💠 హైదరాబాద్ లో సందర్శించాల్సిన టాప్ 10 పర్యాటక ప్రదేశాలలో బిర్లా మందిర్ ఒకటి .
హైదరాబాద్ వాసులను, నగరాన్ని సందర్శించేవారిని ఆకర్షిసున్న ఆలయం బిర్లా శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని సాధారణంగా బిర్లా మందిర్ అని పిలుస్తారు. దీనికి కారణం బిర్లా సంస్థ చాలా చోట్ల ఆలయాలను నిర్మించింది. వాటన్నిటినీ బిర్లా మందిర్ అనే పిలుస్తుంటారు.
💠 హైదరాబాదులో రవీంద్రభారతి సమీపాన లకడీ కా పూల్ బస్టాండ్ వద్ద చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి.
ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడింది.
💠 నగరంలో హుసేన్ సాగర్ సమీపంలో 280 అడుగుల ఎత్తు కలిగిన నౌబత్ పహాడ్ కొండపై బిర్లా సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఆలయ నిర్మాణానికి ఒక దశాబ్దం కాలం పట్టింది. 1976లో విగ్రహ ప్రతిష్ట జరిగింది.
💠 బిర్లా ఆలయం యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారత శైలల్లో ఉంటుంది. గర్భగుడి పైన నిర్మించిన జగదానంద విమానం ఒరియా శైలిని పోలి ఉంటుంది.
💠 గర్భగుడిలో ఉండే స్వామివారు తిరుపతి లోని శ్రీనివాసుడిని పోలి ఉంటారు. శ్రీ వెంకటేశ్వర విగ్రహం సుమారు 11 అడుగుల ఎత్తులో చెక్కిన తామర పందిరితో ఉంటుంది. ఈ విగ్రహాన్ని గ్రానైట్ రాయితో చెక్కారు. విగ్రహం ఒరియా శైలిలో చెక్కబడింది.
💠 ఈ ఆలయాన్ని 1976 లో రామకృష్ణ ఆశ్రమానికి చెందిన స్వామి రంగనాథనంద రూపొందించినట్లు చెబుతారు. స్వామి రంగనాథనంద ఈ ఆలయాన్ని ధ్యానానికి కూడా అనువైన ప్రదేశంగా చేశారు.
💠 ఇక్కడ రామాయణం మరియు మహాభారతం యొక్క పురాణాల దృశ్యాలు ఆలయ గోడలు మరియు పైకప్పులపై చెక్కబడి ఉన్నాయి. హిందూ పురాణాలకు చెందిన దేవతల విగ్రహాలను ప్రవేశ ద్వారం నుంచి ఆలయ గర్భగుడి వరకు చూడవచ్చు.
ఆలయ సముదాయం లోపల బుద్ధుని ఆలయం ఉంది, ఇది అతని జీవితాన్ని మరియు రచనలను చిత్రించే చిత్రాలతో అలంకరించబడింది.
💠 ఈ గుడిలో ప్రశాంతతకి భంగంకలగ కూడదని గంటలు కూడా ఉండవు. మూల విరాట్ వెంకటేశ్వర స్వామి తో పాటు ఇంకా ఇతర దేవుళ్ళు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడి గోడలపై గురు గోబింద్ సింగ్ వంటి మహనీయుల పవిత్రమైన బోధనలు గమనించవచ్చు
💠 ఈ గుడిలో శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సాయిబాబా, శక్తి, లక్ష్మి ఇంకా సరస్వతిలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో కాసేపు గడిపితే ఎటువంటి మానసిక పరిస్థితి ఉన్నా మనసు ప్రశాంతత చేకూరుతుంది.
💠 ఆలయ ప్రత్యేకతలు
-------------------------
• ఈ మందిరము హైదరాబాద్ నడి మధ్య ఉంది.
• కొండ పై భాగమునే కార్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
• దేవాలయమునకు ప్రక్కన బిర్లా సైన్స్ సిటీ, ప్లానిటోరియం ఉన్నాయి..
• పార్కింగ్ వద్ద నుంచి దేవాలయము మొత్తము మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడింది.
• మందిర పై భాగము నుండి చూస్తే దగ్గరగా హుస్సేన్ సాగర్, బుద్దవిగ్రహము, అసెంబ్లీ, రవీంద్రభారతి, లాల్ బహుదూర్ స్టేడియం, లుంబిని పార్క్ లాంటివి అందముగా కనిపిస్తుంటాయి.
💠 ఆలయ దిగువన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో వివిధ రకముల వస్తువులు, అందమైన స్వామి చిత్ర పటములు, రాళ్ళతో పొదిగినవి విక్రయిస్తారు. సాయం సంధ్యా సమయములో బిర్లా మందిర్ ప్రాంతంలోని వాతావరణం ఆస్వాదించాలే గాని వర్ణించడం అసాధ్యం.
💠 ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 2 నుంచి 9 గంటల వరకు బిర్లా మందిరాన్ని సందర్శించవచ్చు.
ఇతర పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి. బిర్లా ప్లానిటోరియం , ప్రయోగశాల మరియు బిర్లా సైన్స్ మ్యూజియం చాలా దగ్గరలోనే ఉన్నాయి.
💠 హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్లు, హైదరాబాద్ బస్ టెర్మినల్ నుండి 6 కిలోమీటర్లు మరియు బేగంపేట విమానాశ్రయం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ ఆలయాన్ని హైదరాబాద్ నగరం నుంచి సులభంగా చేరుకోవచ్చు.
No comments:
Post a Comment