Adsense

Wednesday, October 26, 2022

9వ మహర్షి .. ఉతథ్య మహర్షి (VUTHADHYA MAHARSHI)

మన మహర్షుల చరిత్ర...!!

ఈరోజు 9వ మహర్షి  ఉతథ్యమహర్షి చరిత్ర


🌿బ్రహ్మదేవుడు మనస్సునుండి పుట్టిన మానసపుత్రులు అనబడే వారిలో మూడవవాడయిన అంగిరస మహర్షి కొడుకే మన ఉతథ్య మహర్షి ..

🌸 అంగిరసుడికి పెద్దకొడుకన్నమాట . ఉతథ్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు . నెమ్మదయిన వాడు , తీర్థయాత్రలంటే చాలా ఇష్టమున్నవాడు .

🌿ఈయన భార్య పేరు మమత . వారికి సంతానం కలగగానే ఉతథ్యుడు తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు . దేవతలు రాక్షసుల్ని ఓడించి వాళ్ళని కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు .

🌸 రాక్షసులు తమ గురువయిన శుక్రాచార్యుడికి విషయం చెప్పి రక్షించమన్నారు .

🌿శుక్రాచార్యుడు వాళ్ళ కష్టాలు తీర్చడానికి అస్త్రాలు , శస్త్రాలు తీసుకుని వస్తానని శివుణ్ణి గురించి తపస్సు చెయ్యడానికి వెళ్ళాడు .

🌸 ఆ సమయంలో బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసులందర్ని వశపరచుకున్నాడు .

🌿 శుక్రాచార్యుడు వచ్చాక విషయం తెలుసుకుని బృహస్పతిని శపించాడు . ఒకసారి బృహస్పతి తన అన్న ఉతథ్య మహర్షి ఇంటికి వెళ్ళాడు .

🌸వదిన మమత అతన్ని ఆదరించి భోజనం పెట్టింది . బృహస్పతి శుక్రాచార్యుడి శాపం వల్ల ధర్మం , మంచితనం మర్చిపోయి వదినగారితో అనుచితంగా ప్రవర్తించాడు .

🌿 అతని వల్ల ఒక కుమారుడు కలిగాడు మమతకి.. 
కానీ అప్పటికే ఆమె కడుపులో వున్న బిడ్డ బృహస్పతి శాపం వల్ల గుడ్డివాడయ్యాడు .

🌸ఉతథ్య మహర్షి యాత్ర ముగించుకుని వచ్చి జరిగింది అంతా విన్నాడు . ఇదంతా శుక్ర చార్యుడి వల్లనే జరిగిందని చెప్పి మమతని ఓదార్చాడు .

🌿 కొంతకాలం తర్వాత మాంధాత అనే చక్రవర్తి ఉతథ్య మహర్షికి శిష్యుడయి రాజనీతి గురించి తెలుసుకున్నాడు .

🌸 దాని పేరే ' ఉతథ్యగీత ' . ' ఉతథ్య గీత ' రాజధర్మాన్ని బోధిస్తుంది . రాజధర్మం అంటే రాజు అనేవాడు ప్రజలతో ఎలా ఉండాలి , ధర్మాన్ని ఎలా నిలపాలి అని తెలియపరుస్తుంది .

🌿దాన్లో ఏముందో మనం కూడా తెలుసుకుందామా ..... రాజు ధర్మంగా ఉంటే ప్రజలు నిశ్చింతగా భయం లేకుండా బ్రతుకుతారు .

🌸 ధర్మం వేదవిదుల వల్ల కలిగింది కాబట్టి రాజెప్పుడూ వేదవిదులను పూజించాలి . అసూయ దురభిమానం ఉంటే ఆ రాజు దగ్గర లక్ష్మీదేవి ఉండదు .

🌿నాలుగు వర్ణాల వాళ్ళు ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారా లేదా అని రాజు చూడాలి . శూద్రుడికి సేవ , వైశ్యుడికి కృషి , క్షత్రియుడికి దండనీతి , బ్రాహ్మణునికి బ్రహ్మచర్యం ,

🌸తపస్సు చేయడం , నిజం పలకడం ధర్మాలు . ప్రజలు దీనంగా వేడుకుంటున్నప్పుడు కూడా రాజుదగ్గర ఉండే ఉద్యోగులు కఠినంగానూ , ధనాశతోనూ ప్రవర్తించకూడదు .

🌿ఏ రాజ్యంలో ప్రజలు ధర్మంగా ఉంటారో ఆ రాజు కీర్తి నాలుగు దిక్కులా వినపడుతుంది .

🌸 తప్పు చేసినది కొడుకయినా రాజు క్షమించకూడదు . సాధువులని పూజించడం , ఎప్పుడు నిజాన్నే మాట్లాడడం , భూదానాలు చెయ్యడం , అతిథులని గౌరవించడం లాంటివి రాజు చెయ్యాల్సిన ధర్మాలు .

🌿 ధర్మాత్ముడైన రాజు ఇంద్రుడితో సమానం . ఇలాంటి రాజుని దేవతలు , ఋషులు , గంధర్వులు కూడ కీర్తిస్తారని మాంధాత మహారాజుకి ఎన్నో రాజధర్మాల్ని గురించి ఉతథ్య మహర్షి చెప్పాడు .

🌸అందుకే ఉతథ్య మహర్షి ధర్మోపదేశకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ...

ఇదండి  ఉతథ్యమహర్షి  చరిత్ర

No comments: