సగర నిర్యాణము తరువాత అయోధ్యాధి పతిగా కోసలదేశ ప్రజలు అంశుమంతుని (మహారాజుగా)వరించారు.
కొంతకాలము రాజ్యపాలన గావించి, అంశుమంతుడు తన తనయుని దిలీవుని పట్టాభిషిక్తుని చేసి గంగావతరణోద్యోగము కొరకు తీవ్రముగా తపమొనర్చుతూనే స్వర్గ ప్రాప్తి పొందాడు.
దిలీపునికి కూడ గంగావతరణ మార్గము గోచరింపలేదు. ఆయన ముప్పైవేల సంవత్సారాలు యజ్ఞములను, ఇష్టులను కావిస్తూ అసంపూర్ణ మనోరథుడుగానే మరణించాడు
దిలీప తనయుడు భగీరథుడు, తన పూర్వులయిన అంశుమంత, దిలీప మహారాజుల ప్రగాఢ వాంఛ బాల్యమునుండే భగరథునిలో పట్టుదలను కల్గించింది.
ఆయన తరువాత అయోధ్యాధిపతిగా సింహాసనమలంకరింప దగిన వారసుడాయనకు జన్మింపలేదు. అయినప్పటికి ఆయన అసంతృప్తితో ఆగిపోలేదు.
మహామాత్యుల పై మహిభారాన్నుంచి -కఠోరతపోదిక్షతో ఆయన అడవులను ఆశ్రయించాడు.
సహస్ర వరములు గోకర్ణంలో భగీరథుడు ఘోరతప మాచరించాడు. భగీరథుని తపో దీక్షకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము కాక తప్పలేదు గంగావతరణమున కంగీకరించాడు.
అయితే గంగార్భటిని భరించుటకు పరమశివుని ప్రసన్నం చేసికొమ్మని ఆదేశించాడు. స్వయంగా క్షమాశీల అయి సర్వంభర అయిన భూమి కూడత్రిపథగా వేగాన్ని భరింపజాలదని తెలిపాడు.
అంగుష్ఠమాత్ర స్థిరుడై భగీరథుడు మరొక వత్సరం తీవ్ర తపమాచరించారు. భక్త వశంకరుడైన శంకరుడు సంప్రీతుడై గంగాధారణకు తన సంసిద్ధతను తెలిపాడు.
ఆకసము నుండి మహావేగంతో గంగాదేవి క్రిందికి ఒక్కసారి దుమికింది క్రింద నిలిచి ఉన్న మహాదేవుని, మహీధరాన్ని భూతలంతోపాటు, పాతాళానికి కొట్టుక పోతానని అహంకరించింది హుంకరించింది.
రుద్రుడు గంగాదేవి ఉద్దతినిగాంచి, తనజటా మండల గహ్వరంలో మహావేగవతి అయిన స్వర్గంగను బంధించి స్తబ్దనుగావించాడు.
భగీరథుడు హతాశుడై తిరిగి పరమేశ్వరుని ప్రసన్నం చేసికొన్నాడు. ఒక్కొక్క గంగా బిందువును శివుడు క్రిందికి వదిలారు.
ఆ బిందువు హిమాచలము పై పడి "బిందు సరోవరమైంది". అక్కడి నుండి ఏడుపాయలై హలాదిని, పావని, నళిని అని మూడు నదులుగా తూర్పువైపు ప్రవహించింది.
సూచక్షువు, సీత, సింధూ నదముల రూపములతో పడమటి వైపు ప్రవహించింది. ఎడవ పాయగా భగీరథుని వెంట ఏతెంచసాగింది.
గగనము నుండి (గం)భూమిపైకి దిగి వచ్చే ఆగంగామతల్లిని దేవదానవ యక్ష మహర్షి సంఘములు మహాభక్తితో సేవింపసాగాయి. వారు ఆ పవిత్ర జలాల్లో స్నాన. పానాదులు చేశారు
భగీరథుని అనుసరిస్తూ గంగామతల్లి కన్న కుమారుని లీలగా అనుసరించే మాతృమూర్తి వలె ముందుకు అనుగమింప సాగింది.
మార్గమధ్యములో బహ్న మహర్షి తన ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు చేసి కొంటున్నాడు. ఆయనను -ఆశ్రమాన్ని చూడగానే గంగా గమనంలో మళ్లీ మహోద్భృతి ప్రవేశించింది.
మహర్షి యజ్ఞవాటిక, ఆశ్రమము -పరిసర ప్రాంతమంతా
ప్రవాహమయమైంది
జహ్ను మహర్షి కనులు దెరిచాడు, ఆనదీ వేగాన్ని గమనించాడు. ప్రశాంతంగా గంగా జలాన్నంతటిని పానంజేశాడు.
భగీరథునికి తన వెను వెనుక సుడులు తిరుగుతూ ప్రవహించే గంగానది యొక్క సవ్వడి వినిపించలేదు ఆశ్చర్యంతో వెనుదిరిగి చూచాడు.
అతనికంతా అయోమయము కలిగింది ప్రవహిస్తూ వచ్చే పావన గంగానదికి బదులు (ప్రశాంత)తపోనిష్ఠా గరిష్ఠుడైన జహ్న మహాముని దర్శనమిచ్చాడు.
ఆయన ఆ మహాత్ముని మనసారా ప్రార్థించాడు. కరుణామయుడైన -ఆమహాను భావుడు తన దక్షిణ కర్ణం నుండి గంగా ప్రవాహాన్ని వినిర్గతం చేశాడు.
జప తపోనిష్ఠా గరిష్టుడైన జహ్న మహాముని మహా ప్రభావానికి స్వర్వాహిని సంభ్రమాశ్చర్య చకిత అయింది.
ఆయన మహిమకు లొంగి వినయంతో తనయ భావాన్ని వహించింది అందుకే "జాహ్నవి" అనే పేరు కలిగింది గంగానదికి.
మళ్ళీ భగీరథుని వెంట నడకసాగింది - సగర పుత్రులు త్రవ్విన సొరంగంలోకి - అదే సాగరం - ప్రవేశించింది
అక్కడ భస్మరాశులను ముంచెత్తింది. అరువదివేలమంది సగరపుత్రులూ గతకల్మషులై స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు
చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు
రాజర్షీ ! భగీరథా ! సగరపుత్రులను తరింపజేశావు. సాగరంలో ఈ జలం ఉన్నంతకాలమూ సగరపుత్రులు స్వర్ణోకంలో శాశ్వతంగా ఉంటారు
గంగానది నీకు పెద్దకూతురు. నీపేర భాగీరథి అని పిలవబడుతుంది. ఇటునుంచి పాతాళంలోకి ప్రవేశిస్తుంది ఈ ఆకాశము - భూమి - పాతాళము ఇలా ముల్లోకాలలోనూ ప్రవహించడంవల్ల" త్రిపథగ" అనే విఖ్యాతి పొందుతుంది.
బ్రహ్మదేవునికి నమస్కరించి భగీరథుడు స్నాతుడై తర్పణాదికాలు ముగించి అయోధ్యకు చేరుకున్నాడు.
ప్రజలంతా ఆనందించారు. ధనధాన్య సమృద్ధులతో సుఖించారు
రామా ! ఇదీ గంగావతరణ కథ.
నువ్ నీవు కోరినట్టే సవిస్తరంగా తెలియజేశాను. సమయం దాటిపోతోంది - అంటూ లేచాడు....
( సశేషము )..
No comments:
Post a Comment