ఆయుర్వేదం అనగా చాలామంది దృష్టిలో చెట్లు , వాటి చూర్ణాలు అనే దృష్టి ఉంది. కాని చాలామందికి దానిలో అనేక రకాల వైద్యవిధానాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. వాటిగురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను.
మనకి తెలిసిన ఆయుర్వేద ప్రముఖుల్లో చరకుడు , శుశ్రుతుడు అందరికి తెలుసు. కాని ఇంకో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతని పేరు వాగ్బాటాచార్యుడు . ఈయన రాసిన " అష్టాంగహృదయం " అనే గ్రంధం చాలా ప్రముఖమైనది. దీనిలో అనేక భాగాలు కలవు. ఒక భాగంలో కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న " మర్మకళ" గురించి చాలా వివరంగా ఉన్నది. మనిషి శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల గురించి , దానిపైన ఒత్తిడి కలిగించినప్పుడు కలిగే సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన రాసిన "అష్టాంగసంగ్రహం" అను గ్రంథం కూడా ప్రముఖమైనది.
వాగ్బాటాచార్యుడు ఆయుర్వేదంని 8 విభాగాలుగా విభజించాడు. అవి
* శల్యతంత్రము .
* శాలాఖ్య తంత్రము .
* కాయచికిత్స .
* భూతవిద్య .
* కౌమారభృత్యము .
* అగధాతంత్రము .
* రసాయన తంత్రము.
* వాజీకరణ తంత్రము .
ఒక్కొక్కదాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.
* శల్య తంత్రము -
మేకులు , రాళ్లు , ధూళి , ఇనుపమేకులు , మట్టిపెళ్లలు , ఎముకలు , గోళ్లు మొదలైనవి శరీర అంతర్భాగమున చొరబడినచో వానిని బయటకి తీయు ఉపాయములు , యంత్రములు, శస్తములు , క్షారములు మరియు అగ్నిని ప్రయోగించు విధానముని తెలియజేయునది శల్యతంత్రము .
* శాలాఖ్య తంత్రము -
కంఠమునకు పైభాగమున చెవులు , కన్నులు , కంఠబిలం , నాసిక మొదలగు వాటియందు కలుగు వ్యాధుల నివారణార్ధం ఏర్పడినది శాలాఖ్య తంత్రము.
* కాయచికిత్స -
సమస్త అవయములును అనుసరించి జ్వరం , అతిసారం, రక్తపిత్తము , శోష , ఉన్మాదము , అపస్మారము , కుష్ఠము, మేహము మొదలగు వ్యాధులను నివారించుటకు నిర్ణయింపబడిన చికిత్సా విధానమును కాయ చికిత్స అందురు.
* కౌమారభృత్యము -
శిశువుల పోషణా విధానము , పాలు ఇచ్చే విధానం , పాలల్లో దోషములు శోధించుట , దుష్టపు పాలు త్రాగుట చేత , దుష్ట గ్రహంబులు చేత కలిగిన వ్యాధుల నివర్తి చేయుటకు తగు విధానములు భోధించునది "కౌమారభృత్యము ".
* అగధ తంత్రము -
పలు రకాల సర్పాలు , కీటకములు , సాలెపురుగులు , తేళ్లు , ఎలుకలు మొదలగు విషజంతువులు కరుచుట చేతను కలిగిన విషమును తెలుసుకొనుటకు , విషముల్లో రకాలు అయిన స్థావర, జంగమ విషములు గురించి వాటి ఉపశమనాల గురించి ఎర్పడినది అగధ తంత్రము.
* రసాయన తంత్రము -
యవ్వనమును స్థిరముగా చేయుటకు , ఆయువుని , బలమును , బుద్ధిని కలుగచేయుటకు , వ్యాధుల నివర్తించుటకు సమర్ధంబు అయినది రసాయన తంత్రము .
* వాజీకరణ తంత్రము -
క్షీణించిన రేతస్సును అధికంగా చేయుటకు , దుష్టమగు రేతస్సుని శుభ్రముగా చేయునది , సంభోగము నందు అధిక శక్తిని , కామవాంఛ కలుగ చేయునది వాజీకరణ తంత్రము .
ఈ విధముగా ఆయుర్వేదము 8 అంగాలుగా విభజించబడినది. ఆయా సమస్యలకు సరియైన చికిత్సా విధానములు అనుసరించి చికిత్సని అందించవలెను
No comments:
Post a Comment