సాష్టాంగ నమస్కారం అంటే....?
దేవాలయానికి వెళ్ళిన భక్తుల్లో కొందరు దైవానికి ఎదురుగా చేతులు చాచి దేహాన్ని పూర్తిగా నేలకి తాకిస్తూసాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. స + అష్ట + అంగ = సాష్టాంగ, అనగా ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి:
ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా, తథా
పద్భ్యాం, కరాభ్యాం, కర్నాభ్యాం, ప్రణామం సాష్టాంగ ఉచ్చ్యతే.
అష్టాంగాలంటే ... ఉరసు (తొడలు), శిరసు (తల), దృష్టి (కళ్ళు), మనసు (హృదయం), వచసు (నోరు), పద్భ్యాం (పాదాలు), కరాభ్యాం (చేతులు) కర్నాభ్యాం (చెవులు).
పురుషులు బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగాలను భూమికి తాకిస్తూ, భగవంతునికి నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం ధ్వజస్తంభం దగ్గరే చేయాలనే నియమం ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉంది. అలా చేయడం వలన, ఆ నమస్కారం తప్పకుండా దైవానికి చేరుతుందట. అలా బోర్లా పడుకుని చేస్తున్నప్పుడు కాళ్ళ భాగం దిశలో ఎలాంటి దేవతా మూర్తులు ఉండకూడదు.
ఆలయంలోని ముఖ మండపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, కాళ్ళు ఆ దేవుని వాహనం వైపుకు వస్తాయట. అందువల్ల ఏలాంటి దైవ సంబంధమైన వాహనాల వైపు, ఉపాలయాలవైపు, కాళ్ళు పెట్టకుండా ఉండటంకోసం, ధ్వజస్తంభం దగ్గర నిర్దేశించిన ప్రదేశంలోనే సాష్టాంగ నమస్కారం చేయడం శ్రేష్ఠం.
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు, కాని పంచాగ (శిరసా, దృష్ట్యా, మనసా, వచసా, కరాభ్యాం) నమస్కారం చేయవచ్చు.
No comments:
Post a Comment