పరిస్థితులు కుదుటపడే వరకూ అప్రమత్తత అవసరం

కోవిడ్ నిర్వహణ, వ్యాధినిరోధకతకు ఆయుర్వేదం’ వెబినార్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ వైద్యులు

Posted Date:- Oct 28, 2020

ఆరోగ్యకమైన జీవనశైలి కోసం దినచర్య, రుతుచర్యలను సక్రమంగా పాటించాలని, మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలని డా . పి.వి.వి ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్    అన్నారు . ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం, రీజ‌న‌ల్ ఔట్‌రీచ్ బ్యూరో ఆధ్వ‌ర్యంలో బుధ వారం ‘కోవిడ్ నిర్వహణ, వ్యాధినిరోధకతకు ఆయుర్వేదం’  అనే అంశంపై వెబినార్ నిర్వ‌హించారు. రీజ‌న‌ల్ ఔట్ రీచ్ బ్యూరో సంచాల‌కులు శ్రీమతి శృతిపాటిల్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా పీఐబీ ద‌క్షిణాధి రాష్ట్రాల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్ ప్రారంభోప‌న్యాసం చేశారు. 

ఆయుర్వేదం.. ఆయుశ్సు గురించి మాట్లాడేది.  ఆయుర్వేదం.. మానవుడిని కూడా ప్రకృతిలో ఓ అభిన్న  అంగంగానే భావిస్తుందని, అందుకే మానవుడికి వచ్చే సమస్యలకు తన చుట్టూ ఉన్న ప్రకృతిసిద్ధమైన మందులతోనే తగ్గిస్తుందని, అదే ఆయుర్వేదం ప్రత్యేకత అని డా. పి.వి.వి ప్రసాద్ అన్నారు. కఫ, వాత, పిత్త (త్రిదోష) దోషాలను, ప్రకృతిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మానవ శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

భారత ఆయుర్వేదంలో భాగమైన తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, సొంఠి (ఎండిన అల్లం), ఎండు ద్రాక్షను వాడటంతో పాటూ... యోగా రెగ్యులర్‌గా చెయ్యాలి. ఫలితంగా మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుందని అన్నారు. వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు, అందుకు తోడ్పడే జీవనశైలిని అనుసరించాలని అన్నారు.

డాక్టర్ టి.సాకేత్ రామ్, రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేదం) మాట్లాడుతూ ఆయుర్వేదం అందించిన జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నివారించడంపై దృష్టి సారించాలని అన్నారు. కోవిడ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ఈ వెబినార్ లో మాట్లాడారు.

సహజంగా అందుబాటులో ఉండే వస్తువులతోనే వైరస్‌తో గొప్పగా పోరాడే శక్తిని ఆయుర్వేదం అందిస్తుందని తెలిపారు. అశ్వగంధ, చ్యవన్ ప్రాష్ , హెర్బల్ టీ , గోల్డెన్ మిల్క్ లాంటివి తీసుకోవడం వల్ల కోవిడ్ అనంతరం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అని ఆయన తెలిపారు . పరిస్థితులు కుదుట పడే వరకు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ తప్పని సరిగా ధరించాలని అన్నారు.

మతి మరుపు గా అనిపించినా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, వెంటనే వైద్యులను సంప్రదించాలని  సాకేత్ రామ్ అన్నారు. కోవిడ్ నుంచి కొలుకున్నాక కూడా రక్త పోటు, కొలెస్ట్రాల్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. 

కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి  “కోవిడ్-19 నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు యోగా ఆధారంగా జాతీయ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ ” ను తప్పకుండా పాటించాలని  వైద్యులు కోరారు.