Adsense

Saturday, November 14, 2020

చల్లని మాట... చక్కని బాట!



‘కొందరు ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది. కొందరు వెళ్లిపోతే చాలా సంతోషంగా ఉంటుంది’ అని కొంతమంది గృహస్థులు తమ ఇళ్లలో ఓ సందేశాన్ని ఫ్రేమ్‌ కట్టి ఉంచుతారు. చూడ్డానికి తమాషాగా అనిపించినా, అది లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఎవరింటికైనా పలకరింపులకు వెళ్లినప్పుడు, అవతలివారి మానసిక స్థితిని గమనించరు. అడగకపోయినా తమ కష్టాలు, బాధలు ఏకరువు పెడుతుంటారు. సమాజం భ్రష్టుపట్టి పోయిందని అందరినీ తిడుతూ, తమలోని నిరాశా నిస్పృహలను వాళ్లముందు వెళ్లగక్కుతుంటారు. అలాంటప్పుడే వచ్చినవ్యక్తి ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఇంట్లోవాళ్లు ఎదురుచూస్తుంటారు. ఈ ధోరణికి విరుద్ధంగా ఉండే వ్యక్తులూ ఉంటారు. వారు ఏ ఇంటికైనా సంతోషాన్ని వెంటబెట్టుకుని వెళ్తారు.
సమాజంలో అనేక సమస్యలు, వివాదాలు ఏర్పడటానికి ముఖ్యకారణం- మనుషుల మధ్య మాటతీరు సరిగ్గా లేకపోవడం, అవగాహనా లోపమని మనకు అర్థమవుతుంది. మాట తీరు ఎలా ఉంటే శ్రేయస్కరమనే అంశాన్ని, ‘మనుస్మృతి’ ఏనాడో సూచించింది. మనుషులు మాట్లాడే ధోరణులను ‘మనుస్మృతి’ నాలుగు విధాలుగా విభజించింది. మొదటిది- పారుష్యం; అంటే కఠినంగా మాట్లాడటం. మన మాటతీరు కటువుగా ఉంటే- మిత్రులు శత్రువులవుతారని హెచ్చరించింది. రెండోది- అనృతం. అంటే అసత్యాలు పలకడం. ఈ ధోరణి ఉన్నవారు డంబాలు పలుకుతారు. దాంతో అవతలి వ్యక్తులకు వీళ్లమీద విశ్వాసం ఏర్పడదు. ఎవరూ మనస్ఫూర్తిగా మాట్లాడరు. మూడోది- పైశూన్యం. అంటే, ఇతరుల మీద చాడీలు చెప్పడం. దీనివల్ల మనుషుల్లో ద్వేషాలు, కలహాలు పెచ్చరిల్లుతాయి. సన్నిహితులు విరోధులవుతారు. నాలుగోది- అసంబద్ధ ప్రలాపం. ఈ లక్షణం ఉన్నవారు అనవసర విషయాలు, విసుగు కలిగించే అంశాలు ఎక్కువగా మాట్లాడుతూ, వినేవారికి చికాకు కలిగిస్తుంటారు.
‘ప్రియంగా మాట్లాడేవాడికి శత్రువు ఉండడు’ అన్నాడు చాణక్యుడు. ‘మంచిగా మాట్లాడేవాడికి ఏం లభిస్తుంది’ అని యక్షుడు ధర్మరాజును అడిగినప్పుడు, ఆయన ‘మైత్రి’ అని సమాధానమిచ్చినట్లుగా మహాభారతం చెబుతోంది.
మంచిగా మాట్లాడేవారు అవతలి వ్యక్తులను ఎంతగా ఆకర్షిస్తారనడానికి రామాయణం కిష్కింధకాండలో హనుమంతుడి భాషణ గొప్ప ఉదాహరణ.
చాలామంది ఆలోచించకుండా మాట్లాడతారు. ఆ మాటల వల్ల అనర్థం జరిగాక అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తారు. కానీ ఏం లాభం? ఇతరులు ఆవేశపడి, పరుషంగా మాట్లాడినా, మనం తొందరపడి ఆవేశంగా మాట్లాడకూడదు. ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. పరుష భాషణం వల్ల వైరం ఇంకా పెరుగుతుంది. హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని మన శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి.
‘మనసులో కుటిలత్వం లేకుండా, మధురభావంతో ఉండాలి. మన మాటలు మృదుమధురంగా ఉండాలి. చేసే ప్రతి పనిలో ఆలోచనలో మంచితనమే అంతర్లీనమై ఉండాలి’ అని అధర్వణ వేదం చెబుతోంది. అందువల్ల ఎప్పుడూ చల్లగా, ప్రియంగా మాట్లాడే ధోరణిని అలవరచుకుంటే, మనం ఎవరితో మాట్లాడినా, వాళ్ల హృదయంలో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోగలుగుతాం.
సమాజం సజావుగా సాగాలంటే అందుకు ప్రియ భాషణమే చక్కని మార్గమని అందరూ గ్రహించాలి.

No comments: