చాలాకాలం క్రితమే మన పూర్వీకులు మనిషి చావు, పుట్టుకల గురించి, మరణానంతర పరిణామాల్ని గురించి ప్రశ్నించుకొని సమాధానాల్ని వెతుక్కునే ప్రయత్నం చేశారు. అనేక మంది ఋషులు, మునులు, జ్ఞానులు నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు. వాళ్లు తపస్సమాధిలో ఉన్నప్పుడు అత్యున్నత సత్యాన్ని, ధర్మాన్ని వేదం రూపంలో తెలుసుకున్నారు. తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్ని వేదాలుగా వ్యవహరిస్తున్నాం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాళ్లకు అవి పరమాత్ముడి వాణిగా వినిపించాయి కాబట్టి వాటిని శ్రుతులు అన్నారు.
వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్వత సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు విశ్వమంతటికీ అన్ని యుగాల్లోనూ వర్తిస్తాయి. మానవులు ఏయే దశలలో ఎటువంటి నియమాలు పాటించాలి? కుటుంబం, సమాజం, ప్రకృతి, దేశం పట్ల ఎవరి బాధ్యత ఏమిటి? తదితర విషయాల గురించి అన్ని విధాలా ఆలోచించి.. ఎలా వ్యవహరిస్తే ధర్మం నిలబడుతుందో ఆ విధంగా మార్గదర్శనం చేయగలిగిన అద్భుత జీవన విధానాన్ని మన ఋషులు, మునులు రూపొందించారు. సమస్త జగత్తునూ క్షేమంగా ఉంచగల ఈ శాశ్వత సూత్రాలే ధర్మానికి ఆధారంగా నిలిచాయి.
మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ధర్మానికి ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. అనాదిగా ఉన్న చైతన్యాన్ని దేవుడని, సనాతనుడనీ పిలుచుకున్నారు. కాబట్టి దీన్ని దైవ ధర్మమని, సనాతన ధర్మమని అన్నారు.
రుషులు మనకు అందించింది కాబట్టి దీన్ని ఆర్ష ధర్మం అని కూడా అన్నారు. అదే విధంగా మనదేశాన్ని హిందూదేశం అని పిలవడం వల్ల మనం అనుసరించే ఈ ధర్మాన్ని హిందూ ధర్మం అన్నారు.
ధారణాద్ధర్మమిత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
యస్మాద్ధారణ సంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః
ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రజలందరిని ధర్మం ధరిస్తుంది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వాడికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి. ‘ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’ అని నారాయణోపనిషత్తు చెబుతోంది. ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే.
మానవజీవితానికి పరమ ప్రయోజనమైన మోక్షం.. కేవలం ధర్మంతోనే సాధ్యం. ధర్మబద్ధమైన ఆర్జన (అర్థం), ధర్మబద్ధమైన కామంతోనే మనిషి నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలడు. అందుకే మన పెద్దలు చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని ముందుపెట్టారు. సంపాదన అయినా, కోరికలైనా ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః
No comments:
Post a Comment