Adsense

Tuesday, October 4, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 6వ రోజు రాత్రి : గజవాహనం




💠 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి  శ్రీ మలయప్ప స్వామివారు గ‌జ వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిస్తారు..


💠 బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి రాత్రి మలయప్పస్వామి ఒక్కడే గజరాజుపై ఊరేగుతూ భాగవతంలోని గజేంద్రమోక్షం వృత్తాంతాన్ని స్మరింపజేస్తాడు.


💠 భక్తజనులారా! ఈ గజరాజు బలగర్వితుడు.
ఒకనాడు జలక్రీడలాడుతూ మొసలికి పట్టుబడి దానితో చాలాకాలం పోరాడి చివరకు దీనుడై “లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర! కావవే వరద ! సంరక్షించు భద్రాత్మకా!” ఈశ్వరా ! బలం కొంచెమైనను లేదు. ధైర్యం నశించింది. ప్రాణాలు తమ స్థానాలనుండి తప్పుకొంటున్నవి. సొమ్మసిల్లినాను. శరీరం కృశించిపోయింది. అలసట కలుగుతున్నది. ఇక మొసలితో పోరాడలేను. నిన్నే తప్ప మరొక రక్షకుని ఎరుగను. ఈ దీనుని నీవే రక్షించాలి. ఈశ్వరా! వేగరమ్ము వరదా! నన్నుకాపాడు. పరమాత్మా! నన్ను రక్షించు, అని శరణు వేడినాడు.

💠 ఆ క్షణమే విశ్వమయుడైన విష్ణుదేవుడు
" అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమావినోది" యైనను ఆపన్న ప్రసన్నుడై వైకుంఠం నుండి భారతదేశానికి వచ్చి, మొసలిని సంహరించి గజరాజును కాపాడినాడు.

💠 కనుక భక్తులారా! మీరు కూడ స్వశక్తిపై, బలంపై ఆధారపడకుండా మీ రక్షణభారం నా మీద ఉంచండి. నేను మిమ్మల్ని తప్పక రక్షించుతాను అని గజవాహనడైన వేంకటేశ్వరుడు ఉపదేశమిస్తున్నాడు.

💠 సంసారం ఒక సరస్సు. మొసలి కర్మ. గజేంద్రుడు జీవుడు. సంసారం నుండి కర్మనుండి విముక్తిని ప్రసాదించేవాడు విష్ణుదేవుడు. ప్రతిభక్తుడు ఒక గజేంద్రుడు. సంసారబంధంనుండి, కర్మబంధం నుండి విముక్తిని ప్రసాదించేవాడు వేంకటేశ్వరుడు. కనుక వేంకటేశ్వరుని శరణు వేడుకోవాలి.

💠 రాజలాంఛనాలలో, చతురంగబలంలో గజబలం ఒకటి. నేటికీ గజారోహణం (ఏనుగుపై ఊరేగడం) గొప్ప గౌరవం.
విశిష్ట సన్మానం. శరణాగతి ప్రయోజనాన్ని వివరించే పురాగాథ గజేంద్రమోక్షం.

🙏 గజవాహనం - క‌ర్మవిముక్తి 🙏

        
💠 రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

No comments: