శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనం
💠 సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
💠 కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
💠 సింహవాహనం - ధైర్యసిద్ధి
💠 శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
💠 బ్రహ్మోత్సవాలలో మూడవరోజు పగలు మలయప్పస్వామి ఒక్కడే సింహవాహనంపై ఊరేగుతాడు. సింహం మృగరాజు. " మృగాణాం చ మృగేంద్రోహం" అని శ్రీకృష్ణభగవానుడు సింహం యొక్క విశిష్టతను
“మృగాలలో సింహాన్ని నేనే” అని వివరించాడు.
💠 మృగరాజయిన సింహాన్ని చూచి ఇతర జంతువులు భయపడినట్లు భగవంతుని చూచి దేవతలు, మానవులు అందరూ మనం తప్పు చేసినచో స్వామి దండించునను భయం గలిగి ఉంటారు గనుక సింహపదం భగవంతునికి సార్థకమగుచున్నది.
💠 విష్ణువు సింహముఖుడై దుష్టుడైన హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినాడు. యోగశాస్త్రంలో సింహం వహనశక్తికి, గమనశక్తికి ప్రతీక. భీమాదులు సింహబలులు.
వేంకటేశ్వరస్వామికి నిలయమైన ఆనందనిలయంపై నలువైపులా సింహప్రతిమలు గలవు. అవి స్వామి రక్షణశక్తికి సంకేతాలుగా వున్నవి.
💠 బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వరస్వామి సింహవాహనుడై ఊరేగడం దుష్టజనసంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతం. ఉన్నతమైన ఆసనానికి సింహాసనమను పేరు గలదు.
నరోత్తముడు (రాజు) సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలను, రాజ్యాన్ని సంరక్షిస్తాడు. దుష్టులను శిక్షించేవాడు. ఈ విధంగా సింహం రక్షణశక్తికి సంకేతంగా మారింది.
ఓం నమో వెంకటేశాయ
No comments:
Post a Comment