.
ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు...
పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.
మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది.
దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు.
అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.
ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట.
కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది...
శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు.
ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.
ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా *‘చుక్కల అమావాస్య’* పేరుతో ఒక నోముని నోచుకుంటారట.
ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు.
ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట.
దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !
ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు.
రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు.
ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు.
ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు...స్సేకరణ...🚩🌞🙏🌹🎻
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
No comments:
Post a Comment