Adsense

Wednesday, February 9, 2022

ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు అంతర్వేది నారసింహుడి తిరు కల్యాణోత్సవాలు ప్రారంభం..!!

 

ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి(,రథసప్తమి) నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మ , విష్ణు , మహేశ్వర సమన్వయమైన భగవత్‌ చైతన్య స్వరూపం నృసింహస్వామి. 

కేవలం దుష్టశిక్షణ , శిష్ట రక్షణ కోసమే కాక , తన సర్వాంతర్యామి తత్త్వాన్ని ప్రకటించడానికి పరమాత్మ నరసింహావతారాన్ని ధరించాడు.

 గర్భవాసం లేకుండా శ్రీహరి దాల్చిన అవతార పరంపరలో నృసింహరూపం విశేషమైనది. మృగమూ కాకుండా మనిషీ కాకుండా నరజంతు సమ్మేళనరూపంలో స్వామి ఆవిర్భవించాడు.

 *‘న మృగం...న మానుషం’* - అని వ్యాస వచనం. *‘నరసింహం’* అని చెబుతున్నా *‘రెండూ కాదు’* అని పేర్కొనడమంటే , ద్వంద్వాత్మక జగమంతా పరబ్రహ్మ స్వరూపం అని వెల్లడించడానికే ! వ్యక్తమైన మరుక్షణమే దనుజ సంహారాన్ని జయప్రదంగా నిర్వహించి , ప్రహ్లాదుడి పట్ల భక్తవాత్సల్యమూర్తిగా నృసింహుడు ప్రకటితమయ్యాడు.

 హిరణ్యకశిపుడి వధ అనంతరం అతడి కుమారుడైన రక్తలోచనుణ్ని నృసింహుడు వధించాడంటారు.

 ఆ వృత్తాంతంతో ముడివడిన గోదావరి తీరంలో ఉన్న పవిత్ర సన్నిధి - అంతర్వేది క్షేత్రం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది దివ్య క్షేత్రంలో రాజ్యలక్ష్మీ సమేతంగా సోదరి అశ్వరూఢాంబిక (గుర్రాలక్క) సహితంగా నృసింహస్వామి వర్ధిల్లుతున్నాడు. 

ఏడుపాయలుగా చీలిన గోదావరిలో , వసిష్ఠ గోదావరి వద్ద త్రికోణాకార లంకలో అంతర్వేది నెలకొని ఉంటుంది. ఇక్కడే గోదావరి , బంగాళాఖాతంలో సమ్మిళితమవుతోంది.

 నృసింహుడి సోదరిగా భావించే గుర్రాలక్కతో స్వామి ఇక్కడ విలసిల్లడంతో ఈ ప్రదేశాన్ని *‘అన్నా చెల్లెళ్ల గోదారి గట్టు’ గా వ్యవహరిస్తారు. ఎంతో పౌరాణిక నేపథ్యం ఉన్న అంతర్వేది క్షేత్రం - త్రిమూర్త్యాత్మక సన్నిధానం. సృష్టి నిర్మాణానికి సంబంధించి దీక్షాదక్షతలు సిద్ధింపజేసుకునేందుకు బ్రహ్మ గౌతమీనదీ తీరంలో మహా రుద్రయాగాన్ని నిర్వహించాడంటారు. 

ఆ సందర్భంలోనే పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామి లింగాకృతిని ఇక్కడ ప్రతిష్ఠాపన చేశాడనేది పురాణ కథనం. సృష్టి రచనా దక్షత , అంతర్వీక్షణ , తన మనోసంకల్ప సిద్ధికోసం బ్రహ్మ నిర్వహించిన రుద్రయాగ వేదిక కాబట్టి ఈ పవిత్ర స్థలానికి *‘అంతర్వేదిక’* అనే పేరు ఏర్పడింది. 

కాలక్రమంలో *‘అంతర్వేది’గా* స్థిరపడింది.
వసిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతంగా సాగర సంగమ స్థలి అయిన అంతర్వేదిని ప్రస్తావిస్తారు. హిరణ్యకశిపుడి వారసుడిగా రక్తలోచనుడు లోకకంటకుడిగా ప్రజల్ని బాధించసాగాడు.

 బ్రహ్మ నుంచి పొందిన వరం వల్ల , ఆ అసురుడి శరీరం నుంచి రక్త బిందువులు నేలపై పడితే , అనేకమంది రక్తలోచనులు ఆవిర్భవిస్తారు. ఆ వర బలగర్వితుడై    దురహంకారంతో రక్తలోచనుడు ప్రవర్తించసాగాడు. నృసింహుడిగా అవతరించిన శ్రీహరి - రక్తలోచనుడి ఉదరాన్ని చీల్చి , అతడి రుధిరం నేలపై పడకుండా *‘రక్తకుల్య’* అనే జలవాహినిలోకి ప్రవహింపజేసి వధించాడనేది పురాణగాథ.

 వసిష్ఠ మహర్షి అభీష్టంమేరకు నృసింహుడు అర్చామూర్తిగా వెలశాడంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు , ద్వాపరయుగంలో అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. పల్లవుల కాలంలో నిర్మితమైన స్వామివారి ఆలయం శిథిలమైతే , పెద్దాపురం సంస్థానాధీశులైన కొపనాతి వంశీయులు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 

చేమకూర వేంకటకవి విజయవిలాసంలో శ్రీనాథుడి హరవిలాసంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.
రథసప్తమి నుంచి స్వామికి బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభమవుతుంది. అంతర్వేది నృసింహుణ్ని ఆరోగ్య భాగ్య ప్రదాతగా భక్తులు భావిస్తారు.

 మాఘశుద్ధ దశమినాడు కల్యాణోత్సవం , ఏకాదశినాడు రథోత్సవాన్ని నిర్వహిస్తారు. కోరిన అభీష్టాల్ని నెరవేర్చే పెన్నిధి కోనసీమలో వెలసిన కోటివరాల వేలుపు అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి సన్నిధి.

No comments: