Adsense

Saturday, October 29, 2022

65వ మహర్షి.. వశిష్ట మహర్షి

మన మహర్షుల చరిత్ర...!!
 65వ వశిష్ట మహర్షి గురించి తెలుసుకుందాం


🌸ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న వసిష్ఠ మహర్షి చాలా చాలా చాలా గొప్పవాడు. నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప ఋషుల గురించి రాసినా చదివినా, చదివి వినిపించినా కూడా పుణ్యమే. వసిష్ఠ మహర్షి భారతదేశంలో బ్రహర్షులందరిలో గొప్పవాడు. నవ బ్రహ్మల్లో గొప్పగా కీర్తించ తగినవాడు.

🌿సప్తమహర్షుల్లో ఉత్తముడు.
ఇక్ష్వాకువంశ క్షత్రియులకి కులగురువు . త్రిలోక పూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాథుడు. వసిష్ఠుడు దక్షుడి కూతురు " ఊర్జ ” ని పెళ్ళి చేసుకుని ఆమెకి ఏడుగురు కొడుకుల్ని అనుగ్రహించాడు . ఆ ఏడుగురికి సప్తమహర్షులని పేరు.

🌸తర్వాత వసిష్ఠుడు గొప్ప తపస్సు చేస్తూ రెండో బ్రహ్మలోకంలా వుండేలా ఒక అడవిలో ఆశ్రమం నిర్మించుకుని చాలామంది పితామహుల్లాంటి బ్రహర్షుల్నే శిష్యులుగా పొందాడు. ఒకనాడు అయోధ్య రాజయిన ఇక్ష్వాకుడు వసిష్ఠ మహర్షిని ఇంటికి తీసుకు వెళ్ళి కొన్నాళ్ళు తనింట్లోనే వుండమని పరిచర్యలు చేశాడు .

🌿రాజుని పిలిచి నీకేం కావాలనడిగాడు వసిష్ఠుడు . మహర్షీ ! మీరు మా కుల గురువుగా వుండాలని ప్రార్థించాడు రాజు. వసిష్ఠుడికి దివ్యదృష్టి వుంది కదా! దాని వల్ల శ్రీ మహావిష్ణువే ఈ వంశంలో శ్రీరాముడిగా పుడతాడని తెలుసుకుని కులగురువుగా వుండడానికి అంగీకరించాడు.

🌸అప్పటి నుంచి ఇక్ష్వాకువంశ రాజులందరికీ వసిష్ఠ మహర్షి కులగురువుగా వున్నాడు. ఇక్ష్వాకుడి తరువాత అతని కొడుకు నిమి రాజ్యానికి వచ్చి వసిష్ఠుణ్ణి చాలా గౌరవంగా చూశాడు. ఒకసారి నిమి వెయ్యి సంవత్సరాల సత్రయాగం చెయ్యాలనుకుంటున్నాను మీరు హోతగా వుండాలని గురువుగారిని అడిగాడు.

🌿వసిష్ఠుడు నాకు అభ్యంతరం లేదు కానీ , నీ కంటే ముందే ఇంద్రుడు వంద సంవత్సరాలు యాగం చెయ్యాలనడిగాడు. అందుకు సరేనన్నాను . కనుక అది అయిపోగానే ఇది మొదలుపెడుదాము అని చెప్పి వెళ్ళిపోయాడు. నిమి సత్రయాగానికన్నీ సిద్ధం చేసుకుని గౌతమ మహర్షిని హోతగా పెట్టుకుని యాగం ప్రారంభించాడు.

🌸వంద సంవత్సరాలు అయిపోగానే వసిష్ఠుడు తిరిగి వచ్చి నిమిని చూసి నన్ను హోతగా వుండమని చెప్పి వేరే వాళ్ళని కనీసం నాకు ఒకమాట కూడ చెప్పకుండా పెట్టుకున్నావు కాబట్టి నువ్వు శరీరం లేకుండా పోతావని శపించాడు.

🌿నిమి కూడా వసిష్ఠుడ్ని శపించాడు. అప్పుడు గౌతమ మహర్షి మొదలైన వాళ్ళు ఆ శరీరం పాడవకుండా చూస్తూ యాగం పూర్తి చేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా నిమి కోరిక ప్రకారం అన్ని జీవుల కళ్ళమీద ఉండేలా వరమిచ్చారు.

🌸అంటే మనం కళ్ళార్పుతూ వుంటాము అందుకే నన్నమాట! వసిష్ఠుడు శరీరం విడిచి పెట్టి తన తేజస్సునీ , యోగ విద్యా బలాన్ని మిత్రవరుణుల్లో ప్రవేశపెట్టాడు. మిత్రవరుణులు ఊర్వశిని చూసి ఆ తేజస్సుని బయటికి వదిలేస్తే దాన్ని రెండు కుండల్లో దాచింది ఊర్వశి.

🌿కొంతకాలం తర్వాత వసిష్ఠుడు మళ్ళీ శరీరాన్ని పొంది అగస్త్యుడితో పాటుగా కుండ నుండి బయటికి వచ్చి 'కంభసంభవుడు' అనే పేరు పొందాడు . నిమి శాపం వల్ల శరీరాన్ని విడిచినా వసిష్ఠుడు కారణజన్ముడు కనుక మళ్ళీ శరీరాన్ని పొందాడు.

🌸ఒకసారి వసిష్ఠుడు కర్దమ ప్రజాపతి ఇంటికొచ్చి అక్కడే వుండగా కర్దముడు తన కూతురు అరుంధతిని మహర్షికి సేవ చేయ్యడానికి పెట్టాడు. వసిష్ఠుడు దివ్య దృష్టితో అరుంధతిని తన భార్య అవుతుందని తెలుసుకొని కర్దముణ్ణి అడిగి పెళ్ళి చేసుకున్నాడు.

🌿ఒకసారి అరుంధతి పాతివ్రత్యం పరీక్షించాలని ఒక కమండలం ఇచ్చి నేను వచ్చేదాకా దీన్ని కింద పెట్టకుండా చేత్తోనే పట్టుకుని వుండమని చెప్పి ఎక్కడికో వెళ్ళాడు వసిష్ఠుడు. ఎంతకాలమైనా వసిష్ణుడు తిరిగి రాకపోతే అరుంధతి మాత్రం కమండలం కింద పెట్టకుండా పట్టుకుని అట్లాగే కూర్చుంది.

🌸ఆమె పాతివ్రత్యానికి భయపడి బ్రహ్మ మొదలైన దేవతలు వసిష్ఠుణ్ణి వెదికి తీసుకొచ్చారు. అరుంధతి ఆ కమండలం వసిష్ఠుడికిచ్చి పాదాలకి నమస్కారం చేస్తుంటే దేవతలు పూల వర్షం కురిపించారు .

🌿బ్రహ్మ దీర్ఘాయుషు, సుమంగళీత్వం ఇచ్చి ఆశీర్వదించాడు అరుంధతిని . అరుంధతీ వసిష్ఠులు అశ్రమానికి వచ్చి సుఖంగావున్నారు. గృహస్థాశ్రమంలోనే యోగం , భోగం , జపం , దానం , త్యాగం , ధర్మం అన్నీ అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా వున్నారు .

🌸ఒకసారి గాధి కొడుకైన విశ్వామిత్రుడు వేటకోసం వచ్చి అలసిపోయి వసిష్టాశ్రమానికి వచ్చాడు. వసిష్ఠుడు విశ్వామిత్రుడికి , అతని సైన్యానికి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో భోజనాలు పెట్టాడు.

🌿భోజనం చేశాక విశ్వామిత్రుడు నువ్వు బ్రాహ్మణుడివి , నేను రాజుని కాబట్టి ఈ కామధేనువుని నాకియ్యి , నీకు బోలెడు ధనమిస్తాను అన్నాడు. నేను దీని సహాయంతో పితృదేవతలకి ఆతిథ్యం ఇస్తున్నాను.

🌸ధనం, మణులు, గుర్రాలు వల్ల నాకేం ఉపయోగం ? కామధేనువుని ఇవ్వనన్నాడు వసిష్ఠుడు. విశ్వామిత్రుడు కామధేనువుని బలవంతంగా తీసికుపోతుంటే నిన్ను నువ్వే రక్షించుకోమన్నాడు వసిష్ఠుడు కామధేనువుతో.

🌿వెంటనే కామధేనువులోంచి అనేక వేలమంది సైన్యం వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు.

🌸విశ్వామిత్రుడు అవమానం భరించలేక శివుడి గురించి తపస్సు చేసి శస్త్రాస్త్రాలు పొంది మళ్ళీ వసిష్ఠుడి మీద దండెత్తి ఏమి చెయ్యలేక బ్రహ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు . విశ్వామిత్రుడు ఒక రాక్షసుణ్ణి పంపించి వసిష్ఠుడి నూర్గురు పిల్లల్ని చంపించాడు.

🌿వసిష్ఠుడు, ఆ బాధ భరించలేక అగ్నిప్రవేశం చేద్దామనుకున్నాడు. కాని మంటలు చల్లగా అయిపోయాయి . రాయి మెడకు కట్టుకుని సముద్రంలో దూకాలనుకుంటే నీళ్ళు పక్కకి తోసేశాయి.

🌸ఎన్నివిధాల ప్రయత్నించినా ఆత్మహత్య కుదర్లేదు వసిష్ఠుడికి , తర్వాత కోడలికి పరాశరుడు పుడతాడని తెలిసి ఆత్మహత్యా ప్రయత్నం విరమించాడు .

🌿భరతకులం వాడయిన సంవర్తుడు సూర్యుడు కూతురు తపతిని ఇష్టపడ్డాడు . గురువు వసిష్ఠుణ్ణి తపతితో పెళ్ళి చేయించమని అడిగాడు సంవర్తుడు. వసిష్ఠుడు సరేనని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి తపతికి సంవర్తుడితో పెళ్ళి జరిపించమని చెప్పి ఒప్పించి పెళ్ళి జరిపించాడు .

🌸శ్రీరాముడికి పూర్వం అసరణ్యుడనేవాడు దైవ ద్రోహం చేసి కుష్ఠు రోగంతో బాధపడుతుంటే ఆరోగ్య వ్రతం ఉపదేశించి రోగాన్ని తగ్గించాడు వసిష్ఠ మహర్షి .

🌿దశరధుడి కూతురు శాంతని రోమపాదుడికి పెంచుకోవడానికి ఇవ్వనంటే ఒప్పించి పంపాడు వసిష్ఠుడు. పరశురాముడు దశరధుణ్ణి చంపడానికి వస్తే శాంతని బ్రాహ్మణుడికిచ్చి పెళ్ళి జరిపించి రక్షించాడు.

🌸దశరధుడికి నలుగురు కొడుకులు పుట్టినప్పుడు వాళ్ళకి నామకరణం తానే చేశాడు వసిష్ఠ మహర్షి .. దశరధుడు చనిపోయినపుడు భరత శత్రుఘ్నులకి చెప్పి రాజ్యాన్ని కాపాడాడు.

🌿శివధనుస్సుని ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతని పెళ్ళి చేసుకుంటుంటే మిగిలిన ముగ్గురికీ కూడా తానే దగ్గరుండి పెళ్ళి జరిపించాడు వసిష్ఠ మహర్షి.వసిష్ఠుడు జనక మహారాజుకి మోక్షం గురించి , మోక్షాన్ని పొందే మార్గం గురించి వివరంగా చెప్పాడు.

🌸అలాగే దిలీపుడు కూడా వసిష్ఠుణ్ణి మోక్ష మార్గం గురించి అడిగి తెలుసుకున్నాడు. పూర్వం సూర్యవంశపు రాజయిన సూర్యారుణుడు తన కొడుకు సత్యవ్రతుణ్ణి ఊరి నుంచి గెంటేశాడు .

🌿తర్వాత తాను కూడ తపస్సు చేసుకుందుకు అడివిలోకి వెళ్ళిపోయాడు. ఆరాజ్యం అరాజకం కాకుండా వసిష్ఠుడు కాపాడాడు. విశ్వామిత్రుడు భార్య పిల్లలు తినడానికి లేక ఇబ్బందులు పడుతుంటే సత్యవ్రతుడు మాంసం తీసికొచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు.

🌸ఒక రోజు ఏ జంతువూ దొరకకపోతే వశిష్టుడి దగ్గరున్న ఆవుల్లో ఒక ఆవుని చంపి మాంసం తీసుకుంటుండగా వసిష్ఠుడు చూసి నువ్వు చేసిన తప్పులకి త్రిశంకుడవుతావు అని శపించాడు.

🌿సత్యవ్రతుడు శరీరంతోనే స్వర్గానికి వెళ్ళేలా యాగం చేయించమని వసిష్ఠుడు అతడ్ని చివాట్లు పెట్టి అలాంటివి కుదరవన్నాడు . విశ్వామిత్రుడు సత్యవ్రతుడితో యజ్ఞం చేయించి త్రిశంకు స్వర్గానికి పంపించగలిగాడే కానీ వసిష్ఠుడి మాటకి తిరుగులేక స్వర్గానికి చేర్చలేకపోయాడు.

🌸త్రిశంకుడి కొడుకు హరిశ్చంద్రుడు సత్యవ్రతుడని వశిష్టుడు చెప్పాడు . కాదని నిరూపించడానికి ఎంతో ప్రయత్నంచి విఫలుడయ్యాడు విశ్వామిత్రుడు.

🌿సకల సంపదలతో తులతూగే మాంధాత చక్రవర్తి వశిష్టుణ్ణి తన సభలో బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తనకి జ్ఞానం తెలిపి మోక్షం పొందేలా చెయ్యమని ప్రార్థించాడు .

🌸కర్మ స్వరూపం, బ్రహ్మ స్వరూపం, వేదవేదాంత పురాణ స్వరూపం, ఉపాసక స్వరూపం, భగవదవతార రహస్యం, భక్తియోగ స్వరూపం అన్నీ వివరంగా చెప్పి, 'అష్టాక్షరీ ' మంత్రరత్నాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు వశిష్ఠ మహర్షి.

🌿వశిష్ఠ మహర్షి రాసిన గ్రంథాల్లోంచి వశిష్ఠ ధర్మసూత్రం, వృద్ధ వాశిష్ఠ, యోగ వాశిష్ఠ, జ్ఞానవాసిష్ఠ, జ్యోతిర్వాశిష్ఠ మొదలైనవి ఉన్నాయి. వశిష్ఠ మహర్షి స్మృతికర్తల్లో ఒకడు.
వశిష్ఠస్మృతిలో ముఫ్పై అధ్యాయాలున్నాయి.

🌸స్వస్తి

No comments: