విశ్వామిత్రుడు దశరథునితో సంభాషిస్తూ....
రాజేంద్రా ! ధర్మమూ నీ పేరూ నీప్రతిష్ఠ ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లయితే మరి ఆలోచించక రాముణ్ని నాకు అప్పగించు. నీ మంత్రులూ వసిష్ఠప్రముఖులైన నీ పురోహితులూ హితులూ అంగీకరిస్తేనే నాతో పంపు. అయితే ఒక్కమాట .
ఈ యజ్ఞం దశరాత్రం. సమయం మించిపోకముందే ఒక నిర్ణయం తీసుకో. పుత్ర ప్రేమపట్ల, వియోగదుఃఖంపట్ల
మనస్సు పెట్టకు, నీకు శుభమగుగాక.
ఈ మాటలు వింటూనే దశరథునికి భయం ఆవరించింది. దు:ఖం ముంచుకు వచ్చింది. క్షణం నిశ్చేష్టుడయ్యాడు.
సింహాసనంలో ఇబ్బందిగా కదిలాడు. లేచి అటూ ఇటూ తిరిగాడు. ఎట్టకేలకు నోరువిప్పి మెల్లగా పలికాడు
నిండా పదహారు సంవత్సరాలు లేవు నా రామునికి. రాజీవలోచనుడైన అతడు రాక్షసులతో యుద్ధానికి తగినవాడని నేను అనుకోవడం లేదు....
ఊనషోడశవర్షోమే రామో రాజీవలోచనః
నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః
పుత్ర స్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది. అగ్నిలో
ఆజ్యం పోసినట్టయ్యింది.
రాజా ! ముందేమో ఏది అడిగితే అది చేస్తానన్నావు. తీరా అడిగాక ఇప్పుడేమో నావల్ల కాదంటున్నావు. ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు.
ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పనికాదు. సరే - ఇంతకూ ఇదే నీ తుది నిర్ణయమైతే - పోనీ - వచ్చిన దారినే వెళ్ళిపోతాను. కాకుత్స్థ ! మాట తప్పినవాడవై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు
మహామునీ! ఇదిగో అక్షౌహిణీ సైన్యం. దీనికి నేను సర్వాధిపతిని. దీనితో నేనే కదలివస్తాను. నా సైనికులు అస్త్ర విశారదులు.
రాక్షసులతో యుద్ధం చెయ్యగలవారు. నేను స్వయంగా ధనుష్పాణినై వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాను. నీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
రాముడు మాత్రం వద్దు. వీడు బాలుడు. ఇంకా విద్య పూర్తి కానివాడు. బలాబలాలు ఎరగని వాడు. అస్త్ర బలం లేనివాడు.
యుద్దకౌశలం తెలియనివాడు. అవతల రాక్షసులేమో కూట యుద్ధంలో నేర్పరులు. వద్దు - రాముడు మాత్రం వద్దు.
పైగా నలుగురు బిడ్డలలోనూ నాకు రాముడంటేనే ప్రేమ ఎక్కువ. జ్యేష్ఠుడూ, ధర్మప్రధానుడూను మహర్షీ ! దయచేసి రాముణ్ని మాత్రం అడగవద్దు....
పైగా- నీయజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న మారీచ సుబాహులు సుందోపసుందుల కొడుకులు. వారితో యుద్ధం చెయ్యడానికి నా బిడ్డను పంపలేను...
( సశేషము )..
No comments:
Post a Comment