Adsense

Wednesday, October 5, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9వ రోజు ధ్వజావరోహణం

 

🙏 ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

        
💠 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.

         
💠 ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

        
💠 ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.


🔆 బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ నాటి రాత్రి ధ్వజావరోహణ ఉత్సవం ఆలయంలో జరుగుతుంది.

💠 శ్రీదేవీ భూదేవీ సహిత మలయప్పస్వామి
సమక్షంలో వేదపండితులు వేదం పారాయణ చేయుచుండగా, మంగళవాద్యాలు మ్రోగుచుండగా, భేరీనినాదాలు మార్మోగుచుండగా బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలురకు వీడ్కోలు చెప్పుచు గరుడకేతనాన్ని ధ్వజస్తంభం మీద నుండి దించుతారు.
ఇట్లు బ్రహ్మోత్సవాలు గరుడకేతనం ఎగురవేయడంతో బ్రహ్మాది దేవతలను, దిక్పాలురను ఆహ్వానించడంతో ప్రారంభమై గరుడధ్వజం దించి వేయడంతో బ్రహ్మాది దేవతలకు, దిక్పాలురకు వీడ్కోలు చెప్పడంతో పరిసమాప్తమవుతాయి.


💠 ధ్వజావరోహణం తర్వాత ఉత్సవమూర్తులకు నివేదన, కర్పూర నీరాజనం జరుగుతాయి. తర్వాత అర్చకులకు, ఆచార్యపురుషులకు సత్కారం జరుగుతుంది.

💠 పిమ్మట మలయప్పస్వామి శ్రీదేవి భూదేవీ సమేతుడై రంగనాయకుల మండపం చేరుతారు.
ఈ ఉత్సవమూర్తులు బ్రహ్మోత్సవ ప్రారంభంనుండి ఆనందనిలయాన్ని, ధ్రువమూర్తి సన్నిధానాన్ని వీడి దీపావళి వరకు రంగనాయకుల మండపంలో కొలువైవుంటారు.

No comments: