Adsense

Sunday, November 28, 2021

ఆలయంలో ప్రదక్షిణాలు.ఎలా చేయాలి?

 



హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. సహజంగా మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గుడి యొక్క గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షణము అంటారు. 

దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తున్నాయి.

ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది...

‘ప్ర' అనగా పాప నాశనమని,
‘ద' అనగా కోరికలను నెరవేర్చుట అని,
‘క్ష' అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని
‘ణ' అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం.

ప్రదక్షిణము ఎందుకు చేస్తాము.

ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.

 ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకే లాగా ప్రవహిస్తూ ఉంటుంది.

ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది...

ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదతను తెలుపుతుంది.

 అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం.

ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము. భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి. మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.

అయితే... వివిధ దేవుళ్ళకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో పెద్దలు నిర్దేశించారు. వాటిలో...

1. విఘ్నేశ్వరునికి - ఒకసారి,
2. సూర్యునికి - రెండుసార్లు,
3. మహాశివునికి - మూడుసార్లు,
4. విష్ణుమూర్తికి - నాలుగుసార్లు,
5. రావిచెట్టుకు - ఏడుసార్లు..

చొప్పున ప్రదక్షిణ చేయడం ఒక పద్ధతి. మొత్తానికి ఏ దేవుని ప్రార్థిస్తూ ఉంటే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి.

 సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.

"యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి

 ప్రదక్షిణ"... పదే పదే ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక.. అని. 

సాధారణంగా ప్రదక్షిణలు దేవాలయంలో ధ్వజ స్తంభం వద్ద ప్రారంభించి తిరిగి అక్కడికి చేరుకొని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణగా పరిగణిస్తారు. అయితే.. ఇలా కనీసం మూడు ప్రదక్షిణలు చేయాలి. వేదాంత పరంగా మొదటి ప్రదక్షిణలో మనషులు తమలోని తమోగుణాన్ని వదిలివేయాలి. రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలి వేయాలి మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలి వేయాలి.

తర్వాత దేవాయలంలోకి వెళ్లి త్రిగుణాతీతుడైన ఆ పరమేశ్వరుడను దర్శించుకోవాలి అనేది అసలు పరమార్థం. దేవుని దేహమే దేవాలయంగా మనలోని షట్‌చక్రాలను దాటి హృదయంలోని దేవుడ్ని దర్శించాలనేది కాలాంతరంలో సాధించాలనేది వేదాంత పరమార్థం. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయడం తప్పనిసరి.

ఇక ప్రదక్షిణం చేసేవారి జాతక/గోచార పరంగా ఆయా గ్రహాల స్థితిని బట్టి 3, 9, 11, 21, 27, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయాలి.

శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వర ప్రదక్షిణ చేయాలి.

ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్పా.. కోరిక లేదా ఇతరత్రా విషయాలపై ఉండకూడదు.
సాధరణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి.  వేగంగా, పరుగు పరుగున ప్రదక్షిణ చేయకూడదు. చాలా నెమ్మదిగా దైవనామ/ఓం కారం లేదా ఆయా దేవాలయంలో ఉన్న

మూల విరాట్ నామ స్మరణతో (మనసులో) పక్కవారిని తాకకుండా, వేరే ముచ్చట్లు పెట్టకుండా ప్రదక్షిణలు చేయాలి.

 ఓం నమః శివాయ

No comments: