*శ్రావణ పూర్ణిమ రోజు ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం*
ప్రతి ఏడాది ప్రపంచ సంస్కృత భాషాదినోత్సవాన్ని భారత క్యాలెండర్ ప్రకారం శ్రావణ పూర్ణిమ నాడు ఘనంగా నిర్వహిస్తారు.
మరుగనపడి ఉన్న సంస్కృత భాష వైభవాన్ని పునరుద్ధరించేలా చేయడం , ఆ భాష ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
భారత దేశంలో గల ప్రాచీన భాషలలో అతి పురాతనమైన భాష సంస్కృతం. *'జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల'-* అన్ని ప్రధాన భాషలకూ సంస్కృతమే తల్లి వంటిదని మన పెద్దలు వక్కాణించి చెప్పినమాట. సంస్కృతం అంటే ఒక చోట చేర్చబడినది , బాగా సంస్కరించబడినది , ఎలాంటి లోపాలూ లేనిది , అనంతంగా విస్తరింపబడినది అని అర్థం. దీనికి *దేవభాష , అమరభాష* అని మరి రెండు పేర్లు కూడా ఉన్నాయి. మన ప్రాచీన సాహిత్యమంతా ఈ భాషలోనే నిక్షిప్తమై ఉంది. ఈ భాషకు వాడే లిపిని దేవనాగరలిపి అని , బ్రాహ్మీలిపి అని అంటారు. ఇది ఇండో ఆర్యన్‌భాషా కుటుంబానికి చెందినది అని అంటారు పెద్దలు. దక్షిణాసియా , తూర్పుఆసియా , ఆగ్నేయాసియాలపై సంస్కృతం వెదజల్లిన సంస్కృతీ ప్రభావం బలంగా కనబడుతుంది. భారతీయ భాషలన్నిటి పైనా , నేపాల్ భాషపైనా దీని ప్రభావం విశేషంగా ఉంది. అందుకే సంస్కృతం ఇండో ఇరానియన్ భాషాకుటుంబానికి చెందినది అని అంటారు. ఇండో ఇరానియన్ భాషలకు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం పుట్టిల్లు. కనుక ఇండోఇరానియన్ భాషలను ఇండో యూరోపియన్ ఉపభాషా కుటుంబాలుగా లెక్కిస్తారు కనుక సంస్కృతాన్ని ఇండోయూరోపియన్ భాషా కుటుంబానికి దగ్గర సంబంధాలున్న భాషగా చెబుతారు. ప్రాచీన పెర్షియన్ , అఫ్గనిస్థాన్ భాషలకు కూడా సంస్కృతానికి బాగా దగ్గరి పోలికలుంటాయని భాషావేత్తలు చెబుతారు. సంస్కృత పదధ్వనులు మరీముఖ్యంగా స్లావిక్ , బాల్టిక్‌భాషలకు , గ్రీక్‌భాషకు ఎంతో దగ్గరి పోలికలుంటాయని అంటారు. సంస్కృతాక్షరాలు లాటిన్ అక్షరాలకు చాలా సన్నిహితంగా ఉంటాయని కూడా వారు చెబుతుంటారు. హిందూ మతానికి చెందిన సమస్త వాఙ్మయం సంస్కృతంలోనే ఉంది. బౌద్ధమత గ్రంథాలు కూడా దాదాపు సంస్కృతంలోనే కనబడతాయి. అతి పురాతన సంస్కృత భాషా సాహిత్యానికి మూలరూపం రుగ్వేదంలో కనబడుతుంది. ఇది క్రీ.పూ. 1500 సంవత్సరానికి చెందినది. ఇది ఉమ్మడి పంజాబ్ ప్రాంతంలో లభ్యమైంది. ఈ గ్రేటర్ పంజాబ్ దేశ విభజనకు ముందున్న పంజాబ్ అన్నమాట. ఇది ఆఫ్ఘనిస్థాన్‌కు దాదాపు సరిహద్దు ప్రాంతంలాంటిది. సంస్కృతం అందించిన వేదాల వల్లే అతిపురాతన కాలానికి వేదకాలమనే పేరు వచ్చింది. క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన పాణిని అష్టాధ్యాయి పేర 8 అధ్యాయాలతో సంస్కృత భాషకు వ్యాకరణం రచించాడు. ఈయన వ్యాకరణం రాసేలోపు సామవేదం , యజుర్వేదం , అధర్వణవేదం , బ్రాహ్మణాలు , ఉపనిషత్తులు పుట్టాయి. వేదకాలం నాటికి పుస్తక రచన అనేది లేదు. అందువల్ల వేదాలను యథాతథంగా బట్టీయం వేయడం ద్వారా కాపాడుకున్నారు అప్పటివారు. ఇందువల్ల వాటి ఉచ్ఛారణతో సహా సాహిత్యం మనకు అందివచ్చింది. సంస్కృత భాష ద్వారా భారతీయులకే సొంతమనదగిన వేదాలు , వేదాంతాలు , వేదాంగాలు , సూత్రాలు , పురాణాలు , ఇతిహాసాలు , ధర్మశాస్త్రాలు , శాస్త్ర సాంకేతిక విషయాలు , తాత్విక అంశాలు , మత , ధార్మిక , ఆధ్యాత్మిక విషయాలు , మంత్రాలు , తంత్రాలు , నాటకాలు ఎన్నో సమాజానికి అందివచ్చాయి. కనుక వీటినిబట్టి సంస్కృత భాష పుట్టుకను అంచనావేయాల్సివస్తే అది కనీసం క్రీ.పూ. 1500 నాటిదని నిర్థారణగా చెప్పవచ్చు.
వేదవాఙ్మయం తరువాత సంస్కృత భాషలో వచ్చిన మార్పులకు అద్దం పట్టేవి ఉపనిషత్తులు. భారతీయపురాణాలైన రామాయణ , మహాభారతాలలో కనిపించే భాష మరింతగా మార్పుచెందింది. పురాణాలలో కనిపించే భాషలో ప్రాకృత శబ్దాల ప్రభావం కలిగిన సంస్కృతం కనబడుతుంది. పాణిని వ్యాకరణం వచ్చిన తరువాత సంభవించిన మార్పులు వీటిలో ప్రస్ఫుటంగా కనబడతాయి. సంస్కరించబడిన భాష నుంచి పక్కకు తప్పుకున్న భాషా పదాలు ప్రాకృత పదాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ పదాల వాడకం రామాయణ , మహాభారతాలలో బాగా కనబడతాయి. సహజత్వం చెడని సంస్కృత భాషను ఆర్షభాషగా వింగడించడం అప్పుడే ప్రారంభమైంది. సంస్కృతంలోనూ మాండలికాలు ఉన్నాయి. పశ్చిమోత్తరి , మధ్యదేశి , పూర్వి , దక్షి మాండలికాలుగా వాటిని విభజించారు. వీటిలోనూ పశ్చిమోత్తరి మాండలికంలో సంస్కృతం స్వచ్ఛతను ఎక్కువగా నిలబెట్టుకుందని చెబుతారు. ఒకనాడు దేశమంతటా మారుమోగిన భాష సంస్కృతం. వేదాలలోనే కాదు , జన వ్యవహారంలోనూ బాగా వినియోగంలో గల భాష సంస్కృతం. వాల్మీకి , వ్యాసుడు , భాసుడు , బాణుడు , భారవి , భామహుడు , మాఘుడు , శ్రీహర్షుడు , శూద్రకుడు , అశ్వఘోషుడు , హాలుడు , కాళిదాసు వంటి వారు తమ రచనలతో సంస్కృతభాషను సుసంపన్నం చేశారు.
సంస్కృతమే లేకపోతే మనం ఈనాడు సగర్వంగా చెప్పుకునే రామాయణం , భారతం , భాగవతం , రఘువంశం , అభిజ్ఞానశాకుంతలం , మేఘసందేశం , కుమారసంభవం , మృచ్ఛకటికం , కిరాతార్జునీయం , నాగానందం , హర్షనైషథం , విక్రమార్కచరిత్ర , శుకసప్తశతి , గాధాసప్తశతి , ప్రతాపరుద్రీయం , చరకసంహిత , పంచతంత్రకథలు , హితోపదేశ కథలు , కథాసరిత్సాగరం , కౌటిల్యుని అర్థనీతి , భర్తృహరి సుభాషితాలు , ఏవీ మనకు అందివచ్చేవికావు. అలాగే విష్ణుసహస్రనామాలు , లలితా సహస్రనామాలు , దేవీ స్త్రోత్రాలు , ఆదిశంకరుని భజగోవిందం , జయదేవుని గీతగోవిందం , సౌందర్యలహరి , శివానందలహరి , బ్రహ్మసూత్రాలు , నారదభక్తిసూత్రాల వాత్సాయనుని కామసూత్రాల వంటివెన్నో మనకు లేకుండా పోయేవి. ఒక మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి లేకుండా పోయేది. మన రాజనీతి , అర్థనీతి , సమాజనీతి అంతా సంస్కృతం వల్లే మనదాకా వచ్చాయి. ఆది దేవుళ్ళేకాదు , ఆదిమ మానవుల చరితలు సైతం సంస్కృతం తెలియకుంటే తెలిసే అవకాశమేలేదు.
*పుస్తకాలకే పరిమితమైన మృతభాష:*
ఆ తరువాతి కాలంలో సంస్కృతం పుస్తకాలకే పరిమితమై వ్యవహారంలో లేకుండా పోయింది. లౌకికభాషగా మిగలలేదు కనుక దాన్ని కొందరు మృతభాషగా పరిగణించారు. సంస్కృతం జీవద్భాష అని ఘనంగా వాదించే వారెలా ఉన్నారో మృతభాష అని ఘంటాపథంగా వాదించేవారూ అంత గట్టిగానే ఉన్నారు. పరమ ప్రాచీనమైన భాషగా పేరొందిన లాటిన్‌లాగే సంస్కృతం కూడా వాడేవాడు లేక చచ్చిపోతోందని పోలక్ అనే భాషావేత్త వ్యాఖ్యానించాడు. రాజభాషగా ఒక వెలుగు వెలిగిన సంస్కృతం క్రమంగా పోషకులులేక , వాడకందారులులేక క్షీణించిపోవడం ప్రారంభించింది. భూమిపొరలలో శిలాజాలు ఉన్నట్టే ఇతర భాషలలో సంస్కృత భాషావశేషాలు మిగిలి ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 100కోట్ల పైచిలుకు ఉంటే అందులో 14,135 మంది మాత్రమే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడేవారున్నారంటే సంస్కృతభాష వ్యవహారంలో ఎంతగా లుప్తమైపోతోందో అర్థం చేసుకోవచ్చు.
*సంస్కృత భాష ప్రాధాన్యత:*
ఆంగ్లేయ విద్యావిధానం వల్ల సంస్కృతానికి తీరని హాని జరిగింది. ఈ విద్యావిధానంలో మన ప్రాచీన విజ్ఞానానికి సరైన ఆలంబన లభించట్లేదు. ఉదాహరణకు పిల్లలకు నైతిక విలువలను నేర్పటానికి ఇతిహాసాలను మించినవి లేవనే విషయాన్ని అందరూ అంగీకస్తున్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని ముందుకు నడపటానికి భగవద్గీతకు మించిన గ్రంథం వేరే ఉంటుందా ? వీటికి సంబంధించిన అంశాలేవీ ఇప్పటి దాకా మన విద్యావిధానంలో భాగం కాదు. సంస్కృతాన్ని పాఠశాలల్లో పిల్లలకు నేర్పాలి. దీనివల్ల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మన శరీరంలో ఉన్న 72వేల నాడులు చక్కగా పనిచేస్తాయి. సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది....స్వస్తి..
No comments:
Post a Comment