Adsense

Wednesday, June 15, 2022

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం : కోరుకొండ (తూర్పుగోదావరి)


💠 ఈ క్షేత్రం క్రీ.శ 1303 నాటిదని అప్పటి శాసనాలలో స్పష్టంగా ఉంది. 
ఈ క్షేత్రం పేరు తెలుగు భాషలో 'కోరు' అంటే కోరిక మరియు 'కొండ' అంటే పర్వతం అనే పదాల నుండి ఉద్భవించింది కనుక దీనిని కోరదగిన పర్వతం లేదా దేవుడు తన భక్తుల విన్నపాలను తక్షణమే విని వారి కోరికలను తీర్చే పుణ్యక్షేత్రం అని, కోరిన వరాలు ఇచ్చే స్వామి వెలసిన కొండ కనుక " కోరుకొండ " అని పేరు వచ్చింది. 

💠 మహాకవి శ్రీశ్రీనాథుడు తన కవిత్వంలో ఈ కోరుకొండ "వేదాద్రి" అని భగవంతుడిని ప్రార్థించాడు. 

💠 పరాశర మహర్షి తపస్సు వలన ఈ శిఖరానికి " పరాశర శైలం " అని ,
" పరాశర గిరి"  అని పేర్లు కూడా ఉన్నాయి. 
పరాశరమహర్షి తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు స్వామి లక్ష్మీదేవి సమేతంగ శ్రీ లక్ష్మీ నరసింహునిగా ఇక్కడ వెలిసారు. 
కొండపైన స్వామి స్వయంభూ కాగా కొండ దిగువన ఉన్న స్వామివారిని పరాశర మహర్షి ప్రతిష్టించారు. 

💠 ఈ కొండకు పారిజాతగిరి, కోనగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి.

💠 కోరుకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మి నారసింహ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందిన వైష్ణవ క్షేత్రం  . 
ఈ ఆలయం రాజమండ్రి  20 కి.మీ, కాకినాడ 60 కి.మీ.

💠 ఇక్కడ నరసింహ స్వామి అత్యంత ప్రశాంతమైన  విగ్రహం.
 ఈ క్షేత్రంలో ఆయన ఎల్లప్పుడూ తన భార్య అయిన లక్ష్మీదేవితో కలిసి ఉంటాడు కాబట్టి 'సాత్విక నరసింహ' అనే పదంతో  పిలవబడుతున్నారు.

💠 ఇక్కడి పుష్కరిణిని  స్వామి తీర్థం అని పిలుస్తారు.
అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి.

 💠 ఒకే ప్రదేశంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. 
ఆలయ విగ్రహాలలో స్వయంబు ఒకటి మరియు మరొక ఆలయ విగ్రహం స్థాపించబడింది.

💠 శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలసి బక్తులు కోరికలు నేరవేరుస్తున్నాడు . 
14 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్బుతమైన శిల్పకళతో ఉంటుంది.
 
💠 ఇక్కడ ప్రత్యేకత  ఏంటంటే కొండ పై ఉన్న దేవాలయాన్ని చేరుకోవడానికి సుమారు 615 మెట్లు ఎక్కాలి ప్రతిమెట్టు లంబకోణ ఆకృతిలో ఉండటం వల్ల, కొండ  వాలు తక్కువగా ఉండటం వల్ల పైకి ఎక్కడం కొంచం కష్టతరమే.

💠 ఈ ఆలయం ద్వాపర యుగం నాటిదని చరిత్ర మనకి చెబుతోంది.
 ప్రస్తుతం ఆలయ పాలన వ్యవహారాలను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పర్యవేక్షిస్తుంది.

🔅 చారిత్రక నేపథ్యం 🔅

💠 మంచి కొండ రెడ్డిరాజులు క్రీ.శ. 1325, 1395 మధ్య కోరుకొండను రాజధానిగా చేసుకుని 70ఏళ్లు పరిపాలించారు.
 కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంగా దీనిని తీర్చిదిద్దారు. 

💠 1340, 1370 మధ్య రాజైన ముమ్మిడి నాయకుడు శ్రీరంగంలోని వైష్టవ గురువుల శిష్యరకం చేసి, శ్రీరంగం నుంచి పరాసర బట్టర్‌ వంశీకులను కోరుకొండకు రప్పించి స్వామివారికి ధర్మకర్తగా నియమించారు.

 🔅 ఆలయ నిర్మాణం 🔅

💠ముమ్మిడి నాయకుడు భార్య లక్ష్మీదాసి గొప్పవైష్టవ భక్తురాలు. ఆమె కీ.శ. 1353లో కొండపైన దేవాలయ నిర్మాణం, జీర్ణోద్దరణ చేసినట్లు శిలాశాసనాలు ఉన్నాయి. 
కొండపైన సుమారు 10 సెంట్లు వైశాల్యం గల కొండ శిఖరం మీద ఈ దేవాలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. 
కొండదిగువన మరొక పెద్దదేవాలయాన్ని నిర్మించి కొండ ఎక్కలేని భక్తుల కోసం స్వామివారిని ప్రతిష్టించారు.

💠 కోరుకొండ కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కృతయుగంలోనే స్వయంవ్యక్త స్వయంభూగా ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతుంది.

💠 లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వయంభూ విగ్రహం 9అంగుళాల ఎత్తులో కోరుకొండ కొండపై ఉత్తరాభిముఖంగా ఉంది.

💠 స్వామి దర్శనానికి కొండపైకి వెళ్లిన భక్తులకు కర్పూరం వెలుగులో అర్చక స్వాములు స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు. సింహద్వారానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి ఉంది.
ముఖమండపంలో లక్ష్మీదేవి విగ్రహం ఉంది.

💠 ద్వారానికి ఇరువైపులా ముమ్మిడి నాయకుడు అతని భార్యలక్ష్మీదాసి విగ్రహాలు ఉన్నాయి.

💠 కొండపైనా ఆవరణలో వైకుంఠనాధుని ఆలయం ఉంది. అక్కడ 12 మంది అళ్వార్‌ల విగ్రహాలు ప్రతిష్ఠించి వున్నాయి.

💠 ఫాల్గుణ మాసం లో స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది . కృష్ణాష్టమి, ఉగాది,ముక్కోటి ఏకాదశి  మరియు ఇతర ముక్య పండుగలకు ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి.   

💠 వైష్ణవ - వైఘనాస ఆగమ శాస్త్రాల ప్రకారం రోజువారీ ఆచారాలు నిర్వహించబడుతున్నాయి.

💠 ఉభయ గోదావరి జిల్లాలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాలలో తప్పక  దర్శించవల్సిన పుణ్యక్షేత్రాలలో ఒకటి కోరుకొండ.

No comments: