాజ్యంలోకి రప్పించమని చెప్పాడు .

🌿అందమయిన ఆ వేశ్యలు ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు ఆశ్రమంలో లేకుండా ఉన్న సమయం చూసి ఆశ్రమంలోకి వెళ్ళారు .

🌸 ఋష్యశృంగుడు వాళ్ళు కూడా ముని కుమారులనుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు . కొంచెం సేపు అతనితో గడిపేసి వెళ్ళిపోయారు .

🌿 మర్నాడు కూడ వాళ్ళు అలాగే వచ్చి ఋష్యశృంగుడ్ని తపస్సు చేసుకునేందుకు వాళ్ళ ఊరు రమ్మని చెప్పారు .

🌸పాపం ఋష్యశృంగుడికి ఎప్పుడూ తండ్రితో అడవిలోనే ఉండటం వల్ల మగ , ఆడదేగా కూడ తెలియదు . తండ్రి వద్దని చెప్పినా వినకుండా వాళ్ళతో వంగదేశం వెళ్ళాడు . 

🌿ఋష్యశృంగుడు వంగదేశంలో అడుగుపెట్టగానే వానలు కురిసి చక్కగా పంటలు పండాయి . ఒకనాడు ఋష్యశృంగుడు శాంతని చూసి ఆమెని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు .

🌸శాంత దశరథుని కూతురని తాను పెంచుకుంటున్నానని చెప్పాడు రోమపాదుడు . దశరథుడ్ని పిలిపించి శాంత ఋష్యశృంగుల పెళ్ళి ఘనంగా జరిపించాడు .

🌿రోమపాదుడు ఋష్యశృంగుడి ఆశీర్వాదంతో పిల్లల కోసం యాగం చేసి ఒక కొడుకుని పొందాడు . ఆనందంతో శాంతాఋష్యశృంగుల్ని భక్తితో చూసుకున్నాడు .

🌸కొంతకాలం గడిచాక ఋష్యశృంగుడు శాంతతో కలిసి అయోధ్యకి వెళ్ళాడు . శాంత వస్తోందని అయోధ్యా నగరం అంతా చక్కగా అలంకరించారు .

🌿 కౌసల్య , సుమిత్ర , కైకేయి అనే పేరు గల దశరథుని ముగ్గురు భార్యలు ఎదురువచ్చి శాంతా ఋష్యశృంగుల్ని తీసికెళ్ళారు .

🌸ఋష్యశృంగుడు దశరథుడికి మగపిల్లలు లేరని అశ్వమేధయాగం , పుత్రకామేష్టి చేయించాడు . కులగురువయిన వసిష్ఠ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి శాస్తోక్తంగా చేయించాడు ఋష్యశృంగుడు .
🌿ఆ అగ్నిహోత్రంలోంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసాన్ని ఇచ్చి దశరథుణ్ణి ఈ పాయసం నీ భార్యలకు ఇస్తే సంతానం కలుగుతుందని చెప్పాడు .

🌸పాయసాన్ని ముగ్గురు భార్యలకు తినిపించి శ్రీరామ భరత లక్షణ శత్రుఘ్నులనే నలుగురు కొడుకుల్ని పొందాడు దశరథుడు .

🌿పరమపవిత్రమైన యాగాన్ని పూర్తిచేయించి ఋష్యశృంగుడు భార్య శాంతను తీసుకుని తన తండ్రి విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు .

🌸ఋష్యశృంగుడు ఎంత గొప్ప ఋషో తెలిసిన వాడు కనుక విభాండకుడు కొడుకు తనకు చెప్పకుండా ఆశ్రమాన్ని విడిచి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని
కోపగించక ఋష్యశృంగుణ్ణి శాంతని ఆదరించాడు .

🌿తర్వాత ఋష్యశృంగుడు ద్వాదశ వార్షిక యజ్ఞం చేశాడు . ఋష్యశృంగుడు రాసిన గ్రంధం “ ఋష్యశృంగ స్మృతి " అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది .

🌸దానిలో ఆచారం , శౌచం , శ్రాద్ధం , ప్రాయశ్చిత్తం మొదలయిన వాటి గురించి రాయబడి ఉంది . పూర్తిగా ఆయన రాసిన గ్రంధం ఇంకా దొరకలేదనే అంటుంటారు .

🌿 ఏమయినా ఋష్యశృంగుడు గొప్ప తపస్సంపన్నుడే కాకుండా శ్రీ మహావిష్ణువునే శ్రీరాముడుగా లోకానికి అప్పగించి రామరాజ్యాన్ని ప్రసాదించి రాక్షస బాధలతో సతమతమవుతున్న ప్రజల్ని కాపాడిన గొప్ప పుణ్యాత్ముడు కూడ .

🌸ఋష్యశృంగుడు పిల్లలు లేని వారికి యజ్ఞయాగాదులు చేయించి వాళ్ళకి పిల్లలు కలిగేలా చేసి ఎన్నో రాజవంశాలు నిలబెట్టాడు .

🌿ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చక్కటి వర్షాలు పడి , పంటలు బాగా పండి ఆ రాజ్యం అంతా ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది .

🌸ఆయన మన రాజ్యంలో కాలు పెడితే చాలు అనుకునే వాళ్ళుట అప్పటి రాజులు..

🌿ఇదండి ఋష్యశృంగ  మహర్షి చరిత్ర 

No comments:

Post a Comment