2022 శ్రీవారి బ్రహ్మోత్సవాలు
3వ రోజు రాత్రి : ముత్యపుపందిరి వాహనం
💠 మూడవరోజు రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి భూదేవులతో కూడి మలయప్పస్వామి తిరుమాడవీధులలో విహరిస్తాడు.
💠 ముత్యాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. స్వాతి కార్తెలో వానచినుకు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి మంచిముత్యంగా మారుతుంది.
💠 శ్రీకృష్ణుడు “నాసాగ్రే నవమౌక్తికం”
(ముక్కుకొనలో క్రొత్తముత్యాన్ని ధరించినవాడు) అని వర్ణన.
💠 వేంకటేశ్వరుడు “మౌక్తికస్రగ్వి”
(ముత్యాలహారాన్ని ధరించినవాడు) అని ప్రస్తుతింపబడుచున్నాడు.
💠 శ్రీమన్నారాయణుడు “ముక్తాత పత్రితానంత సహస్ర ఫణమండలుడు"
(ముత్యాల గొడుగు వలె నున్న ఆదిశేషుని వేయిపడగల క్రిందనున్నవాడు) మంచిముత్యాలతో నిర్మించబడిన ముత్యపు పందిరిని వాహనంగా చేసుకొని మలయప్పస్వామి ఉభయదేవేరులతో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు.
💠 శరన్నవరాత్రులలో నిర్మలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను మించి ప్రకాశిస్తున్న విద్యుద్దీపాల మధ్య ప్రకాశిస్తున్న ముత్యాల పందిరివాహనం భక్తులకు నయనానందకరంగా సాగిపోతుంటుంది. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని సేకరిస్తున్నట్లున్న వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తుల తాపత్రయాలను పోగొట్టుతుంది.
💠 వేంకటేశ్వరుడు “నీరము ముత్యమట్లు నళినీదళసంస్థితమై తనర్చు నా నీరమె శుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచితప్రభన్”
💠 (నీటిబొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యంవలె కనిపిస్తుంది.
ఆ నీటిబొట్టే ముత్యపుచిప్పను ఆశ్రయించి మంచిముత్యమయి ప్రకాశిస్తుంది) కనుక ఓ భక్తజనులార! మీరుకూడ నీటి బొట్టు తామరాకును ఆశ్రయించినట్లు ఇతర దేవతలను ఆశ్రయించి ఆభాస సౌఖ్యమును పొందకుండ, నన్ను ఆశ్రయించి వాస్తవ సౌఖ్యాన్ని నీటి బొట్టు ముత్యపు చిప్పను ఆశ్రయించి మంచి ముత్యమయినట్లు పొందండి అని ఉపదేశిస్తున్నాడు.
💠 బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వరుడు ముత్యపుపందిరి వాహనంలో బకాసురుని చంచువులను పట్టుకొని గడ్డిపోచను చీల్చినట్లు చీల్చుచున్న శ్రీకృష్ణుని రూపంలో దుష్టుని శిక్షిస్తూ కనువిందు చేస్తాడు.
(ఈ అలంకారం మారుతుంటుంది) శ్రీకృష్ణుడు గోపాలురను కాపాడినట్లు వేంకటకృష్ణుడు దుర్జనుల బారినుండి భక్తులను కాపాడుతాడు.
No comments:
Post a Comment