Adsense

Saturday, February 12, 2022

భీష్మ ఏకాదశి విశిష్టత

నేడు భీష్మ ఏకాదశి ...!!
  
      🌹భీష్మ ఏకాదశి విశిష్టత 🌹
భీష్ముడు మోక్షం పొందిన రోజు...  
              మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. 
ఈ రోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. 

భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు...

*భీష్ముని జననం*

 గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది... అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు, జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది, అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు...

అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు...

అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. 
అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. 

ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది... సత్యాన్ని అది ధరించి ఉంటుంది...

భారత యుద్ధంలో 11 రోజుల తర్వాత భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణిచూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు... 

ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు  స్తుతిస్తాడు...
శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట...

భీష్ముడి ప్రత్యేకతలు :

అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర, శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. 
చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే, తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. 

యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి, కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. 
కాని, భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారే మో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. 

తన తమ్ములు చనిపోయిన తర్వాత గూడా, తన భీష్మ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు...

🌹శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు🌹

శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్దిమందిలో భీష్ముడు ముఖ్యుడు. 

తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు...
 భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. 

అష్టమనువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు... భీష్మాచార్యుడు... 

కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. 
తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు.


*58 రోజులు అంపశయ్యపై*
58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు...

అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. 

అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. 
అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. 

ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం...
మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు...
మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది...
భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని "భీష్మ ఏకాదశి", "మహాఫల ఏకాదశి", "జయ ఏకాదశి" అని అంటారు.

*విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా!!!*
విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి...

ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. 
అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని చెబుతారు...

భోగభాగ్యాలు కలుగుతాయని, సర్వ పాపాలూ హరిస్తాయని, పుణ్యగతులు లభిస్తాయని, అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారుకూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది...
ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోయిన వారు ... శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకాన్ని ఈరోజంతా ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని వివరించాడు.. శుభమస్తు
    🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


No comments: