Adsense

Monday, March 22, 2021

నాలుగూ నాలుగే

నాలుగూ నాలుగే 
ఒక జమీందారు దగ్గర ఒక గొర్రె, ఒక కోడిపుంజు, ఒక ఎద్దు, ఒక బాతు వుండేవి. ఆ జమీందారు చానా ధనవంతుడు. ఒకరోజు దొంగలు పడి ఆ ఇంటిలో వున్న బంగారమంతా మూటగట్టుకోని మట్టసంగా వెళ్ళిపోయినారు. పొద్దున

జమీందారు విషయం తెలుసుకోని జనాలను వెంటబెట్టుకోని దొంగలని పట్టుకోడానికని అడవిలోనికి పోయినాడు.

జమీందారు, సేవకులు అందరూ పోగానే గొర్రె తాను కూడా ఇంటిలోంచి పోవడం మొదలు పెట్టింది. అది చూసిన కోడిపుంజు “ఏం గొర్రె మామా... ఎక్కడికి పోతా వున్నావు” అనడిగింది. దానికి గొర్రె “ఏం చేద్దాం అల్లుడూ... ఈ తిరుణాలకు నన్ను అమ్మోరికి బలిచ్చి పండుగ చేసుకుంటారంట... జమీందారు బంధువులతో అంటా వుంటే విన్నా, ఇప్పుడు ఇంటిలో ఎవరూ లేరు గదా... అందుకే పారిపోతావున్నా" అని చెప్పింది. అది విన్న కోడిపుంజు “నన్ను గూడా జమ్ములమ్మకు బలిచ్చి పండుగ చేసుకుంటారంట. నేను గూడా విన్నా, నేనూ నీతోపాటు ఇక్కన్నుంచి తప్పించుకుంటా” అనింది.

గొర్రె, కోడిపుంజు పోతావుంటే ఎద్దు చూసింది. “ఏం గొర్రె మామా... పుంజుమామా... ఇద్దరూ కలసి ఎక్కడికో పోతున్నారే. ఏంది సంగతి” అని అడిగింది. దానికి కోడిపుంజు “ఏం చేద్దాం మామా... ఈ తిరుణాలకు నన్నూ,

గొర్రె మామనూ మన యజమాని అమ్మోరికి బలియ్యాలనుకుంటా వున్నాడు. అందుకే పారిపోతా వున్నాం” అని చెప్పింది. అది విన్న ఎద్దు “నన్ను గూడా మీతో బాటు పిలుచుకోని పోండి, నన్ను గూడా ఎల్లమ్మకి బలియ్యాలని మొక్కుకున్నారంట " అనింది. గొర్రె, కోడిపుంజు 'సరే' అన్నాయి.

గొర్రె, కోడిపుంజు, ఎద్దు పోతావుంటే బాతు చూసింది. “ఏంది మామా... ముగ్గురూ కలిసి ఎక్కడికో పోతున్నారే. ఏంది సంగతి” అని పలకరించింది. దానికి ఎద్దు “ఏం చేద్దాం అల్లుడూ, ఈ తిరుణాలకు నన్నూ,

గొర్రెమామనూ, కోడిపుంజునూ మన యజమాని అమ్మోరికి బలియ్యాలనుకుంటా వున్నాడు. అందుకే పారిపోతా వున్నాం" అని చెప్పింది. అది విన్న బాతు “నన్నుగూడా మీతోబాటు పిలుచుకోని పోండి. మీరు లేకుండా నేను ఒక్కదాన్ని వుండలేను” అనింది. ఆ మూడూ 'సరే' అన్నాయి.

అలా ఆ నాలుగూ కలిసి అడవిలోనికి పోయినాయి. చీకటి పడేవరకూ పోతానే వున్నాయి.

చీకటి పన్నాక ఆగిపోయినాయి. “ఈ చీకటిలో ఇలాగే పోయినామంటే ఏ పులో, సింహమో చూసిందంటే మనలని చంపకుండా వదలిపెట్టవు. కాబట్టి ఈ పూట ఎక్కన్నో ఒకచోట పండుకోని రేప్పొద్దునే 

పోదాం” అనుకోని పండుకోడానికి మంచి చోటుందేమోనని వెదకసాగాయి. అలా వెదుకుతా వుంటే వాటికి ఒకచోట ఒక పాడుబన్న ఇల్లు కనబడింది. అది తాళమేసి వుంది. వెనుకవేపు ఒకగోడ చిన్నగా వుంటే కోడిపుంజు లోపలికి పోయి చూసింది.

ఇంకేముంది లోపలంతా బంగారం, నగలు కుప్పలు కుప్పలుగా కనబన్నాయి. అందులో జమీందారు నగలు కూడా దానికి ఒకచోట కనబన్నాయి. దాంతో అది వురుక్కుంటా బైటకొచ్చి మిగతా వాటికి చూచిందంతా చెప్పింది.

దాంతో ఆ నాలుగింటికీ ఆ ఇల్లు దొంగలదని తెలిసిపోయింది. నాలుగూ వెనుకనున్న పిట్టగోడ మీద నుంచి లోపలికి దూకినాయి.

కోడి, బాతు ఒక తాడు తీసుకోనొచ్చి తలుపుకు అడ్డంగా చెరోవేపు గట్టిగా కట్టినాయి. గొర్రె తలుపుకు సక్కగా నిలబడింది.

ఎద్దు కొమ్ములని బాగా సానబెట్టుకోని ఒక మూల సిద్ధంగా నిలబడింది. కాసేపటికి నలుగురు దొంగలు వచ్చినారు. ,

తలుపు తీసి లోపలికి రావడం రావడం కోడి, బాతు కట్టిన తాడు కాళ్ళకు తగిలి దభీమని కిందపన్నారు. వెంటనే పొట్టేలు వురుక్కుంటా వచ్చి ఒకొక్కన్ని తలతో ధన్, ధన్, ధన్, ధన్ మని డిచ్చీలు డిచ్చీలు కొట్టింది. ఆ దెబ్బలకు వాళ్ళ కళ్ళు తిరిగి తూలుతూ వుంటే ఎద్దు వాడి వాడి కొశ్శని కొమ్ములతో ఒక్కొక్కన్ని పొడిచి పొడిచి పెట్టింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ దొంగలు ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయినారు. వెంటనే కోడి, బాతు తాడు తీసుకొని వాళ్ళ కాళ్ళూ, చేతులూ గట్టిగా కట్టేసినాయి.

జమీందారు జనాలని వెంటేసుకోని దొంగల కోసం తిరుగుతా వున్నాడు గదా. వాని వద్దకు గొర్రెపోయి జరిగిందంతా చెప్పింది. అందరూ దానెంట వచ్చి దొంగలని చూసినారు. నాలుగింటినీ మెచ్చుకోని “వీటిని ఎవరికీ బలి ఇచ్చేది లేదు. ఇప్పటినుండీ వీటిని నా కన్నబిడ్డల లెక్క సాక్కుంటా” అని అందరికీ చెప్పినాడు.

దాంతో ఆ నాలుగూ సంతోషంగా మరలా జమీందారు ఇంటికి పోయినాయి. హాయిగా కలసి మెలసి కాలం గడపసాగినాయి.
************************
ఆంగ్ల కథకు స్వేచ్ఛనువాదం
సేకరణ

No comments: