Adsense

Wednesday, June 4, 2025

వాల్మీకి రామాయణం -19

దశరథునితో తన యాగ రక్షణకు రాముణ్ణి పంపమని తెలుపుతూ విశ్వామిత్రుడు...

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
వసిష్ఠోఽపిమహాతేజా యే చేమే తపసి స్థితాః

ధశరథుడు

ఏమయ్యా మహర్షి ! నా కొడుకు గురించి నాకే క్రొత్తగా చెప్పుచున్నావే ! నాకు తెలియదా ఆయన గురించి !

విశ్వామిత్రుడు

మహారాజా!! నీకు రాముని గురించి పూర్తిగా తెలియదు నీవు కేవలము సాధారణ బాహ్యనేత్రములతో చూడగల్గుతావు.

కేవలము వందిమాగధులతో పరివేష్టింపబడే నీకు శ్రీరామతత్వము తెలియదు. నిరంతర శస్త్రాస్తధారిపైన నీకు రాముని గురించి ఎలా తెలుస్తుంది ! భోగపరాయణుడవు.

రజోగుణయుక్తుడవు, సింహాసనోపవిష్ణుడవు. పుత్రవ్యామోహితుడవు అర్థకామపరుడవు, నీకు రామతత్వము అర్థమౌతుందా !

నేనోజ్ఞాననేత్రుడను. వృద్దోపసేవిని, జితేంద్రియుడను సాత్విక ప్రకృతి కలవాడను, ధర్మకార్యపరాయణుడను, యోగక్రమవేత్తను, మోక్షగామిని, నాకు అందువలననే రామతత్వము పూర్తిగా అర్థమైంది.

ధశరథుడు

మహామునీ ! నీకు సుకుమారుడైన నారాముని గురించి ఏమి తెలియునయ్యా ? వివరంగా తెవుపవయ్యా !

విశ్వామిత్రుడు

మహారాజా ! నీ కుమారుడు బాలుడే కావచ్చు. తేజస్వంతులకు వయస్సుతో నిమిత్తం లేదయ్యా ! నీ కొడుకు మహాత్ముడు ధైర్యశాలి.

శతృదుర్నిరీక్ష్యుడు. సకల ప్రాణులకు అభయదాత ! ఆయనతో సమానులే లోకంలో లేరంటే అధికుల మాట ఎక్కడిదయ్యా !

ఆయన  ధర్మసంస్థాపన కొరకే ప్రయత్నిస్తాడయ్యా ! ఆయనకు ఆగ్రహము వస్తే ఆయన అగ్ని కల్పుడు, సూర్యతేజుడు.

ఉపాయశాలి, మహావాయువువలె ఆయన  శతృవులను ఎగురగొట్టుతాడు.
ఆశ్రియుతులకాయన మృతసంజీవనము.

ధశరథుడు

"మీరు తెలిపే విశేషణాలన్ని భగవంతునికి వర్తిస్తాయి. అంతేగాని నా రామునికి వర్తిస్తాయా"?

విశ్వామిత్రుడు

చక్రవర్తి ! రాముడంటే ఎవ్వరనుకొంటున్నావు ? సాధారణ మానవ బాలుడు అనుకొంటున్నావా ? నిన్ను స్వయంగా తండ్రిగా వరించి, నీకు అవతరించిన పరమాత్మే ఆయన

"స,ఉ,శ్రేయాన్ భవతి జాయమానః " అని వేదము తెలిపినట్లు ప్రతి జన్మలో కూడ వివర్ధమాన తేజస్వి ఆయన

ధశరథుడు

మహానుభావా ! ఆయన పరమాత్మ అవునో కాదో నాకు తెలియదు. కాని నా రాముడింకా బాలుడే. యవ్వన మింకా అంకురించలేదు.

సౌకుమార్యము తగ్గలేదు. ఈయన పరాక్రమంతో శత్రువులతో పోరాడగలడా,…?

విశ్వామిత్రుడు

భూజానీ ! రాముడు సహజ పరాక్రముడు, ఆయన విక్రమము అమోఘము. ఆయన ముందుగా శత్రువులున్న చోటికే వెళ్లి వారిని

నిర్జింపగలుగుతాడు హఠాత్తుగా మీద బడ్డ ఎంతటి ప్రబల శత్రువునైనా మట్టి గరిపింపగల్గుతాడు (ప్రహర్త). సకల దేవతా సంరక్షకుడు శ్రీరాముడు.

భయంకర శతృవులనైనా క్షమింపగల ఉదారుడు. శతృవులనాయన ఎదిరించడానికి ఆయుధధారణము కూడ అవసరములేదు. సింహమువలెనిద్రాగతుడైనా అరిభయంకరుడే.

ధశరథుడు

మహర్షిపుంగవా ! మీరు మాట్లాడే ఈ మాటలు కేవలము మీ పనిని నెరవేర్చుకోవడానికి చెప్పేవి కావు కదా ! మీరే కాక నారాముని మీ వలె తెలిసిన వారింకెవ్వరైనా ఉన్నారా ? లేక మీరొక్కరేనా ?

విశ్వామిత్రుడు

మహిపాలా!నేనొక్కడినే ఎందుకయ్యా!మహాతేజుడు అయిన వశిష్ఠుడు కూడ రామతత్వము పూర్తిగా తెలిసినవాడే.

ఆయన నీ కులగురువే కదా? ఆయనను అడిగి చూడు నాకు విరుద్ధంగా మాట్లాడక ఆయన నామాటే అవునని అంటాడు.

వశిష్టుడు అబద్దం చెప్పుతాడా?ఆయన స్వయంగా బ్రహ్మపుత్రుడు
. శ్రీరామునికి ఆచార్యులు,

నావిషయంలో బ్రహ్మవరాన్ని బల పరుచగలిగిన మహాతేజశ్శాలి. సత్యధర్మ పరాయణుడు. ఆయన అబద్దం చెప్పుతాడా?

దశరథుడు

ఋషి శ్రేష్ఠా! నీవు, వసిష్ట మహాముని, ఇద్దరే కాక నా రాముని గురించి మీవలే తెలిసిన వారెవ్వరైనా అనేకులున్నారా?

విశ్వామిత్రుడు

ఇదుగో నీ ఎదుట మహర్షులు ఇందరు ఉన్నారు. కదా !  వారిని అడిగిచూడు ఒకరిద్దరయితే అనృతమాడవచ్చు కాని వీరందరు అసత్యము  పలుకుతారా?
వీరందరు అతి నిరాడంబరులు.

పరమభాగవత శిఖామణులు. వీరందరు నీ ఎదుటే ఉన్నారే వీరిని నీవే అడిగి చూడు.....

ఇంకా ఈ శ్లోక పరం గా పెద్దలు అనేక విధములైన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు.....

( స‌శేష‌ము )..

No comments:

Post a Comment