పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.
జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి, పితృ తర్పణం గావిస్తే వారి పితరులు 21తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్దించగలని పురాణ కథనాలు.
గౌతముడు కొనితెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థలాలలో సంగిమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితయై గోదావరి యగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగుతున్నాయి.
తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం/తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. రేవా నది అనగా నర్మదానదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలు కాగా, గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి.
కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని ‘సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర’ లేదా ‘సప్త సాగర యాత్ర’ అంటారు. సంతానం, తదితర కోరికలు ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్దంగా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది.
ఏడు తావులు చూసుకుని, ప్రాయకంగా మాఘ శుక్ల ఏకాదశి నాటికి వశిష్టా సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరతారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా పరిగణింప బడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మహత్తుగల చొల్లంగికి ప్రసిద్ధి, తుల్యభాగ వల్ల కలుగుతున్నది.
‘‘మహోదయ నామాలభ్య యోగ పుణ్యకాల: అమావాస్యా సోమ వాసర వ్రతమత: పద్మయోగ పుణ్యకాల’’మని పేర్కొనబడింది. రవి శ్రవణ వ్యతీపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము, పద్మయోగ పుణ్యకాలము కలుగుతుంది. పుష్య కృష్ణ అమావాస్య ప్రస్తుతం శుక్రవారం వస్తున్నందున మహోదయ పర్వకాలంగా, పుణ్యప్రదమైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించు కోవాలని శాస్త్ర వచనాలు.
🪴🌼🪴🌼🪴🌼🪴🌼🪴🌼🪴
చొల్లంగి అమావాస్య ప్రాముఖ్యత
పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య గా జరుపుకుంటారు.
దీనికి కారణం ఏమిటంటే చొల్లంగి గ్రామంలో గోదావరి నది ఏడుపాయలలో ఒక్కటైన తులాభాగ సముద్రంలో కలుస్తుంది.
తులాభాగ మహర్షి తీసుకువచ్చిన ఈ పాయ సముద్రంలో కలిసిన రోజు పుష్య అమావాస్య. అందుకే ఈ పరమపవిత్రమైన ఈ రోజున ఆ సంగమ ప్రాంతమైన చొల్లంగిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆ పరమశివుని దర్శిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని భక్తజనం విశేషంగా విశ్వసిస్తారు. సప్తసాగర యాత్ర చేసేవారు కూడా చొల్లంగి అమావాస్య నుంచి తమ యాత్ర ప్రారంభిస్తారు. ఈ రోజున చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు.
ఇదే విధంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున గోదావరి ఏడుపాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తారు. మరో పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద సముద్ర స్నానం చేస్తారు. అంటే మాఘపౌర్ణమికి వచ్చే అంతర్వేది తీర్థానికి 15 రోజుల ముందే చొల్లంగి తీర్థం జరుగుతుంది.
చొల్లంగి అమావాస్య పురాణకథనం
బంగారులేడి రూపంలో మారీచుని తరుముకుంటూ వచ్చిన శ్రీ రామచంద్రమూర్తి వేసిన బాణం మారీచుడికి తగిలింది. వాడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో రాముడు బాణం రెండింటికి మధ్య చొల్లంగిలో పడిందని పురాణకథనం.
అంతేకాక
ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడని మరో పురాణకథ. చొల్లంగిలో వందయేళ్ల క్రితం నిర్మించిన శ్రీబాలా త్రిపురసుందరి దేవి సమేత సంగమేశ్వర దేవస్థానం ఉంది. అన్ని తీర్థాలలోను స్నానం చేసే భక్తులతో చొల్లంగి తీర్థం కళకళలాడుతుంది.
వరిపిండి దీపాలు శ్రేష్టం
కొన్ని ప్రాంతాలలో వారు ఈ అమావాస్య రోజున దేవుని ఎదుట వరిపిండితో చేసిన చలివిడిదీపంలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే కడుపుచలవ అంటారు. పిల్లలు కలుగని వారు ఈ దీపం ఘనమయ్యాక ఆ బొడ్డుని(కాలిన ఒత్తుని) పాలతో కలిపి మింగితే త్వరలోనే మాతృత్వం సిద్దిస్తుందని తరతరాలుగా వస్తున్న నమ్మకం .
No comments:
Post a Comment