Adsense

Monday, March 22, 2021

ఋణానుబంధ రూపేణా….

ఋణానుబంధ రూపేణా….

ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీడేర్తురే
వేళనవ్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
కాలంబెల్ల సుఖంబు నీకు నిక భక్త శ్రేణి రక్షింపవే
శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!

అంతా మిద్య తలంచి చూచిననరుండట్లౌటెరింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి చెంది చరించుగాని పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింత నిల్పడుకదా శ్రీ కాళహస్తీశ్వరా!

ఈ జగత్తులో ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనకనే జగత్తు అన్నారు. జాయతే గఛ్ఛతే ఇతి జగం. రావడమూ మన చేతిలో లేదు, పోవడం అంతకంటే మన చేతిలో లేదు. కాని మానవులు ఉండే కొద్దికాలం లో నూ సర్వమూ ’నేను చేశాను’ అని అహంకరిస్తూనే ఉన్నాడు, నాతో సహా, ఎవరెన్ని చెప్పినా, అవన్నీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాలే అయిపోతున్నాయి. కాలం తో ఋణానుబంధం తీరిపోతూ ఉంటుంది, ముఖ్యం గా వీటిని చెప్పేరు. ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః, పశువులు, భార్య/భర్త, బిడ్డలు,ఇల్లు. వీటితో ఉండే అనుబంధం కాలంతో పాటు చెల్లిపోతుంది. మరోలా కూడా చెప్పుకోవచ్చేమో! మానవులంతా ఈషణ త్రయం చుట్టూ తిరుగుతూ ఉంటారు, కాని అదేం లేదని బుకాయిస్తుంటారు. ఈ ఈషణాలేంటీ? దారేషణ,ధనేషణ, పుత్రేషణ అన్నారు. దారేషణ భార్య/భర్త కోసం  పాకులాట, ధనేషణ సొమ్ము సంపాదనకోసం పాకులాట, పుత్రేషణ కొడుకుల గురించిన పాకులాట. జీవితంలో వీటిని వదలిపెట్టడం చాలా కష్టమనీ చెప్పేరు.

శంకరులు కూడా ధనేషణతో ప్రారంభించే జీవితం,దారేషణ తరవాత, పుత్రేషణ చేసి, జీవితాంతం ధనేషణలో నే ఉండిపోతారు, భజ గోవిందం మరచిపోతున్నారన్నారు. గోవిందుణ్ణి మరవద్దాన్నారు. ఋణానుబంధం ఎంత బలంగా ఉంటుందో మొన్నను అనుభవంలోకి వచ్చింది.

మొన్ననా మధ్య కావలసినవారింటికెళ్ళాం. అక్కడో చిత్రమూ చూశాం. బాగా కలిగిన ఆసామీ, కావలసినవారింటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటారు. నాకంటే వయసులో నాలుగేళ్ళు పెద్దవాడయి ఉండచ్చు. మాకు భోజనాలు పెడుతూ ఆ ఇంటి కోడలు భోజనం ఒక కంచంలో పెట్టి పట్టుకెళ్ళి ఆయనకి పెట్టి వచ్చింది. పూర్తిగా భోజనం చేసేదాకా ఉండలేకపోయావా అమ్మా అన్నా! ఉండద్దంటారు, ఏమైనా కావాలంటే పిలుస్తారు, అందుకే అన్నీ కావలసినవాటికంటే ఎక్కువ పెడతానని చెప్పింది. ఆయనకు పది సంవత్సరాల కితం భార్య గతించింది, ఆ తరవాత కావలసినవారబ్బాయిని పెంచుకున్నారు, అతనో ఉద్యోగి, ఈయనను తన దగ్గరికి రమ్మంటాడు, ఈయన కదలి వెళ్ళడు, అలా పాడు పడినట్టున్న ఇంటిలో ఒక్కడు కూచుని కాగితాలు చూసుకుంటూ ఉంటాడు. అవేంటని ఆ ఇంటి కోడల్ని అడిగితే రావలసిన బాకీల తాలూకు నోట్లు, వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు, ప్రజలు ఆయన దగ్గర సొమ్ము వడ్డీకి పట్టుకెళుతుంటారు. అదీ ఆయన చరిత్ర టూకీగా, ఆ ఇంటి కోడలు మాత్రం గత పది సంవత్సరాలుగా ఆయనకు వండి పెడుతూనే ఉంది, ఆయన భోజనానికి ఇబ్బంది పడతారని పుట్టింటికి కూడా వెళ్ళదట.. ఇది ఏ ఋణానుబంధమో తెలియదు. ఈషణ త్రయాలు ఆయనను చాలా బంధించినట్టే అనిపించింది. భార్య గతించింది, ఒకటి పోయింది, పుత్రేషణ పూర్తయింది, ఈ ధనేషణ మాత్రం ఆయనను వదలలేదనుకుంటా. చిత్రమైన జీవితాలు.

ఋణానుబంధంలో ఆయనకు భార్య గతించింది ఆ ఋణం తీరినట్లుంది, ఇక సుత, ఆలయాల (ఇంటి) ఋణం తీరినట్టులేదు.తృష్ణ మాత్రం మిగిలివుండిపోయింది, ధనం మీద మోజుపోలేదు.

వలిభిర్ముఖమాక్రాన్తం పలితైరంకితం శిరః
గాత్రాణి శిధిలాయన్తే తృష్ణ తరుణాయతే.                                    భర్తృహరి

కరచరణాద్యవయవముల
భరముడిగెవ వళులు మొగముపై నిండారె
శిరసెల్ల వెల్లవారెను
దరిమాలిన తృష్ణయొకడె తరుణతబూనెన్.                                     లక్ష్మణ కవి.

కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ శక్తి కోల్పోయాయి,ముఖం మీద ముడుతలు పడ్డాయి, తల నెరిసింది ఇలా అన్నీ వార్ధక్యాన్నే సూచిస్తున్నాయి కాని తృష్ణ అనగా ఆశ మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉంది.

మన పెద్దలు పిల్లల నుంచి సొమ్ము చేతితో తీసుకోవద్దంటారు, దీనికో కారణమూ చెబుతారు. పిల్లలు మనకు ఋణ గ్రస్తులట, ఏ జన్మలోనో వారు చేసిన బాకీ తీర్చుకోడానికి మన కడుపున పుడతారంటారు, వారి దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటే ఋణ విముక్తి కావచ్చేమోనని భయం. ఈ అమ్మాయి ఏ ప్రలోభమూ లేకనే ఆయనకు సేవ చేస్తూ వస్తూవుంది, గత పది సంవత్సరాలుగా, ఇది ఏమి ఋణానుబంధమో! పోనీ వారికి ఏమైనా బంధుత్వం ఉన్నదా అంటే అదీ లేదు.

ఇల్లు, భార్య, పిల్లలు, సంపద, ఆఖరుకి స్నేహితులు, హితులు,ఈ రాతలు, పలకరింపులు సర్వం ఋణానుబంధమే, అది చెల్లిపోతే…….
అంతా మిధ్య. దర్పణ దృశ్య మాన నగరీ, జీవితమంతా చిత్రమే.
ఈ రోజుతో ఈ ఋణానుబంధం తీరునట్టే……

No comments: