Posted Date:- May 16, 2021

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాళహస్తిలో ఉన్న రెండు ప్రధాన ఆక్సిజన్ ప్లాంట్లకు విశాఖలోని నౌకాదళ బృందాలు మరమ్మతులు చేశాయి. దీనివల్ల, ప్రస్తుత ఆక్సిజన్ సంక్షోభ సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాకు గొప్ప ఊతం దొరికింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు, విశాఖ నావల్‌ డాక్‌యార్డు నుంచి నిపుణుల బృందాలను డోర్నియర్ విమానాల ద్వారా తూర్పు నౌకాదళం క్షేత్రస్థాయికి పంపింది. ఈ ఉదయం, నిపుణుల బృందాలు కంప్రెషర్లను సరిచేసి, ఆక్సిజన్ ప్లాంట్లకు విజయవంతంగా మరమ్మతులు పూర్తి చేశాయి. నావల్ డాక్‌యార్డ్‌లో తయారైన అడాప్టర్లు, మరికొన్ని ఉపకరణాలను ప్లాంట్లలో అమర్చాయి.

    నెల్లూరులోని కృష్ణతేజ ఆక్సిజన్‌ ప్లాంటు అతి పెద్ద క్రయోజెనిక్‌ ప్లాంటు. ఇది, 400 అతి భారీ సిలిండర్లను ఒక్కరోజులో నింపగలదు. గత ఆరేళ్లుగా పనిచేయడం లేదు. నౌకాదళ నిపుణులు విజయవంతంగా పనిపూర్తి చేసి, -186 డిగ్రీల క్రయోజెనిక్‌ ఉష్ణోగ్రత ఉండేలా చేయగలిగారు. సిలిండర్లను నింపేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఒత్తిడి కూడా ఉండేలా విజయం సాధించారు. ఇక్కడ ఉత్పత్తయ్యే
98% ఆక్సిజన్, 0% కార్బన్ మోనాక్సైడ్, 0.01% కార్బన్ డై ఆక్సైడ్ కలిసిన విశ్లేషణ, రాష్ట్రంలో వైద్య ఆక్సిజన్ కొరతను భర్తీ చేస్తుంది.

    శ్రీకాళహస్తిలోని ఆక్సిజన్‌ ప్లాంటు వీపీఎస్‌ఏ సాంకేతికతతో నిర్మితమైంది. ఇది, నిమిషానికి 16 వేల లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనిని నౌకాదళ బృందం విజయవంతంగా మరమ్మతు చేసింది. ఇక్కడి నుంచి 93%పైగా ఆక్సిజన్, 0% కార్బన్ మోనాక్సైడ్, 0.01% కార్బన్ డై ఆక్సైడ్ కలిసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లాంటు కాలమ్‌, తేమ శోషణను మరమ్మతు చేయడం ద్వారా నిపుణుల బృందం ఈ విజయాన్ని సాధించింది.

    కమాండర్ దీపాయన్ నేతృత్వంలోని నౌకాదళ బృందం అవిశ్రాంతంగా 7 రోజులపాటు కష్టపడి ఈ రెండు ప్లాంట్లకు మరమ్మతులు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య విభాగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాలు వీరికి సహకరించాయి.

 

Release Id :-1719127