Adsense

Wednesday, October 12, 2022

మహబూబ్ నగర్ జిల్లా : "జమ్మిచేడు" ( గద్వాల్) - శ్రీ జమ్ములమ్మ దేవాలయం

 మహబూబ్ నగర్ జిల్లా :   "జమ్మిచేడు" ( గద్వాల్) - శ్రీ జమ్ములమ్మ దేవాలయం

💠 బండరాయిలో వెలసినా... ఆ తల్లి మనసు మాత్రం బంగారమే. కోరిన కొర్కెలు తీరుస్తుంది. కష్టాల కడిలి నుంచి ఒడ్డుకు చేరుస్తుంది.
జానపదులు బాలమ్మ, నాగమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, కట్ట మైసమ్మ వంటి అనేకమంది దేవతలను పూజిస్తూ ఉంటారు.
అయితే కొందరు దేవతలు కొన్ని ప్రాంతాలు లేదా ఊర్లకు మాత్రమే పరిమితమై ఉంటారు. దేవత పేరు మీదుగానే కొన్ని గ్రామాలకు పేర్లు స్థిరపడతాయి. అటువంటి ఉదంతమే జమ్ములమ్మ దేవతకు ఉన్నది.

💠 రేణుకామాత  అమితమైన తేజస్సుతో విరాజిల్లే జమదగ్ని మహర్షి భార్య. పరశురాముని తల్లి .
ఆమె దేవాలయం ఒకటి మహారాష్ట్రలోని , పూణే దగ్గర ఉంటుంది.
సాధారంగా నాసిక్ , షిరిడీ వెళ్లేవారు , ఆ రేణుకామాత దేవాలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు .
ఆ దేవి అనుగ్రహం వలన ఆకర్షణ కలుగుతుంది.
అటువంటి అమ్మవారు తెలుగు
ప్రాంతంలో మనకి అత్యంత సమీపంలోనే విడిది చేసి ఉన్నారు .
ఆ ఆలయ విశేషాలు ఇక్కడ ఏమీకొసం....

💠 గద్వాల పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మిచేడు గ్రామంలో జమ్ములమ్మ దేవత, పరుశురామస్వామి దేవాలయాలు ఉన్నాయి.
జానపదుల్లో ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం...
పోతులపాడుగా పేరున్న నేటి జమ్మిచేడు గ్రామ శివారులో ఈతవనం వద్ద ఉన్న పొలంలో రైతు ఒకరు వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.
పొలం దున్నే క్రమంలో నాగలి లోతుకు వెళ్ళాలని బరువుకోసం ఓ రాయిని నాగలిపై తెచ్చి పెట్టి దున్నాడు. సాయంత్రం పని ముగించుకొని రాయితో సహా నాగలిని పొలం వద్ద వదిలిపెట్టి ఇంటికి వెళ్ళినాడు. తిరిగి మరుసటి రోజు ఎద్దులతో పొలంలోకి వెళ్ళగా నాగలికి కట్టిన రాయి అక్కడ లేకపోగా తెచ్చిన స్థానంలో ఉండడం చూసి రైతు ఆశ్చర్యానికి లోనయ్యాడు. రాయిని తిరిగి అక్కడి నుండి తీసుకొచ్చి మళ్ళీ నాగలికి కట్టి పొలం దున్ని సాయంత్రం నాగలిని అలాగే వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు వచ్చిచూడగా మళ్ళీ రాయి యథాస్థానంలో ఉండడం చూసి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని అనుమానించాడు. అలా చేస్తున్న దేవరో తెలుసుకోవాలనే అతృతతో ఆ రాత్రి నిద్ర రాకుండా చిటికెన వేలు కోసుకొని పొలం దగ్గర కావలి కాస్తున్నాడు.

💠 సరిగ్గా రాత్రి 12-00 గంటల ప్రాంతంలో నాగలికి కట్టిన రాయి అందమైన దేవతారూపం దాల్చి తెల్లని వస్త్రాలతో గతంలో ఉన్న స్థానం లోకి చేరుతూ రాయిగా మారిపోవడం చూసి రైతు తన జన్మ పావనమైందని తలచుకొని గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలిపాడు. గ్రామస్తులెవ్వరూ దీనిని నమ్మలేదు.
రైతుతో కలిసి గ్రామస్తులు మరుసటి రోజు రాత్రికి పొలం వద్దకు వెళ్ళి చూడగా అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఆ రాయి అమ్మవారిగా మారి నడుచుకుంటూ పోయి తిరిగి అదే స్థానంలో రాయి అయిన దృశ్యాన్ని చూసి ఆ ప్రదేశంలోనే అమ్మవారికి చిన్న గుడిని నిర్మించారు. అప్పటి నుండి పోతులపాడు గ్రామాన్ని జమ్మిచేడుగా నామకరణం చేశారన్నది గ్రామస్తులు చెప్పుతుంటారు. కాగా అమ్మవారు జమ్మిచేడు గ్రామంలో స్వయంభూగా వెలసినందున అమ్మ వారిని శ్రీ జములమ్మ దేవతగా భావించి పూజించసాగారు.

💠 జమ్ములమ్మ జాతర ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ పౌర్ణమి ముందు మంగళవారము రోజున జరుగుతుంది. అమ్మవారిని సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి పుట్టినిల్లు అయిన గుర్రం గడ్డ గ్రామము నుండి దేవస్థానమునకు తీసుకొనివస్తారు.
ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రోజులలో భక్తులు వేలాదిగా దర్శిస్తూ ఉంటారు.

💠 జమ్ములమ్మ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని కోరికలను అమ్మవారికి విన్నవించు కుంటారు.
ఆ కోరికలు నెరవేరితే ఏమేమి చేయాలనుకుంటారో వానితో అమ్మవారికి భక్తిశ్రద్దలతో సమర్పిస్తారు. తల వెంట్రుకలు ఇవ్వడం, అమ్మవారి విగ్రహానికి వెండి లేదా బంగారు కళ్లు చేయించడం, నాలుక, హస్తములు, పాదములు చేయించి అమ్మవారికి అలంకరిస్తారు. బోనాలు, యాటలు (మేక, గొర్రె, పోటేలు, మేకపోతు) కందిపప్పు, బెల్ల్లం, పూలు, పండ్లు, నిమ్మకాయలను ఆర్పిస్తారు. అమ్మవారికి వడిబియ్యం కూడ పోస్తారు.
చీర, గాజులు, కుంకుమ, పసుపు, కొబ్బరిగిన్నెలు (కుడుకలు) ఆకులు, వక్కలు, ఖర్జూరం మొదలగునవి సమర్పిస్తారు. నైవేద్యంలో భాగంగా అమ్మవారికి యాట మాంసము, పూర్ణం, బచ్చాలు, అలసంద గుగ్గిలు(బెబ్బర్ల గుగ్గిలు), కూరగాయలు, పాయసం, నైవేద్యంగా సమర్పిస్తారు.

💠 జమ్ములమ్మ ఆలయం ముందర పరశురాముని ఆలయం కూడ ఉన్నది. అమ్మవారి దర్శనం అనంతరం పరశురాముని దర్శనం చేసుకుంటారు. పరుశరాముడికి కూడ మొక్కుబడులను చెల్లిస్తుంటారు.
కళ్ళు, మీసాలు, హస్తములు, పాదములు, గుడిగంటలు వంటివి సమర్పిస్తారు.
ఇక్కడ నాగమ్మ దేవత పుట్ట కూడ ఉన్నది. నాగమ్మ దేవతను కూడ పూజిస్తారు. చీర, టెంకాయ, ఆకులు, పూలు, పండ్లు మొదలగు వస్తువుతో పూజలు చేశాక మొక్కుబడులు, నైవేద్యం సమర్పించిన తరువాత కుల బంధు మిత్రులకు అమ్మవారి పరిసర ప్రాంతములలో అన్నదానములు చేస్తూ, విందు వినోదాలతో సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటారు.
ఆలయం 
గద్వాల నుండి 4 కిమీ. దూరంలో ఉంటుంది.

No comments: