Posted Date:- May 20, 2021

ఈ ఏడాది దేశంలో 13,000 మంది క్రీడాకారులు, శిక్షకులు, సహాయ సిబ్బందికి వైద్య మరియు ప్రమాద బీమా సౌకర్యాన్నికల్పించాలని స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (సాయ్) నిర్ణయించింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులు, సహాయ సిబ్బందికి రక్షణ కల్పించాలన్న యువజన సేవలు, క్రీడల మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయంలో భాగంగా సాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. 

క్రీడాకారులు వారికి శిక్షణ ఇస్తున్న శిక్షకులు వారికి సహాయ పడుతున్న సిబ్బంది సంక్షేమానికి తమ మంత్రిత్వశాఖ ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర  యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖల మంత్రి శ్రీ కిరెన్ రిజిజు అన్నారు. వీరి శక్తిసామర్ధ్యాలు దేశానికి అవసరమన్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో జాతి సంపద అయిన వీరు క్షేమంగా ఆరోగ్యంగా దృడంగా ఉండాలని తాము కోరుకొంటున్నామని ఆయన అన్నారు. దీనిలో భాగంగా సాయ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ నిర్వహిస్తున్న జాతీయ శిబిరాల్లో శిక్షణ పొందుతున్న , శిబిరాలకు ఎంపిక అయిన క్రీడాకారులు, ఖేలో ఇండియా క్రీడాకారులు, జూనియర్ క్రీడాకారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అన్నారు. ప్రతి ఒక్కరికి అయిదు లక్షల ఆరోగ్య బీమా ఉంటుందని,  ప్రమాదం లేదా మరణానికి 25 లక్షల కవర్ ఉంటుందని మంత్రి వివరించారు. 

దీనిద్వారా కేవలం క్రీడాకారులకు  జాతీయ శిక్షణా శిబిరాలు జరుగుతున్న సమయంలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా బీమా సౌకర్యం ఉంటుందని మంత్రి అన్నారు. ఖేలో ఇండియా సిబ్బంది , జూనియర్ అథ్లెట్లకు బీమా సౌకర్యాన్ని ప్రతి సంవత్సరం అయిదు లక్షల వరకు పెంచామని  శ్రీ రిజిజు అన్నారు. 

జాతీయ శిబిరం తేదీలతో సంబంధం లేకుండా ఇది అమలులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు కొన్ని విభాగాలలో శిక్షణా శిబిరాలను నిర్వహించలేదని, అయినా ఈ సౌకర్యం అమలులోకి వస్తుందని అన్నారు. ఈ పథకం వల్ల జాతీయ శిబిరాలతో సంబంధం ఉన్న జాతీయ స్థాయి అథ్లెట్లు, కోచ్‌లు మరియు సహాయక సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 

బీమా పథకంలో చేర్చడానికి అథ్లెట్లను, సహాయక సిబ్బందిని గుర్తించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ స్పోర్టింగ్ ఫెడరేషన్లను అభ్యర్థించింది. ఈ భీమా పథకం పరిధిలోకి వచ్చే వారి సమాచారం  నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టమ్‌లో నిల్వ చేయబడుతుంది, ఇది పారదర్శకంగా, సులభంగా క్రమం తప్పకుండా పర్యవేక్షించే విధంగా ఉంటుంది. 

ప్రతి జాతీయ క్రీడా సమాఖ్యకు శిక్షణ మరియు పోటీ కోసం రూపొందించే వార్షిక క్యాలెండర్ ఆధారంగా విదేశాల్లో పోటీలకు సిద్ధం కావడం, జాతీయ ఛాంపియన్‌షిప్‌ల నిర్వహణ మరియు జూనియర్ కార్యక్రమాల నిర్వహణకు యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. అంతేకాకుండా, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద గుర్తించిన అథ్లెట్లకు మంత్రిత్వశాఖ సహకారం అందిస్తోంది. 

అంతేకాకుండా, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ 596 మాజీ అంతర్జాతీయ సంస్థలకు నెలవారీ పింఛను అందిస్తూ వారికి అండగా ఉంటున్నది.

Release Id :-1720400