Adsense

Tuesday, October 20, 2020

అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ బేతవోలు రామబ్రహ్మం గారు ఎంత భావగర్భితమైన గీతాన్ని రాశారో!


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా!!

విశ్వైకనాథుడే విచ్చేయునంటా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా!!

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా!!

నా తనువునో తల్లి నీ సేవ కొరకు
నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు!!

నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు!!

నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి  
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లీ 
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లీ!!

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా!!

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి 
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి 
నీ పాద పద్మాలు కడగాలి తల్లీ!!

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి 
నీ పాద పద్మాలు కడగాలి తల్లీ!!

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి 
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి 
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లీ
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లీ!!

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా!!

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి 
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లీ!!

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లీ!!

నా తనువు గగనాంశ నీ మనికి జేరి 
నా తనువు గగనాంశ నీ మనికి జేరి 
నీ నామ గానాలు మోయాలి తల్లీ
నీ నామ గానాలు మోయాలి తల్లీ!!

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా!
అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ బేతవోలు రామబ్రహ్మం గారు ఎంత భావగర్భితమైన గీతాన్ని రాశారో!

మానవ జన్మకు సంబంధించిన అంశాలన్నిటినీ ఆ తల్లి సేవకు ఎలా సమర్పించదలచుకున్నాడో ఈ గీతంలో వివరిస్తున్నారు.

ఓ తల్లీ! అన్నపూర్ణాదేవి! నిన్ను అర్చిస్తున్నాను! నా మనవిని ఆలకించి నన్ను కాపాడు! విశ్వనాథుడే వచ్చి నీ ఇంటి వాకిట భిక్ష కోసం నించుంటాడట! ఓ తల్లీ! నా శరీరం మళ్లీ జన్మ వరకు నీ సేవకు అర్పిస్తున్నాను. నా శరీరములోని పృథివీ తత్త్వము నీవు నివసించే పురం చేరి నీ పాదముద్రతో కలిసి వర్ధిల్లాలి. నా శరీరంలోని జల తత్త్వము నీవు ఉండే ఇల్లు చేరి నీ పదకమలాలను కడగాలి. నా శరీరములోని తేజో తత్త్వము నీ గుడి ముంగిట దీపంలా వెలగాలి. నాలోని వాయు తత్త్వము నీ గుడికి చేరి వింజామరల కోసలలో నిలిచి నీకు గాలి విసరాలి. నా శరీరంలోని ఆకాశ తత్త్వము నీ నివాసానికి చేరి నీ నామాలను నుతించే గానాలను మోయాలి తల్లీ!

దేహానికి సంబందించిన ఐదు తత్త్వాలను - పృథివ్యాపస్తేజోవాయురాకాశాలను - తల్లి సేవకు సమర్పించటం ఈ భక్తుని పరిపూర్ణమైన మనోవికాసానికి, జన్మ కారణ జ్ఞాన వికాసానికి ప్రతీక. ఈ అంశాలను దుర్వినియోగం చేయకుండా దేహాన్ని దేవాలయం చేయటం ఈ గీత లక్షణ సంపద. జగన్మాత కరుణానిధి. ఆ తల్లి తనను శరణన్న వారిని కరుణించి కన్నబిడ్డలలా కాపాడుతుంది. మానవ జన్మకు ఇంతకు మించి సేవ ఏమున్నది? మనలోని ప్రతి అంశాన్నీ ఆ దివ్యత్వానికి సమర్పిస్తే ఇక మాయకు, తద్సంభూతమైన అహంకారాది వికారములకు స్థానమే లేదు.

ఇటువంటి గీతాన్ని రచించాలంటే ఎంతటి ఆధ్యాత్మిక వికాసాన్ని పొంది ఉంటారో  ఊహిస్తేనే తనువు పులకరిస్తుంది. ఆయా అంశాలను మన తల్లికి అర్చనా విధులలో వినియోగించటం జీవాత్మ పరమాత్మల మధ్య భేదాన్ని ఛేదించి అద్వైతము వైపు వడి వడిగా అడుగులు వేయటాన్ని సూచిస్తోంది. భక్తి, భావం ఒకటైతే పదాలు అవే కలిసొస్తాయి. వీడు అన్నది తమిళ పదం. అలాగే మని అన్నది సంస్కృతనుండి జనించి కన్నడ భాషలో నివాసానికి వాడే పదం. ఇలా ఈ గీతంలో భావానికి వేర్వేరు భాషల పదాలు ఎంతో అందంగా ఒదిగిపోయాయి. అన్నపూర్ణమ్మకు హారంగా పొదిగి ప్రకాశిస్తున్నాయి. అంశలకు సంబంధించిన పదాలను పరిశీలిస్తే కృతికర్త భాషా పటిమ మనకు అర్థమవుతుంది. అచలాంశ అన్న పదం ఆయనకు దేహం గురించిన లోతైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అలాగే ఉదకాంశ, మరుదంశ, తేజోంశ మరియు గగనాంశ. 

ఆలోచించండి! శరీరం ఎంతటి అద్భుతమైన పంచ భూతముల కలయికో? మరి ఆది పరాశక్తి ప్రకృతి రూపిణి కదా? ఆమెకు ఈ పాంచభౌతిక మూలాలను సమర్పిస్తే మనలను మనం పూర్తిగా అర్పించినట్లేగా? ఈ విశ్వైకజనని అనబడే అనంత శక్తితో ఈ చిరు శక్తి అనుసంధానమై ఉజ్జ్వల తేజో తరంగంగా భాసిల్లినట్లేగా? అనంతమైన విశ్వంలో అశాశ్వతమైన శరీరానికి ఇంతకన్నా సార్థకత ఏముంది.  మనసుకు హత్తుకొని సాహిత్యం చదువుతుంటే కళ్లలో నీళ్లు తెప్పించే  ఈ గీత రచయిత మనోవికాసానికి జోహార్లు.

ఈ పాటలో వైశిష్ట్యం- మన శరీరంలోని పంచభూతాల అంశలతో అమ్మవారిని అర్చించాలనే ఆకాంక్ష. అచలాంశ- భూమి అంశ. భక్తురాలు భూమి అంశ అయితే తల్లి పాదాల ముద్రతో శోభించాలి. ఉదకాంశ- నీటి అంశ. ఈ అంశతో తల్లి పాదాలను కడగాలి. తేజోంశ- అగ్ని అంశ. దీపమై వెలగాలి. మరుదంశ- వాయువు అంశ. 

చల్లటి గాలి తెరలతో తల్లి చూపు కొసలకు హాయి కలిగించాలి. గగనాంశ- ఆకాశం అంశ. శబ్దగుణమాకాశం అని శాస్త్రం. పంచతన్మాత్రలలో ఆకాశం శబ్దం అంశ కలిగినది. అందుకే ఆ శబ్దం ఏదో కాక తల్లి నామగానాలదై ఉండాలి అని కోరిక. ఆ విధంగ తన తనువులోని అన్ని అంశలనూ అర్పించి ఆ భక్తురాలు తన జన్మను సార్థకం చేసుకుంటోంది.
అన్నపూర్ణా దేవి అంటే అన్నస్వరూపిణి. మనం తినే అన్నంతోనే మన శరీరం నిర్మాణమవుతుంది. అట్ల నిర్మితమైన శరీరాన్ని తిరిగి తల్లి సేవకే వినియోగించాలనే భావన చాలా అందమైనది. అద్భుతమైనది.

No comments: