Adsense

Saturday, October 1, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు5వ రోజు రాత్రి : గరుడ వాహనసేవ




⚠️" శ్రీవారి గరుడ వాహనసేవ వివరణ "

🛎 శ్రీవారి బ్రహ్మోత్సవాలలో  అత్యంత విశిష్టమైనది , దర్శనం మాత్రం చేతనే సర్వ పాపాలు హరించేటువంటి సేవ 🛎

🕉 " గరుడ వాహన సేవ "

మరి ఎంతో విశిష్టత కలిగిన గరుడ వాహనం గురించి తెలుసుకుందామా..... !

" కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభమ్ దీర్ఘబాహుం బృహత్స్కంధం
వందే నాగాంగభూషణమ్||

🔅తిరుమలలో జరిగే  బ్రహ్మోత్సవాలలో అయిదవనాటి రాత్రి జరిగే గరుడోత్సవం ప్రథమగణ్యమైంది.

💠 విష్ణువు- గరుడ సమ్మేళనం వేద స్వరూప, శీర్షాలుగా వ్యక్తమవుతుంది.
వేదములు ఋగ్వేదం, కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అను అయిదు విభాగములుగ వుంది.
కనుక తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో అయిదవ రోజు రాత్రి గరుడసేవ జరుగుచున్నది.

💠 గరుడ పంచాక్షరి (ఓం పక్షిస్వాహా) మంత్రంలో అయిదు అక్షరాలే వున్నాయి.
కనుక 'పంచవర్ణ రహస్యం’ అని స్తుతించబడే గరుడోత్సవం అయిదవ రోజు జరుగుచున్నది.

💠 దాసుడుగా, మిత్రుడుగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా వినతాసుతుడు శ్రీనివాసుని సేవించుచున్నాడు.
గరుడుడు విష్ణుదేవునికి వాహనం, ధ్వజంకూడ, కనుక గరుడధ్వజం ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. గరుడుడు ధ్వజస్తంభం మీద నిలిచి ముక్కోటి దేవతలను శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తుంటాడు. దేవతలు అదృశ్యులుగా (మానవుల కంటికి కనిపించకుండా) శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ధన్యులై స్వస్థానాలు చేరుతారు.

💠 స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి'
(ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు.

💠 తొమ్మిదిరోజుల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు రాత్రి జరిగే గరుడవాహన ఉత్సవంలో మలయప్పస్వామిని మూలమూర్తికి నిత్యం అలంకరించియుండే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ సహస్రనామమాల మొదలగు విశిష్టాభరణాలతో అలంకరిస్తారు.
అవి మాములుగా దర్శించుకోవడం కుదరదు. అందుకే అంత మంది వాటి దర్శనం కోసం వస్తారు..


💠 గరుడోత్సవంలో స్వామి ఒక్కడే పాల్గొంటాడు. దేవేరులు వుండరు.
కారణం..., గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
ఆర్తితో పిలిచే భక్తులను రక్షించడానికి
శంఖచక్రాది ఆయుధాలను ధరించి గరుడుని అధిరోహించి సంసిద్ధుడనై యుంటాను. నన్ను శరణు వేడండి. నా పాదాలను ఆశ్రయించండి. మీ రక్షణభారం నాకు వదిలేయండి. మిమ్ము తప్పక రక్షిస్తాను” అని హితం ఉపదేశిస్తుంటాడు.
కనుక వేంకటేశ్వరస్వామి వారి గరుడోత్సవం సర్వపాపహరం, సకల సంపత్కరం. శ్రేయోదాయకం.

💠 గరుడ సేవలో ధ్రువమూర్తి వేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి మలయప్పస్వామికి భేదం లేదన్నది సంప్రదాయం.
కనుక ఈ సమయంలో ఉత్సవమూర్తి దర్శనం అత్యంత శుభప్రదం,మోక్షదాయకం.

💠 ఆనాడే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరుక్షేత్రం నుండి అక్కడవున్న గోదాదేవికి - అలంకరించిన పూలమాలలను - ఆముక్తమాలలను - గరుడోత్సవం నాటికి ఉత్సవంగా తిరుమల తెప్పించి వేంకటేశ్వరస్వామికి అలంకరిస్తారు.

💠 ప్రతి సంవత్సరం గరుడోత్సవంనాడు చెన్న పట్టణంలోని తిరుపతి అంబ్రెల్లా ఛారిటీస్ వారు (ప్రస్తుతం హిందూ ధర్మార్థ సమితి) వేంకటేశ్వర స్వామివారికి తొమ్మిది గొడుగులను (ఆరు పెద్ద గొడుగులు, మూడు చిన్న గొడుగులు) నూతనంగా తయారుచేసి, పూజలు చేసి చెన్నైనుండి వూరేగింపుగా కాలినడకన తిరుమలకు తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు.


💠 4 మాడ వీధులు...4 వేదాలు...అందుకే చతుర్మాడ వీధులలో చెప్పులు వేసుకోరాదు అంటారు ..!!
ఈ 4 మాడ వీధులలో గరుడుని పై స్వామి ఉండగా ...ప్రత్యక్షంగా దర్శించే వారికి సర్వ పాపాలు తొలిగి...ఉత్తమగతులు కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి....అందుకనే గరుడ సేవ రోజు అన్ని లక్షల్లో భక్తులు వస్తారు .

💠 స్వామి గరుడుని మీద ఉండగా ప్రతి మాడ వీధిలో ...అంటే ఒకే ప్రదక్షిణ మార్గంలో  4 సార్లు... దర్శనము చేస్తే మనిషి 4 తరాల వారికి ఉత్తమ గతులు లభిస్తుంది ఒక గట్టి నానుడి.

💠 బ్రహ్మోత్సవాలలో గరుడాళ్వార్ర్ మీద స్వామి వేంచేసే గరుడ వాహనసేవ రోజున అలా ఒకే ప్రదక్షిణ మార్గం లో 4 సార్లు స్వామిని చూడడం అసాధ్యం...అందుకే పున్నమి గరుడ సేవ లో అలా దర్శించుకోవాలి అని...వేద పండితులు చెప్తారు.......

💠 ఈ విధంగా శ్రీవేంకటేశ్వరస్వామి గరుడోత్సవం విశిష్టమైన విలువైన ఆభరణాలంకారా లతో, నూతన పట్టు వస్త్రాలతో, కొత్తగొడుగులతో అంగరంగవైభవంగా కన్నుల పండువుగ జరుగుతుంది.


" కడు దివ్యరూపమా... గరుడ వాహనమా.."

🦅 గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం.

No comments: