మహమ్మారి నడుమ గ్రామీణాభివృద్ధిలో భారత్ కొత్త మైలురాళ్లు

2021 ఆర్థిక సంవత్సరంలో ‘ఎంజీఎన్ రెగా’ కింద 1.85 కోట్ల మందికి ఉపాధి; 2019తో పోలిస్తే ఇది 52 శాతం అధికం;


2021లో మహిళా స్వయం సహాయ బృందాలకు రమారమి రూ.56 కోట్లు విడుదల; 2020లో ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపు;

‘ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం’ కింద గత
మూడేళ్లతో పోలిస్తే పొడవురీత్యా అత్యధికంగా రోడ్ల నిర్మాణం పూర్తి

‘ప్రధానమంత్రి ఆవాస యోజన-గ్రామీణ’ కింద 2021లో అత్యధికంగా రూ.5,854 కోట్లు వ్యయం; 2020లో ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు

Posted Date:- May 17, 2021

   కోవిడ్ మహమ్మారి రెండోదశ విజృంభణతో గ్రామీణ భారతంపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా ఎంతో కృషి చేసింది. ఈ మేరకు దేశమంతటా మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ పథకాల్లో వేగం, ప్రగతి నమోదు కావడం విశేషం. అభివృద్ధి పనులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 పరిస్థితి నిర్వహణకు రాష్ట్ర, జిల్లా, సమితుల స్థాయిలో నోడల్ వ్యక్తులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించింది.

   మహమ్మారి పరిస్థితుల్లోనూ 2021 మే నెలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ రెగా) కింద 1.85 కోట్ల మందికి ఉపాధి కల్పించబడింది. ఇది 2019 మే నెలలో ఇదే వ్యవధితో పోలిస్తే 52 శాతం అధికంగా రోజుకు రూ.1.22 కోట్ల మందికి ఉపాధి లభించింది. ప్రస్తుత 2021 మే 13వ తేదీనాటికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో తలసరి 34.56 రోజువారీ పనిదినాల వంతున 2.95 కోట్ల మందికి ఉపాధి కల్పించగా 5.98 లక్షల ఆస్తుల సృష్టి పూర్తయింది. ఇక ముందువరుసలోని ఉద్యోగులుసహా అన్ని స్థాయుల సిబ్బందిలో కొందరు మరణించగా, మరికొందరు వ్యాధిబారిన పడినా మంత్రిత్వశాఖ ఈ విజయం సాధించడం గమనార్హం.

   గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19పై పోరాడేందుకు మహమ్మారి అనుగుణ ప్రవర్తన, టీకాలు వేయడంపై ‘దీన్‌ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న‌-జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి కార్య‌క్ర‌మం’  (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద 2021 ఏప్రిల్ 8-12 తేదీల మధ్య శిక్షకులకు శిక్షణ ఇవ్వబడింది. అంతేకాకుండా టీకాలపై విముఖత తొలగింపు, ఆరోగ్యకర అలవాట్ల అనుసరణ, రోగనిరోధకత పెంపు చర్యలు తదితరాలపై ప్రజలను ప్రోత్సహించడంపైనా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, సమితుల స్థాయిన 34 ‘ఎస్ఆర్ఎల్ఎం’లలో మొత్తం 13,598 మంది ప్రధాన శిక్షకులు శిక్షణ పొందారు. వీరిద్వారా 1,14,500 మంది ‘సామాజిక రిసోర్స్ పర్సన్లు’ (సీఆర్‌పీ) శిక్షణ పొందగా, ఈ ‘సీఆర్‌పీ’లు 2.5 కోట్ల మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర, జిల్లా నోడల్ వ్యక్తులకు ‘డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం’ కింద కోవిడ్ నిర్వహణపై సామర్థ్య వికాసం, సామాజిక అభివృద్ధి సంబంధిత శిక్షణ కూడా ఇచ్చారు.

   ఉపశమనం, ఉపాధి సృష్టి లక్ష్యంగా ఆవృత (రివాల్వింగ్) నిధి, సామాజిక పెట్టుబడుల నిధి (సీఐఎఫ్) కింద 2021 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయ సంఘాలకు రూ.56 కోట్లదాకా విడుదల చేయబడ్డాయి. అంతకుముందు 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇదే వ్యవధిలో ఇది దాదాపు రూ.32 కోట్లు అధికం. మరోవైపు వ్యవసాయ, వ్యవసాయేతర జీవనోపాధిపై సిబ్బందికి, సామాజిక కార్యకర్తలకు ఆన్‌లైన్ శిక్షణ కొనసాగుతోంది. అంతేగాక స్వయం సహాయ సంఘాల కుటుంబాల ద్వారా వ్యవసాయ-పోషకాహార తోటల పెంపకం ప్రోత్సహించబడింది.

 

   దేశంలోని 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో దిగ్బంధంతోపాటు మానవ లభ్యత-రాకపోకలు, యంత్రాలు-సామగ్రి తరలింపు వంటి సమస్యలు పీడించినా ఈ ఏడాది గ్రామీణ రోడ్ల నిర్మాణంలో రికార్డు నమోదైంది. ‘ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం’ (పీఎంజీఎస్‌వై) కింద గత మూడేళ్లతో పోలిస్తే పొడవురీత్యా అత్యధికంగా రోడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు 2021 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి మే 12 వరకూ సంచిత భౌతిక ప్రగతి కింద 1,795.9 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తి కాగా, సంచిత వ్యయం కింద రూ.1,693.8 కోట్లు ఖర్చయ్యాయి. మునుపటి ఆర్థిక సంవత్సరాల్లో ఇదే వ్యవధితో పోలిస్తే ఇది అత్యధికం.

   కోవిడ్-19 మహమ్మారివల్ల ‘ప్రధానమంత్రి ఆవాస యోజన-గ్రామీణ’ సహా ఇతర గ్రామీణాభివృద్ధి పథకాలపైనా తీవ్ర ప్రభావం పడింది. అయినప్పటికీ, మంత్రిత్వశాఖలో విధుల క్రమబద్ధీకరణ వల్ల గణనీయంగా నిధులు వెచ్చించబడ్డాయి. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.2,512 కోట్లు; 2019-20లో రూ.1,411 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.5,854 కోట్ల మేర వ్యయంతో మునుపటి రెండేళ్లతో పోలిస్తే వరుసగా 43 శాతం, 24 శాతం అధికంగా నమోదవడం విశేషం.

 

Release Id :-1719430