Adsense

Tuesday, September 29, 2020

శ్రీ లక్ష్మీగణపతి ఆలయం బిక్కవోలు


ఆలయ సమయాలు: ఉదయం 4:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 1:30 నుండి రాత్రి 8:00 వరకు.

మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్లా కొలువై భక్తులకు అండగా ఉంటాడు.

అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు.ఈ ఆలయాన్ని క్రీ .శ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి.

అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికితీయడంతో స్వామి బయటపడ్డాడరని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది.

ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు. వీరభద్రుడితోపాటు సుబ్రమణ్య స్వామి కొలువున్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతోపాటు సుబ్రమణ్వేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించినవారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు.

ఈ బిక్కవోలు లో ఉన్న గణపతి దేవాలయాన్ని చేరుకోవాలంటే మొదట రాజమండ్రి చేరుకోవాలి. అక్కడి నుంచి బిక్కవోలు 30 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పట్టణమైన కాకినాడకు 31 కిలోమీటర్ల దూరంలో బిక్కవోలు ఉంటుంది.

రాజమండ్రి, కాకినాడ నుంచి బిక్కవోలుకు నేరుగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గం కూడా ఉంది. బిక్కవోలుకు 10 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట రైల్వే స్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా రైలు సౌకర్యం ఉంది.

అదేవిధంగా బిక్కవోలుకు సమీపంలో మధురపూడిలో ఎయిర్ పోర్ట్ ఉంది. మధుపూడి నుంచి బిక్కవోలుకు 35 కిలోమీటర్లు. ట్యాక్సీలు బస్సులు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి, కాకినాడ పర్యాటకానికి వెళ్లినవారు బిక్కవోలుకు తప్పకుండా వెళతారు.

No comments: