Adsense

Wednesday, February 16, 2022

మేడారం జాతర ప్రారంభం....!! Medaram fair begins .... !!



      🙏సమ్మక్క సారలమ్మ జాతర🙏

🌹ఫిబ్రవరి 16 బుధవారం నుండి 19 శనివారం వరకు🌹

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో అత్యంత భారీగా నిర్వహించే ఈ జాతర ఈ నెల 16 నుండి 19 వరకు జరుగుతుంది.

 తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ మాఘమాసంలో నాలుగు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. 

 నాలుగురోజుల పాటు జరిగే ఈ జాతరలో ఈ నెల 16వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుండి గద్దెపైకి వస్తుంది. ఇక 17న చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి విచ్చేస్తుంది. భక్తులకు 18న అమ్మవార్లు దర్శనమిస్తారు. చివరి రోజు 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

సమ్మక్క సారక్క జాతర ములుగు సమీపంలోని తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరుగుతుంది.

 ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాది మంది హాజరై వన దేవతలను దర్శించుకుంటారు.

గిరిజనులందరి ఆరాధ్య దేవతలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, కష్టాలు తీర్చే దైవాలుగా వాసికెక్కారు సమ్మక్క, సారలమ్మలు. తెలంగాణలోనే గాక, భారత దేశంలోని అనేకమంది ప్రజలతో పూజలందుకుంటున్నారు.

 ఈ మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. అనేక రాష్ట్రాలనుండి తండోపతండాలుగా తరలి వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు.

పదమూడవ శతాబ్దంలో నేటి జగిత్యాల మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు.

 ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. 

ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారంను పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. 

కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజు పై దండెత్తుతాడు.

పగిడిద్దరాజు,సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి వీరోచితంగా పోరాటం చేస్తారు. 

కాని అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. 

అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కుంటుంది.

 వీరోచితంగా పోరాటం సాగిస్తూ, ఎంత నైపుణ్యంగా యుద్ధం చేస్తున్నప్పటికి చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్నది సమ్మక్క. ఆ రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుండి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. 

సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు. 

ఇక్కడ బెల్లంను బంగారంగా వ్యవహరిస్తారు. గిరిజనలే కాకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ జాతర మహోత్సవంలో పాల్గొంటారు.

సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు, ఏటేట జనం పెరుగుతుండడంతో ఆ జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. 

అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేశారు. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో సామాన్యులే కాకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాలకులు కూడా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుంటారు.

No comments: