Adsense

Wednesday, October 6, 2021

గణేశుని కొబ్బరి ప్రీతి

 
            

కేరళ దేశంలో  'సూర్య
కాలడి ' వారు పేరుమోసిన నంబూద్రి కుటుంబము.

సాక్షాత్తు సూర్య భగవానుడే
ప్రత్యక్షమై వారికి ఒక మంత్ర గ్రంధాన్ని అనుగ్రహించాడు.

సూర్యదేవుని  కాలి అడుగులు పడినందున
యీ గృహనికి ' సూర్యకాలడి' అనే పేరు కలిగి ఆ కుటుంబీకులు సూర్యకాలడి  వంశంగా ప్రసిద్ధి చెందారు.

అత్యద్భుతమైన గణపతి హోమాలకు ప్రసిద్ధి చెందినది సూర్యకాలడి గృహం.
ఈనాటికి  ఈ గృహంలో
వినాయకచవితికి,  యితర
విశిష్టమైన పర్వదినాలలో ఒక
ఏనుగు ముందు 
వినాయకునికి  ప్రత్యక్ష హోమాలు జరుపుతారు.

ఈ కుటుంబంలో జన్మించిన నంబూద్రి ఒకరికి  ఒక  పెద్ద కొబ్బరి
తోట వుండేది. 
మూత్తచెక్కన్
అనే ఆయన  ఈ కొబ్బరితోపు కి
కాపలాగా వుండేవారు.  మూత్తచెక్కన్
చలికాలంలో  ఎండు కొబ్బరాకుల
మంట వేసుకుని , కిందపడిన
కొబ్బరి కాయలను  ఒలిచి ఆ
కొబ్బరి ముక్కలని  మంటలో
కాల్చుకుని  వాటిని తిని ఆకలి తీర్చుకునేవాడు. 

ఒకనాడు 
మూత్తచెక్కన్
అలా కొబ్బరి తింటుండగా
హఠాత్తుగా అతని వెనుక నుండి  ఒక తొండం మాత్రము
వచ్చి కనపడింది.  అది చూసి మూత్తచెక్కన్ భయపడ్డాడు.
తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ
తొండంలో కొన్ని కొబ్బరి ముక్కలను పెట్టాడు.  మరుక్షణమే అక్కడ ఒక
అందమైన ఏనుగు ప్రత్యక్షమయింది.  మూత్తచెక్కన్ కి
ఆ ఏనుగు అంటే అభిమానం
ఏర్పడినది.

నిత్యమూ ఆ గున్న ఏనుగు  అక్కడికి అలవాటు గా రావడం  ఆరంభించినది.
ఈ విషయం అతనికి తప్ప ఇతరులెవరికి తెలియదు.
ఒకనాడు ఉదయాన 
సూర్యకాలడి గృహ యజమాని యైన  నంబూద్రి తన తోటలో ఒక గున్న ఏనుగు కొబ్బరి ముక్కలు తీసుకొని  తినడం చూశారు.

ఇదొక దైవ ఘటనగా భావించి   మూత్తచెక్కన్ వద్దకు
వెళ్ళి ఏనుగుని తనకి అప్పగించమని అడిగారు.
అందుకు మూత్తచెక్కన్ ఒప్పుకోలేదు.
అతనిని బలవంతపెట్టి చాలా బంగారం, ధనం యిచ్చి అంగీకరింప చేశారు నంబూద్రి. కాని
గున్న ఏనుగు మాత్రం మూత్తచెక్కన్
ని వదలి పెట్టలేదు.

ఆగ్రహించిన నంబూద్రి ఒక తొట్టిలో
మండే  అగ్నిని , కొబ్బరి ముక్కలని  తెచ్చి గున్న ఏనుగుకి చూపించి తన వెంట తీసుకు వెళ్ళాడు.
నంబూద్రి గృహానికి రాగానే వెంట వచ్చిన
గున్న ఏనుగు మహాగణపతి 
గా మారి దర్శనమిచ్చాడు.

నంబూద్రి దేహం  జలదరించినది. భక్తితో నంబూద్రి గణేశుని భక్తితో సాష్టాంగపడ్డాడ
అక్కడే వినాయకునికి
విధివిధానాలతో మంత్ర జపాలతో హోమం
చేసి పూజించారు.

" ఇంక నేను మీ గృహంలో నివసిస్తాను.
నన్ను విధి
విధానంగా పూజించే వారికి
శుభాలను అనుగ్రహిస్తాను" అని గణపతి అంతర్ధనమైనాడు గణపతి.

నంబూద్రి మహాగణపతిని అక్కడే ప్రతిష్టించి , నిత్యం
విధివిధానంగా  హోమాలు చేసి,  మహాగణపతి అనుగ్రహానికి పాత్రులైనాడు.
మహాగణపతి అనుగ్రహంతో
సూర్యకాలడి గృహంలో
అద్భుతాలు జరగడం ఆరంభించాయి.
మహాగణపతి అనుగ్రహంతో
సూర్యకాలడి ఇంటి కీర్తి
దశదిశలా వ్యాపించింది. 
ఇది చూసిన ఇతర నంబూద్రిలకు అసూయ కలిగినది. ఒకసారి తిరువిదాంకూర్ మహారాజు
కుమార నల్లూరు భగవతిని
దర్శించడానికి వచ్చారు.

సూర్య కాలడి కుటుంబంలోని వారిని హింస పెట్టడానికి
యిదే మంచి సమయం అని ఇతర అసూయాగ్రస్థులు భావించారు. వెంటనే వారు మహారాజు వద్దకు వెళ్ళి, 
మహారాజా..మీరు మీ పరివారం
సూర్యకాలడి గృహానికి
నేడు భోజనానికి వెళ్ళి మమ్మల్ని సంతోషపర్చాలి"అని కోరారు.
మహారాజుకి, వారి సకల  పరివారానికి  సకల మర్యాదలతో విందు  చేయడం 
సామాన్యమా .. ఈ గండం నుండి బయటపడేదెలాగో తెలియక సూర్యకాలడి
కుటుంబం తల్లడిల్లిపోయారు.  మహారాజు
కోపానికి గురి చేయాలన్నదే
ఇతర నంబూద్రీల  ప్రణాళిక.
ఈ కుట్ర తెలియని మహారాజు
వారి కోరికను మన్నించి  మరునాడు సూర్యకాలడి
గృహానికి వస్తామని కబురంపారు.
సూర్యకాలడి గృహం వారు దిగ్భ్రాంతి చెందారు.

దిక్కులేనివారికి దేవుడే 
దిక్కు. మరునాడు ఉదయం గణపతి హోమం సంపూర్ణమైన పిదప  తమ కష్టాన్ని వినాయకునికి విన్నవించుకున్నారు.

కేరళలో పడవలు వెళ్ళి , వచ్చే జలమార్గాలు ఎక్కువ . అప్పుడు  ఒక పడవ అక్కడికి వచ్చి ఆగింది. ఆ పడవలో చిత్త చాంచల్యంతో బాధపడే తమ పుత్రునితో ఒక ధనిక కుటుంబం
వారు వచ్చారు.
పుత్రుని వైద్యానికి,  పరిహార పూజలకి
కొన్ని రోజులు పట్టవచ్చని  తమతో కూడా కొన్ని మాసాలకి సరిపడే
ఆహారాన్ని, ధాన్యాలను
వారు  వెంట తెచ్చారు.

వారి పుత్రుని సమస్య తెలుసుకున్న సూర్యకాలడి గృహ  నంబూద్రి  మహాగణపతి నివేదనకి  పెట్టిన  అరటిపండును వారి పుత్రునికి యిచ్చాడు.
 తన భక్తుని ఎడల కరుణతో మహాగణపతి తన మహిమని
చూపించాడు. పండు తిన్న
ఆ ధనిక పుత్రుని  చిత్తభ్రమ  సంపూర్ణంగా నయమైనది.
ఆనందంలో  పరవశించిన
పిల్లవాని కుటుంబం వారు తాము తెచ్చిన సామాగ్రి
అంతా సూర్యకాలడి గృహం వారికి సమర్పించి వెళ్ళి పోయారు. ఆ సామాగ్రితో 
మహారాజుకి , వారి పరివారానికి , అద్భుతమైన
విందు యిచ్చారు సూర్యకాలడి గృహం వారు.

తరువాత జరిగినదంతా
తెలుసుకున్న మహారాజు
ఆ గృహం వారికి అనేక
కానుకలను యిచ్చి, 
వారి సుఖ జీవితానికి కావలసిన  ఏర్పాట్లు చేశారు. ఇలాటి
అద్భుతాలు ఎన్నో సూర్య కాలడి నంబూద్రి గృహంలో గణపతి దయతో జరిగాయి...సేకరణ.

No comments: