*కోవిడ్ పరిస్థితితో స్వార్ధం కోసం నిత్యావసరాలను అక్రమ నిల్వ చేసే మిల్లర్లు, టోకు చిల్లర వర్తకులపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ


*రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై రాష్ట్రాలతో సమీక్షించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి

Posted Date:- May 19, 2021

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలపై నిఘా ఉంచాలని అధికారులకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు. ధరలను నియంత్రించడానికి తగినంత మొత్తంలో  వస్తువులను నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ రోజు వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులకు సూచించారు. 

కోవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయోజనం పొందడానికి వస్తువులను అక్రమంగా నిల్వ చేసే మిల్లర్లు, టోకు చిల్లర వర్తకులపై  నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు మంత్రి సూచించారు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలల్లో నిత్యావసర వస్తువుల ధరలపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

157 రకాల వస్తువుల ధరలపై వినియోగదారుల వ్యవహారాలశాఖ 34 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 157 కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. పప్పులు, నూనెలు, కాయగూరలు, పాలపదార్ధాలు లాంటి 22 నిత్యావసర వస్తువుల ధరలను రాష్ట్రాలు సమీక్షిస్తూ వీటి ధరల్లో పెరుగుదల కనిపించినప్పుడు జోక్యం చేసుకుని వినియోగదారులకు వస్తువుల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. 

ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెరగకుండా చూడడానికి కేంద్రం చర్యలను తీసుకుంటున్నది. దీనిలో భాగంగా రెండు రోజుల కిందట ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో చర్చలు జరిపారు. మిల్లర్లు, వ్యాపారులు, దిగుమతిదారులు తమ వద్ద వున్న సరకుల వివరాలను ప్రకటించాలని, దీనిని సంబంధిత అధికారులు తనిఖీ చేయాలనీ కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు. 

కొరత ఏర్పడకుండా చూడడానికి ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ పప్పుధాన్యాల దిగుమతి విధానంలో మార్పులు చేసింది. ముందుగానే ప్రణాళికలను రూపొందించుకుని వస్తువులను నిల్వ చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి వివరించారు. 

పప్పుధాన్యాల ధరలను వారానికి ఒకసారి పప్పుధాన్యాల ధరలను సమీక్షించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికోసం మిల్లర్లు, టోకు, చిల్లర వర్తకుల వద్ద వున్న సరకుల వివరాలను నమోదు చేయడానికి రూపొందించిన ఆన్‌లైన్ డేటాషీట్ రాష్ట్రాలు / యుటిలకు కేంద్రం అందించింది. పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల్లో పంటల ఉత్పత్తి సజావుగా సాగేలా చూడాలని కూడా కేంద్రం సూచించింది. మరింత ఎక్కువగా పప్పు ధాన్యాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్రాలు చర్యలు అమలు చేయాలని కోరింది. 

Release Id :-1720115