Nammakam
రాయవరంలో రామ్మూర్తి అనే దర్జీ ఉండేవాడు. అతని ఒక్కగానొక్క కూతురు సుకన్య. కూతురిని కలవారింటి కోడలిని చెయ్యాలని కలలు కనేవాడు. తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు కూడబెట్టేవాడు.
ఒకనాడు బంగారం తగ్గిందని జనం చెప్పుకోవడం రామ్మూర్తి చెవిన పడింది. కూడబెట్టిన డబ్బుతో సుకన్యకు నగలు చేయించాలనుకున్నాడు. డబ్బును జాగ్రత్తగా మూట కట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు. కానీ దారిలో చిన్నపాటి అడవి దాటాలి. దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు. ఎంతో కాలంగా ఎరిగున్న వీరయ్యను తోడు రమ్మన్నాడు.
ఇద్దరూ మధ్యాహ్నం వరకూ నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు. తెచ్చుకున్న రొట్టెలు తిన్నారు. కాసేపు నడుం వాల్చారు. బడలికతో రామ్మూర్తికి కునుకు పట్టింది. ఎందుకో కళ్లు తెరిచిన రామ్మూర్తి ఉలిక్కిపడ్డాడు. అతడి తల కింద పెట్టుకున్న డబ్బుల సంచీని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు. పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి ఉడాయించాడు.
రామ్మూర్తి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కొంచెం ఆదమరుపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న తన కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడు. ఎంత ప్రమాదం తప్పిందీ!
ఆ ఉద్దేశంతో అతడు ఏడ్వ సాగాడు. దొంగల భయమని తోడుగా రమ్మంటే పరిచయస్థుడే ఇలా చేయడంతో రామ్మూర్తికి మనుషుల మీదే నమ్మకం పోయింది.
ఇంతలో మరో దారి నుంచి అతనితో కలిసాడో కొత్త వ్యక్తి. కొబ్బరాకు బూరా వూదుకుంటూ ఒంటరిగా అయినా ఉషారుగా నడుస్తున్నాడు. రామ్మూర్తిని చూసి తోడు దొరికిందని సంతోషంతో పలకరింపుగా నవ్వాడు. కానీ రామ్మూర్తి ముఖం చిట్లించుకుని ముభావంగా ఉన్నాడు. కానీ కొద్ది సేపటికే అవతలి వ్యక్తి కలివిడితనానికి ఆకర్షితుడయ్యాడు. పాటలుపాడుతూ నవ్విస్తూ ఉన్న ఆ మనిషిని ఇష్టపడసాగాడు. కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు. అనుమానిస్తున్నాడు.
తన వద్ద డబ్బు ఉందని ఈ అపరిచిత వ్యక్తికి తెలియకుండా ఉండాలని తన గురించి చెప్పాడు. కానీ తన డబ్బు పోయిందని, బికారిగా మారానని చెప్పాడు.
వెంటనే ఆవ్యక్తి ముఖం జాలితో నిండిపోయింది. తన వేలినున్న వజ్రపుటుంగరం తీసి ‘ఇది లక్షల వరహాలు చేస్తుంది. ఇది అమ్మి కూతురి పెళ్లి చేయి’ అని ఓదారుస్తూ ఇవ్వబోయాడు.
రామ్మూర్తి ఆశ్చర్యపోయాడు. ఒక వ్యక్తి లేదా సంఘటన ఆధారంగా మనుషులందరినీ ఒకే గాటన కట్టడం ఎంత తప్పో తెలుసుకున్నాడు. ఉంగరం వద్దని, కోట్ల విలువైన నీ స్నేహం చాలంటూ కంట తడి పెట్టాడు. జరిగినదంతా చెప్పాడు. అలాంటి వ్యక్తిని దొంగగా అనుమానించినందుకు మన్నించమంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. తేలిగ్గా నవ్వేశాడా వ్యక్తి. తిరిగి వాళ్ల ప్రయాణం హాయిగా సాగిపోయింది.
No comments:
Post a Comment