Adsense

Wednesday, June 23, 2021

అక్షతల పరమార్థం


వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. ‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’. క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.

శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

No comments: