Posted Date:- May 18, 2021

పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ పథకం  కింద అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ కోచ్ జోసెఫ్ జేమ్స్‌కు యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ (ఎంవైఎఎస్) రూ . 2,50,000 మొత్తాన్ని ఆమోదించింది.   కోవిడ్ -19 నేపథ్యంలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు మరియు కోచ్‌లకు సాయం అందించేందుకు ఈ ఆర్థిక సహాయం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు ఎంవైఎఎస్‌లు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన మొత్తం నుండి అందించడం జరిగింది.

2006 లో ఆసియా గేమ్స్ బంగారు పతకం మరియు 2008 లో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జోసెఫ్ జేమ్స్ కొన్ని రోజుల క్రితం కోవిడ్ 19 సోకిన తర్వాత ఏప్రిల్ 24 న తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. అతని ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయి. అతని కుటుంబం ఆయన్ను హైదరాబాద్ లోని వివేకానంద ఆసుపత్రిలో అత్యవసరంగా చేర్పించాల్సి వచ్చింది. 7-8 రోజులు ఐసియులో ఉన్న అనంతరం ఆయన మే 5 న డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

సకాలంలో ఆర్థిక సహాయం అందించినందుకు మంత్రిత్వ శాఖ, ఎస్‌ఏఐ మరియు ఐవోఏలకు కృతజ్ఞతలు తెలుపుతూ జోసెఫ్ జేమ్స్ కుమార్తె అలికా జో ఇలా అన్నారు “తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మరియు ఐవోఏ సభ్యులలో ఒకరైన మహేష్ సాగర్ ఈ ఆర్ధికా సహయం గురించి మాకు తెలియజేశారు. ఆయన దరఖాస్తు అందించగా ఇతర అధికారులు సహకారం అందించారు" అని తెలిపారు.

"మా కుటుంబాలు మరియు స్నేహితుల నుండి కూడా మద్దతు పొందడం కష్టంగా ఉన్న ఈ సమయంలో ఇది నిజంగా మంత్రిత్వ శాఖ నుండి గొప్ప సహాయం. మాకు అవసరమైనప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మమ్మల్ని గుర్తు ఉంచుకుని ఆదుకుంది ”అని ఆమె అన్నారు.

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జె. యాదవ్ కూడా ఎస్‌ఏఐ, ఎంవైఎఎస్ మరియు ఐవోఏలకు కృతజ్ఞతలు తెలిపారు. " మిస్టర్ జోసెఫ్‌కు అతని వైద్య ఖర్చులకోసం ఈ ఆర్థిక సహాయం అందించినందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని స్పోర్ట్స్ కమ్యూనిటీ తరపున యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్రీడలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు చాలా కృతజ్ఞతలు.  ఈ క్లిష్ట సమయాల్లో క్రీడాకారులకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ” అని చెప్పారు.