Adsense

Thursday, September 29, 2022

తిథి.. నైవేద్యం

 తిథి-నైవేద్యం 


ప్రతిపద తిథియందు భగవతి జగదంబను ఆవు నెయ్యితో పూజించవలెను - అనగా షోడశోపచారములతో పూజించి గోఘృతమును నైవేద్యముగ సమర్పించవలెను. తదుపరి ఆ నెయ్యిని బ్రాహ్మణునకు దానము చేయవలెను. దీని ఫలితముగ మానవుడెప్పుడును రోగగ్రస్తుడు కాకుండును.

ద్వితీయ తిథియందు ఆ జననిని పూజించి చక్కెరతో భోగమును నివేదించవలెను. దానిని బ్రాహ్మణునకివ్వవలెను. ఇట్లు చేయుటవలన మానవుడు దీర్ఘాయుష్మంతుడగును.

తృతీయ తిథియందు భగవతి పూజయందు పాల ప్రాధాన్యత ఉండవలెను. పూజ తరువాత ఆ దుగ్ధమును బ్రాహ్మణున కొసగవలెను. ఇది సమస్త దుఃఖములనుండి ముక్తుడగుటకు పరమసాధనము.

చతుర్దీ తిథియందు అపూపములు సమర్పించవలెను.

పంచమినాడు అరటి ఫలములను భోగముగ నివేదించవలెను. దీని ప్రభావమున సాధకుడు బుద్ధి వికసించును.

షష్ఠినాడు దేవి  తేనె మాహాత్మ్యమును సంతరించుకొనును. దీని ప్రభావమున సాధకుడు ముందర రూపమును పొందును.

సప్తమీ తిథియందు భగవతి బెల్లము నైవేద్యముగ సమర్పించవలెను. అట్లు చేయుటవలన పురుషుడు శోకముక్తుడు కాగలడు.

అష్టమి తిథియందు భగవతికి నారికేళములను భోగములుగ నివేదించవలెను. నైవేద్యరూపమున ఆ కొబ్బరికాయను బ్రాహ్మణుని కివ్వవలెను. తత్ఫలితముగ సాధకునకు ఎట్టి సంతాపములు, బాధలు కలుగవు.

నవమినాడు జగదంబకు పేలాలు సమర్పించి బ్రాహ్మణునకు దానమొసగవలెను. ఆ దాన ప్రభావమున పురుషుడు ఇహపరలోకములందు సుఖించును.

దశమినాడు భగవతికి నల్లని నువ్వులు నైవేద్యముగ సమర్పింపవలెను. పూజ తరువాత నైవేద్యమును పరిగ్రహించిన బ్రాహ్మణుడు వాటిని ఉపయోగించుకొనవలెను. అట్లు చేయువానికి యమలోకభయము తొలగిపోవును.

ఏకాదశినాడు భగవతికి దధిని భోగముగ పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వవలెను. దానివలన భగవతి జగదంబ పరమసంతుష్టురాలగును.

ద్వాదశినాటి పూజయందు అటుకులకు మాహాత్మ్యముండును. ఆ రోజు భగవతికి అటుకులను భోగముగ నివేదించిన భగవతి అనుగ్రహమునకు పాత్రుడగును.

త్రయోదశి తిథినాడు ఆ దేవికి శనగలను నైవేద్యముగా సమర్పించిన సంతానవంతులగుదురు.

చతుర్దశినాడు దేవికి పేలపిండిని నివేదించినట్లయితే  భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడగును.

పూర్ణిమనాడు పాయసమును నివేదించిన అట్టి పురుషుడు తన సకల పితరులను ఉద్దరించును.

No comments: