Adsense

Saturday, September 26, 2020

భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము, తాండూరు


శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పర్గి, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా విపరీతంగా వస్తుంటారు. 

వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రెండు రోజులు ప్రధానమైనవి. శని, ఆది వారాల్లో జరిగే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జర్గే రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. ఆదివారం అర్థరాత్రి జర్గే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది. 

దేవాలయ చరిత్ర
కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామలో సుమారు 200 సంవత్సరాల క్రితం భద్రప్ప జన్మించినట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబుతారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఉత్సవాలు జర్గుతాయి. తాండూరు నివాసి పటేల్ బసన్న బీదర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భావిగి గ్రామంలో జరిగే శ్రీ భద్రేశ్వరస్వామి మఠం ఉత్సవాలకు ఏటా ఎడ్లబండిపై వెళ్ళి దర్శించుకొని వచ్చేవాడు. ఒక సంవత్సరం స్వామిని కలిసి వెళ్ళిపోతున్నానని చెప్పి బండిపై తిరుగు వస్తుండగా ఆ భద్రేశ్వరస్వామి బండి వెంబడి రాసాగాడు. 

ఇది గమనించిన బసప్ప స్వామివారిని బండి ఎక్కమని ప్రార్థించగా అందుకు నిరాకరించి అలాగే బండి వెంబడి నడక సాగించి చివరికి ప్రస్తుతం దేవాలయం ఉన్న స్థలంలో అదృశ్యమయ్యాడు. అదే రోజు రాత్రి బసన్నకు భద్రప్ప కలలో కన్పించి తన పాదుకలను భావిగి మటం నుంచి తీసుకువచ్చి వీటిని తాండూరు లో ప్రతిష్టించి, ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, జాతర జర్పాలని అజ్ఞాపించినట్లు కథ ప్రచారంలో ఉంది. గర్భగుడి ప్రక్కనే శివపార్వతుల ఆలయాన్ని కూడా నిర్మించారు

జాతర, రథోత్సవం
ప్రతిఏటా ఉగాది పర్వదినం అనంతరం చైత్రమాసంలో మదన పూర్ణిమ తరువాత వచ్చే మంగళవారం రోజు జాతర ఉత్సవాలు ప్రారంభమై శనివారం స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. పరిసర ప్రాంతాలవారే కాకుండా ఇతర జిల్లాల నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు హాజరౌతారు. అర్థరాత్రి స్వామివారికి రథంలో ఊరేగిస్తారు. 7 అంతస్థులు కల 50 అడుగుల ఎత్తున్న రథాన్ని భక్తులు తాళ్లతో ముందుకు లాగుతూ బసవన్నకట్ట వరకు తీసుకువెళ్ళి మళ్ళీ యధాస్థానానికి చేరుస్తారు. 

భక్తులు తమ కోరికల్ని మనస్సులో తలచి రథంపైకి అరటిపళ్ళు విసురుతారు. కలశపు భాగానికి అవి తగిలితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ తరువాత ఆ ప్రాంతం అంతా జాతర దుకాణాలతో భర్తీ అవుతుంది. వారం రోజుల పాటు ఈ ప్రదేశం జనసందోహంగా ఉంటుంది. ఆదివారం రోజు లంకాదహనం జరుగుతుంది. పల్లకిలో స్వామివారికి పట్టణమంతా ఊరేగిస్తూ లంకాదహన స్థలానికి వచ్చాక లంకాదహనం ప్రారంభమౌతుంది. లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడ ముచ్చటగా ఉంటుంది.

భద్రేశ్వరస్వామి మహిమలు
కర్ణాటకలోని భావిగిలో ఒకసారి సామూహిక భోజనాలు జరిగుతుండగా నెయ్యి అయిపోయింది. స్వామివారికి ఈ విషయం తెలిసి నీటిగుండం నుంచి కడివెడు నీటిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆ నీటిని స్వామివారు నెయ్యిగా మార్చివేశాడు. భోజనాల అనంతరం మొక్కుబడి కలవారు స్వామివారికి 5 కడవల నెయ్యి సమర్పిస్తారు. అందులో బదులుగా తీసుకున్న ఒక కడివెడి నెయ్యిని నీటిగుండంలో కలపమని ఆదేశిస్తాడు. ఇప్పటికీ ఆ గుండాన్ని తప్ప (నెయ్యి) గుండంగా పిలుస్తున్నారు.

స్వామివారు నీటిలో దీపం వెలిగించినట్లు, మరణించినవారిని మహిమశక్తితో బతికించినట్లు తరాల నుంచి చెప్పుకొనే కథలు ప్రచారంలో ఉన్నాయి.

సర్వేజనా సుఖినోభవంతు.

No comments: