Adsense

Wednesday, February 23, 2022

నేడు శబరి జయంతి...!!మాఘ బహుళ సప్తమి శబరి జయంతి...

 నేడు శబరి జయంతి...!!
మాఘ బహుళ సప్తమి శబరి జయంతి...
భౌగోళికంగా శబరి అంటే గోదావరికి ఉపనది. 

గోవును బతికించిన గోదా నదిలో శబరి చేరికతో గోదాశబరి అయిందని వాడుక.

 ఆధ్యాత్మికంగా మాత్రం శబరి అంటే మనకు అనన్య సామాన్య శ్రీరామ భక్తురాలిగా సుపరిచితం.

రామాయణంలోని శబరి పాత్ర చిన్నదే అయినా చాలా ప్రముఖ్యత కలిగినది. ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా ఎంతో ప్రాచుర్యం పొందింది.

 శబరి ఒక గిరిజన మహిళ. ఆమె మాతంగ మునిని గురువుగా భావించుకొని సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. 

మునులు చెప్పిన విషయాలను నేర్చుకుంటూ భక్తిభావంలో జీవిస్తూవుంది. శబరి చిన్నప్పటి నుండి పంపానది సమీపంలో ఉండే మతంగ ముని ఆశ్రమంలోనే ఉండేది. 

ఆ ఆశ్రమం తప్ప ఆమెకు మరో లోకం తెలియదు. శ్రీరాముడి గురించి ఆశ్రమంలో మాట్లాడుకుంటుంటే విని రాముని గొప్పతనం గురించి తెలుసుకుంది.

 అతనిపై భక్తిని పెంచుకుంది. ఆ భక్తి రాను రాను ఆమెలో పెరిగిపోయింది. ఎప్పటికైనా శ్రీరామచంద్రుని చూసి తరించాలని తపన పడుతూవుంది.

రాముడు అరణ్యవాసానికి వచ్చిన విషయం మాతంగముని శిష్యులు శబరికి చెబుతారు. 

అప్పటినుండి శబరి రాముడి రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతోంది. జీవితంలో ఒక్కసారి రాముడ్ని చూసి చనిపోతే చాలు జన్మ ధన్యమవుతుందని అనుకుంది శబరి.

తన గురువు అయిన మాతంగ ముని వృద్ధుడయిపోయి తనువుచాలించాడు. ఎప్పటికైనా రాముడు వస్తాడు అక్కడే ఉండమని గురువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ రోజూ రామనామ జపం చేస్తూ రాముడి కోసం వేచి చూసింది.

 వయస్సు పైబడిపోయింది. ఒంట్లో సత్తువ తగ్గింది. అయినా రామనామాన్ని ఆమె ఆపలేదు.

 రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువ ఝామునే లేచి ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేసేది.

 అలికి ముగ్గులతో అలంకరించేది. నదిలో స్నానం చేసి రాముని పాదాలు కడగడానికి కడవతో నీళ్ళు తెచ్చేది. పాదపూజ కోసం పూలు , రాముడు ఆరగించడానికి పళ్లూ తెచ్చేది. 

ఇలా ప్రతి రోజు చేస్తూనే ఉండేది. ప్రతిరోజూ రాముడొస్తున్నట్లు ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే గడిపింది. 

అలా శబరి రాముడి కోసం దాదాపు పదమూడేళ్ల పాటు ఎదురు చూస్తుంది.

కబంధుడి ద్వారా రాముడికి శబరి గురించి తెలిసింది. తన భక్తురాలిని చూడాలని బయల్దేరాడు. 

ఆశ్రమానికి వచ్చిన శ్రీరామచంద్రమూర్తిని చూసిన శబరి సంతోషానికి అవధులు లేవు.

 తన ఆశ్రమానికి వచ్చిన స్వామికి శబరి ఎంతగానో సేవలు చేసింది. రాముడి దారిలో పూలు పరుస్తుంది. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటుంది. 

పూలతో పాద సేవ చేసుకుంటుంది. పళ్లను రుచి చూసి రామునికిచ్చింది. ఆ పళ్లను రాముడు ప్రేమగా సేవించాడు.

ఇది అందరికీ తెలిసిన కథ. వాల్మీకి రామాయణంలో శబరి ఎంగిలి పళ్లను రాముడు తిన్నట్లు రాయలేదని అనేకమంది పండితుల భావిస్తున్నారు.

 ఒక్కో చెట్టు పళ్లు ఎలా ఉన్నాయో రుచి చూసి పుల్లగా లేని , మధురంగా ఉన్న చెట్ల పళ్లనే రామునికిచ్చింది. గానీ , ఎంగిలి పళ్లు కాదని పురాణ కథనం.

 కానీ రాముడు ఎంగిలి పళ్లు తిన్నట్లుగానే జానపదులు ఇప్పటికీ అనుకోవడం , సినిమాల్లో , టి.విల్లో కూడా ఆ విధంగానే చిత్రీకరించడం వలన ఎంగిలి పళ్ల విషయం మిక్కిలిగా ప్రచారం అయింది.

ఎంతో భక్తి శ్రద్ధలతో రాముని సేవించిన శబరికి చివరికి రాముని అనుగ్రహం లభించింది. రాముని అనుమతితో యోగాగ్నిలో ప్రవేశించి ముక్తి పొందిన శబరి అందరి గుండెల్లో గూడు కట్టుకొని ఉండిపోయింది...జై శ్రీరామ్... స్వస్తి.

No comments: