*అనగా ఏనుగుల యొక్క రాజును రక్షించిన వాడు అని అర్థం. త్రికూటం అనే అతి విశాలమైన పర్వతం ఉంది.
*దానికి శిఖరాలు మూడు. ఒకటి బంగారు కాంతితో రెండవది ఇనుము కాంతితో మూడవది వెండి కాంతితో ప్రకాశిస్తూ వుంటాయి.
*ఆ కొండపైన అడవి మృగాలతో పాటు ఎన్నో వేల ఏనుగులు కూడ ఉన్నాయి. ఒక గజరాజు, కొన్ని ఆడ ఏనుగులు గుంపులో నుండి చీలిపోయాయి. అవి ఒక చక్కని సరోవరం చూసి సంతోషంతో సరోవరంలో దిగి హాయిగా జలక్రీడలు సాగించాయి.
*గజేంద్రుడు తొండం నిండా నీరు పీల్చి ఆకాశవీధిలోకి చిమ్ముతుంటే ఆ వేగానికి జల చరాలన్నీ పైకి ఎగిరి పోతున్నాయి.
*ఒక్కసారిగా సరోవరం మధ్యలో నుండి ఒక పెద్ద మొసలి వచ్చి గజేంద్రుని కాలు పట్టింది. ఒకదాని నొకటి నడిస్తే సరోవరం అంతా కలియదిరుగుతున్నాయి.
*నీరు నివాస స్థానమైన మొసలికి బలం పెరిగింది. ఏనుగుకు నీరసం వచ్చింది. మొసలి నుండి తప్పించుకోవడం తన వలన కాదని నిశ్చయించుకొన్నది.
*అప్పుడు గజరాజు సర్వశక్తులుడిగి అన్ని ప్రయత్నాలు విరమించి అఖిలలోక రక్షకుడైన నారాయణుని ప్రార్థించే సమయాన, ఆ జగద్రక్షకుడు వైకుంఠంలో కేళీ మందిర సమీపంలో మందార వన మధ్యలోని సరోవర తటాన చంద్రకాంత శిలా వేదికపై హంసతూలికా తల్పంమీద లక్ష్మీదేవితో సరస సల్లాపాలాడుతున్న వాడు, ఆడుతున్నట్లే బయలుదేరాడు. ఎలా బయలు దేరింది...
*మ. సిరికిం జెప్పఁడు; శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁ డే పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో పరి చేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.*
*లక్ష్మీదేవికి జెప్పలేదు, శంఖచక్రాలు ధరించలేదు. పరి వారాన్ని పిలువలేదు. తన వాహనమైన గరుత్మంతుని రమ్మనలేదు. చెవుల మీద చిందర వందరగా పడుతున్న ముంగురులను సవరించలేదు.
*సరస సల్లాపాలాడే వేళ పట్టుకున్న లక్ష్మీదేవి పైట చెంగు కూడ వదలకుండా బయలుదేరాడు.
*ఇంకేముంది.. ఆయన వెను వెంట లక్ష్మీదేవి, ఆవిడతో అంతః పుర పరివారం, వెనుకనే గరుత్మంతుడు, శంఖ చక్ర గదా శార్థాలు, నారదుడు, విశ్వక్సేనుడు, వారితో పాటు నగరంలోని ఆబాల గోపాలం బయలుదేరారు.
*శ్రీహరి సరస్సు వద్దకు వెళ్ళి సుదర్శన చక్రం ప్రయోగించిన వెంటనే అది మొసలి తలను ఖండించింది.
*వెంటనే దేవలుని శాపంవల్ల మకరి జన్మ ఎత్తిన హూ, హూ అనే గంధర్వుడు, శ్రీమన్నారాయణుని వలన శాపవిముక్తుడై గంధర్వరూపంలో వెళ్ళిపోయాడు.
*నారాయణుడు గజేంద్రుని తన కరస్పర్శతో అనుగ్రహించాడు.
*ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్యమహర్షి ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మనెత్తి ఈ విధంగా శాపవిముక్తుడై, వైకుంఠం చేరాడు.
*ప. గజరాజ మోక్షణమును నిజముగ పఠియించునట్టి నియతాత్ములకున్, గజరాజ వరదుడిచ్చును.*
*గజ, తురగ, స్యందనములు, కైవల్యంబున్.*
*కనుక గజరాజ రక్షకుడైన శ్రీమన్నారాయణుడు మనలను సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక.
No comments:
Post a Comment