Adsense

Friday, October 1, 2021

సింధు నది పుష్కరాలు (నవంబర్ 21 నుంచి )


*నీరు* సకలజీవకోటికి ప్రాణాధారం. మానవాళి ఉనికి , నాగరికత నీటిపైనే ఆధారపడింది. మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మం జలానికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చింది. దాహం తీర్చడమే కాదు , ఆచమనం మొదలు తర్పణం వరకు మనిషికి నీటితోనే పని. చివరకు తులసి తీర్థం గొంతు దిగాలన్నా నీటిచుక్కే సాయపడుతుంది. అందుకే పంచభూతాల్లో జలానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
ఆ నీరు ప్రవాహ రూపం దాలిస్తే దాన్ని నదిగా పిలుస్తాం. *తూర్పు దిశగా ప్రవహిస్తూ నేరుగా సముద్రుడిలో కలిస్తే నదిగాను , అలాగే పశ్చిమ దిశగా ప్రయాణించి సాగారాన్ని చేరుకొంటే దాన్ని నదం అంటారు. నదీనదాలంటే మన దేశంలో కేవలం నీటి ప్రవాహాలు కావు - అవి దేవతా స్వరూపాలు.*  శివుడు జలాభిషేక ప్రియుడు , మహావిష్ణువు భక్తితో తనకు ఒక్కనీటి బొట్టును సమర్పించినా చాలునంటాడు. మహా విష్ణువు నీటిలోనే నివాసం ఉంటాడు. నారం అంటే నీరు..! నీరులో నివసిస్తాడు కాబట్టే ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది.
మన ప్రాచీన ఋషులు కూడా నదీతీరాల్లో నివసించేవారు. ఋషుల పుణ్యక్రతువుల కారణంగా నదీజలాలకు అపారమైన ఆధ్యాత్మిక జీవశక్తి చేకూరుతుందని , మానవుల శారీరక మాలిన్యాలతో పాటు , కర్మలకు చెందిన కాలుష్యాలను సైతం కడిగివేసే సామర్థ్యం సమకూరుతుందని పెద్దలు చెబుతారు. ఆ విశ్వాసం కారణంగానే మనదేశంలో పుణ్య నదీపుష్కరాలకు జనం కోట్ల సంఖ్యలో హాజరవుతారు.
పుష్కరుడంటే వరుణుడు. ఆయనను *‘తీర్థరాజు’గా* పిలుస్తారు. తీర్థమంటే పుణ్యస్థలం. 

పుణ్యపురుషులకు ఆశ్రయం కల్పించిన స్థలం *‘తీర్థం’* అవుతుందని మహాకవి కాళిదాసు *‘కుమార సంభవమ్‌’లో* విశదీకరించాడు. పూర్వకాలంలో పుణ్యపురుషులు , ఋషులు నదీతీరాల్లో విడిది చేసేవారు. లోకహితం కోరి యజ్ఞాలు , హోమాలు నిర్వహించేవారు. తిరిగి తమ లోకాలకు తరలే ముందు , వారు దీక్షారూప తపస్సులను నదీజలాల్లో విడిచివెళతారని పురాణ వచనం. అందువల్ల నదులకు ఎనలేని పవిత్రత చేకూరుతుందని పెద్దలు చెబుతారు.
అంతేకాదు ఆయా హోమ హవిస్సులను స్వీకరించడానికి వివిధ దేవతలు తీర్థాలకు వేంచేస్తారు. వారికి ఆతిథ్యం ఇచ్చే నిమిత్తం పుష్కరుడు వస్తాడు. 

పుష్కరాలు వస్తే దేవతలకే కాదు , నదులకూ గొప్ప పండుగే ! ఒక్కో నదిలో ఏడాది చొప్పున 12 పుణ్యనదుల్లో పుష్కరుడు నివాసం ఉంటాడు కాబట్టి , ప్రతి నదికీ 12 ఏళ్లకోసారి మనకు పుష్కరాలు వస్తాయి.
ఈ ఏడాది సింధునదికి పుష్కర సంవత్సరం. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. *అయితే కొంతమంది పంచాంగకర్తలు సింధూ నది పుష్కర తేదీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా…, ఈ ఏడాది మొత్తం కూడా సింధునది పుష్కర సంవత్సరం అనే విషయం మనం మర్చిపోరాదు. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించి రెండు నెలల వరకు ఉంటున్నాడని , ఆ తర్వాత మకర రాశిలోకి వెళ్తున్నాడని , తిరిగి ఈ ఏడాది నవంబర్ 21 న మరోసారి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడని అప్పుడు కూడా సింధునదికి పుష్కరవేడుకలు జరుపుకోవాలని కొంతమంది పంచాంగకర్తలు చెబుతున్నారు.  తేదీలపై వివాదాలు ఏలా ఉన్న సింధునది పుష్కరాల్లో సమస్త భారత ప్రజానీకం పాల్గొనాలి. పుష్కర ఏడాదిలో ఆ నదీ జాలాలకు అపారమైన ఆధ్యాత్మిక జీవశక్తి చేకూరుతుంది. దేశంలో ఆధ్యాత్మిక వికాసం.. విరాట్ హిందూ స్వరూపం ప్రత్యక్షమవుతుంది.* 

లద్దాఖ్ భూమిలో తిరిగి హైందవ జీవనమ్ము వెల్లివిరిస్తుంది.
సింధూ నది టిబెట్ లోని మానస సరోవరం , కైలాస పర్వతాల్లో ఉద్భవిస్తోంది. ఇది కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాక్ లోని డెమ్ చోక్ లో భారత్ లోకి ప్రవేశించి , అక్కడి నుంచి న్యోమ , లెహ్ , నిమూ , కల్సినిము , బాటాలిక్ వరకు భారత్ లో ప్రవహించి , అక్కడి నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా ప్రవహించి , కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది.

సింధూ నది కశ్మీర్ లోయలో ప్రవేశించదు. కానీ సింధునది ఉప నదులు కశ్మీర్ లోయాలో ప్రవహిస్తాయి. అయితే కొన్ని టూరిస్టు ఏజెన్సీలు సింధూ పుష్కరాల సమయంలో ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోనే మార్గ్ లో ఉద్భవించిన ఒక వాగును కశ్మీరీలు సింధ్ గా వ్యవహరిస్తారు. ఈ వాగు షాధిపూరా అనే గ్రామం సమీపంలోని నారాయణ్ భాగ్ వద్ద జీలం నదిలో కలుస్తోంది. రెండు నదు కలిసే సంగమం కావడంతో యాత్రీకులు ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నిజానికి సింధునదీ లద్దాక్ మీదుగా పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రవేశిస్తుందనే విషయం మనం మర్చిపోరాదు.
ఈ ఏడాది సింధు పుష్కరాలు కావడంతో చాలా మంది యాత్రీకులు లద్దాక్ లో ప్రవహించే సింధునదీలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఇప్పుడు అక్కడ పర్యాటక రంగాన్ని పోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సింధునది పుష్కర స్నానాల కోసం లద్దాక్ బాట పట్టారు...సేకరణ...🚩🌞🙏🌹🎻

No comments: