Adsense

Tuesday, June 14, 2022

శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం, బల్కంపేట, హైదరాబాద్


💠 ప్రతి ఊరులోనూ ఎల్లమ్మ,పోచమ్మ,కట్ట మైసమ్మ ఇలా కొన్ని రకాల పేర్లతో అమ్మవారి ఏదో ఒక ఆలయం అనేది తప్పకుండ ఉంటుంది.  అయితే బల్కంపేటలో వెలసిన ఎల్లమ్మ పోచమ్మ ఆలయం ఎలా వెలసింది, ఆ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.

💠 హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే...అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ... ఎల్లమ్మ!
ఇక్కడి అమ్మవారు భక్తుల యొక్క ఎల్లా కోర్కెలు తీర్చే తల్లి కావటం వలన ఎల్లమ్మ తల్లిగా భక్తులు కొలుస్తున్నారు. ఆ జగజ్జనని పాద పద్మములను నమ్మి సేవించనవారి పాప దుఃఖములను పటా పంచలు చేసి శాశ్వతమైన ఆనందాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు.

💠 మంత్రశాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు.
 ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. 
ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో రేణుకా ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. 
ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. 
ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. 
ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వికులు ద్వారా తెలుస్తుంది.

💠 700 సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు, హైదరాబాద్‌ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా...బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూస్తే... అమ్మవారి ఆకృతి! చేతులెత్తి మొక్కాడా రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కాస్తంతైనా కదల్లేదు. వూళ్లొకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలోచేయీ వేశారు. అయినా, లాభంలేకపోయింది. శివసత్తులను పిలిపించారు. శివసత్తులంటే...పరమశివుడి ఆరాధకులు. శైవ సంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యం ఉంది. ‘ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం?’ సలహా ఇచ్చారు శివసత్తులు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించిందీ వీళ్లే. మూలవిరాట్టు బావి లోపల ఉండటంతో ... భక్తజనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే, రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించాయి. ఓ చిన్న ఆలయం వెలసింది. 

💠 ఈ ఆలయంలో మరొక ఆలయం నిర్మించి  అమ్మవారితో పాటు దక్షిణభాగంలో పోచమ్మ తల్లి అమ్మవారిని క్షేత్రపాలకురాలుగా ప్రతిష్టించారు.

💠 అమ్మవారు 10 అడుగుల దిగువన శయనరూపంలో నైసర్గిగా ఆకారంలో తూర్పుమూలముగా చేసి స్వయంభువుగా వెలసియున్నందున పై భాగంలోని మహామండపం నుండి ప్రతినిత్యం అఖండజ్యోతి వెలుగుతూ ఉంటుంది. 
ఈ ఆలయ ప్రాగణంలో గల నాగదేవత ఆలయం పక్కన ప్రస్తుతం భక్తులు బోనాలు సమర్పించుటకు ఈ ఎల్లమ్మ అమ్మవారి రూపుతో ఒక విగ్రహాo  ప్రతిష్టించబడింది.

💠 ఈ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తమ ఆచార సంప్రదాయాల ప్రకారం బోనాలు సమర్పించుకుంటారు. 
తమ కోరికలు నెరవేరిన తరువాత తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో మరల అమ్మవారిని దర్శించి బోజనాది కార్యక్రమాలు నిర్వహించుకొనుట ఒక ఆచారంగా వస్తుంది.

💠 ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారంనాడు బోనాలు మరియు ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి.

💠 ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం వైపు గోపురం నిర్మితమై ఉంది గోపురంపై అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజస్థంభం ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయం చుట్టూ ప్రాకార మండపం ఉంది ఈ మండపంలోని గోడలపై జగన్మాత వివిధ రూపాల్లో ఉన్న తైలవర్ణ చిత్రాలు కనువిందు చేస్తాయి. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు కొలువుదీరాడు. ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే వాళ్ళు ముందుగా వినాయకుని దర్శించుకున్న లోపలికి వెళుతుంటారు. వాస్తవానికి అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా కొలువు తీరింది. అయితే తర్వాతి కాలంలో మూలవిరాట్ను ప్రతిష్టించారు.

💠 అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇచ్చట ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.
ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం.
ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహా తీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచ దుష్టశక్తులు పారిపోతాయని నమ్మకం. నీటిని కాస్తంత తీర్థంలా స్వీకరిస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

No comments: