Adsense

Friday, July 15, 2022

ఖమ్మం జిల్లా : జమలాపురం - శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం



💠 శ్రీరామ చంద్రుడే స్వయంగా తాను కలియుగం ప్రారంభం రోజున వేంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఈ క్షేత్రంలోని వేంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో కలియుగం ప్రారంభం రోజున వెలిశాడు. అందువల్ల ఇక్కడ ఉన్న వేంకటేశ్వరుడి విగ్రహం తిరుమలలోని వేంకటేశ్వరుడి విగ్రహం కంటే పురాతనమైనదని చెబుతారు.
ఈ దైవం కలియుగాంతం వరకూ ఇక్కడే ఉంటుంది అని స్థలపురాణం.

💠 తొలుత ఇది జమలాపురం మండలంలో సూచీకొండలోని కొండ గుహమందు ఉండేదట! తరువాత అక్కడ  నుండి, ఒక భక్తుని కోరిక మీద ఇప్పుడున్న ఈ చిన్న కొండ మీద వెలసాడని ఇతడు స్వయంభువు అని పౌరాణీకుల కథనం.


💠 దశరధ మహారాజు కొలువులో జాబాలి మహర్షి గురువు స్థానంలో ఉండేవారు. ఆయనకి శ్రీరామ చంద్రుడంటే అత్యంత ప్రేమ. శ్రీరాముడు వనవాసం వెళ్లినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. శ్రీరాముడి చేత వనవాసం మార్పించడానికి విఫలయ యత్నం చేశాడు.

💠 అయితే శ్రీరాముడు తన దీక్షను వదలలేదు. దీంతో శ్రీరాముడి లేని రాజ్యంలో తాను ఉండలేనని చెప్పి జబాలి మహర్షి దేశ సంచారానికి బయలుదేరాడు. 
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జమలాపురం పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకొంటాడు.
అప్పట్లో ఈ ప్రాంతాన్ని సూచీగిరి అని పిలిచేవారు. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్దుడైన జబాలి మహర్షి ఇక్కడే ఆ శ్రీరామ చంద్రుడి గురించి ఇక్కడ ఒక గుహలో తపస్సు చేస్తూ ఉండిపోతాడు.

💠 వనవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడికి అవతారం చాలించే సమయం వస్తుంది
ఆ తరుణంలో జబాలి మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు. 
ఈ భూమండలం ఉన్నంత వరకూ ఇక్కడే కొలువై ఉండాలని జబాలి మహర్షి కోరుతాడు. ఇందుకు శ్రీరాముడు ఇప్పుడు అందుకు సమయం కాదని చెబుతాడు.
కలియుగం ప్రారంభం రోజున ఇక్కడ తాను స్వయంభువుగా వెలిసి ఆ యుగం ముగిసేంతవరకూ ఉంటానని చెప్పి జబాలి మహర్షికి మోక్షం ప్రసాదిస్తాడు.

💠 ఇచ్చిన మాట ప్రకారం విష్ణువు అంశ అయిన శ్రీరామ చంద్రుడు శ్రీ వేంకటేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని చెబుతారు.

💠 తిరుమలలోని విగ్రహం కంటే ఇక్కడ ఉన్న సాలగ్రామ వేంకటేశ్వరుడు పురాతనమైనదని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరుడిగా వెలిసిన ఈ గుహను వైకుంఠగుహ అంటారు.
శ్రీరామ చంద్రుడే ఇక్కడి వేంకటేశ్వరుడిని కొలువై ఉండటం వల్ల ఇక్కడి దైవాన్ని దర్శించిన వారి ఇంట రామరాజ్యం వలే నిత్యం సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసం.

💠 ఇక ఇక్కడే కైలాస గుహ కూడా ఉంది. ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ సూచీగిరికి తూర్పున ఉన్న ఇంద్రకీలాద్రి పై తపస్సు చేసిన విషయం మనకు తెలిసిందే.
 ఆ సమయంలో పరమేశ్వరుడు అర్జునిడి శక్తిసామర్థ్యాలను పరీక్షించదలుచుకొంటాడు.
ఆ సమయంలో మూకాసురుడు శివుడి ఆదేశాలను అనుసరించి వరాహరూపం దాల్చిన ప్రదేశమే ఈ కైలాస గుహ అని చెబుతారు. ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని భక్తులు నమ్మకం. అందువల్లే జమలాపురం వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ గుహను కూడా సందర్శిస్తుంటారు.

💠 ఇక్కడ వెలిసిన వేంకటేశ్వరుడికి ఉప్పల నారాయణ శర్మ పూజలు చేసేవాడు. అతి నిటారైన పర్వతశిఖరం పై భాగంలో ఉన్న వైకుంఠ గుహను రోజూ చేరుకొని అక్కడి దైవానికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించేవాడు.
ఈయన వంశంలోని ఆరవ తరం వాడే అక్కుభట్టు. ఆయన కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఆయన కూడా వృద్యాప్యం వస్తుంది. వయస్సు మీద పడినా వేంకటేశ్వరుడి పూజకు మాత్రం ఎటువంటి లోటు రానించేవాడు కాదు.

💠 ఈ క్రమంలో ఒకరోజు దైవానికి పూజ చేసిన తర్వాత తాను ముసలివాడినవుతున్నానని ఇక కొండపైకి రాలేనని బాధపడుతాడు. అప్పుడు వేంకటేశ్వరుడు నీ బాధను అర్థం చేసుకొన్నాను. అయితే నీ నైవేద్యం స్వీకరించనిదే నేను ఉండలేనని చెబుతాడు.
అందువల్లే తానే ఈ రోజు నీ వెంట మీ ఇంటివరకూ వచ్చి అక్కడే కొలువై ఉంటానని చెబుతాడు. అయితే తాను నీవెంట వచ్చే సమయంలో వెనక్కు తిరగకూడదని వేంకటేశ్వరుడు షరతు పెడతాడు. ఇందుకు అక్కుభట్టు సంతోషంగా అంగీకరిస్తాడు.
అయితే కిందికి వచ్చే సమయంలో ఒక చోట పెద్ద శబ్దం వస్తుంది. దీంతో అక్కుభట్టు వెనక్కు తిరిగి చూస్తాడు. ఈ పరిమాణంతో వేంకటేశ్వరుడు ఇక్కడ సాలగ్రామ ప్రతిమగా మారిపోతాడు. ఈ విషయం ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసి అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మిస్తాడు.


💠సాలగ్రామ వేంకటేశ్వరుడి విగ్రహం వెనుక మానవ రూపంలోని వేంకటేశ్వరుడి విగ్రహాన్ని1975లో ఏర్పాటు చేశారు. 
అప్పటి నుంచి ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది. 

💠 ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడే పూజలు, ప్రార్ధనలతో సందడిగా ఉంటుంది. 
ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

💠 ఈ ఆలయానికి అతి దగ్గరలో జాబాలి మహర్షి కి సంబంధించిన సూచి గుట్ట అనే కొండ నేటికీ ఉంది. 

💠 ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉన్న జమలాపురం చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి

No comments: